close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెత్తకి... చాలా ఆఫర్లున్నాయి!

పాడైపోయింది ఏదైనా చెత్తబుట్టలో పడేయడం చాలామందికి అలవాటు... దాన్ని మానుకోమంటున్నాయి ఈ సంస్థలు. రోజువారీ వంటింటి చెత్త కాకుండా ప్లాస్టిక్కు, పేపర్లు, విద్యుత్తు పరికరాల్లాంటివి ఏవి ఉన్నా ఒక్క ఫోను చేస్తే ఇంటికొచ్చి డబ్బులిచ్చి మరీ తీసుకునివెళ్తున్నాయి. బాధ్యతగా రీసైక్లింగ్‌ చేయిస్తున్నాయి.


ఈ- వ్యర్థాలకు ‘కరో సంభవ్‌’!

రీసైక్లింగ్‌ మీద అవగాహన లేకా, సరైన పరిజ్ఞానం లేకా ఇంకా మన దేశంలో ఎన్నో విలువైన లోహాలు టన్నుల కొద్దీ చెత్త కుప్పల్లో పడి ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి, భూమినీ నీటినీ కలుషితం చేస్తున్నాయి. ఆ సమస్యను పరిష్కరించడంలో తనవంతు పాత్ర పోషిస్తోంది ‘కరో సంభవ్‌’. గురుగ్రామ్‌లో ప్రారంభమై దేశవ్యాప్తంగా 60 నగరాల్లో సేవలందిస్తున్న ఈ సంస్థ వ్యక్తిగత వినియోగదారులతో మొదలుపెట్టి విద్యా, వ్యాపార సంస్థలూ మల్టీ నేషనల్‌ కార్పొరేషన్లతోనూ కలిసి పనిచేస్తోంది. లక్షల టన్నుల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు చెత్తకుప్పలకు చేరకుండా రీసైకిల్‌ అయ్యేందుకు తోడ్పడుతోంది. ఆపిల్‌, డెల్‌, లెనొవొ లాంటి సంస్థలు వినియోగదారుల నుంచి వెనక్కి తీసుకున్న పాడైన, పాత వస్తువులను ‘కరో సంభవ్‌’కి అందజేస్తున్నాయి. ఈ సంస్థ వేర్వేరు ప్రాంతాల నుంచి వ్యర్థాలను సేకరించడమే కాక పాఠశాలల్లో, కార్యాలయాల్లో, గృహసముదాయాల్లో ఈ- వేస్ట్‌ని విడిగా భద్రం చేసి, రీసైక్లింగ్‌ చేసే సంస్థలకు అందించాల్సిన అవసరంపైనఅవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దేశంలో ఎలక్ట్రానిక్‌ చెత్తకుప్పలుగా పేరొందిన దిల్లీలోని సీలంపూర్‌లాంటి ప్రాంతాల నుంచి కూడా పరికరాలను రీసైక్లింగ్‌కి తీసుకెళ్తుంది కరో సంభవ్‌. ఇంటికి వచ్చి ఈ- చెత్తను తీసుకెళ్లడమే కాదు, అవి వేర్వేరు దశల్లో ఎలా రీసైకిల్‌ అయ్యేదీ వినియోగదారులు ఆప్‌లో తెలుసుకునే ఏర్పాటు కూడా చేసింది ఈ సంస్థ.


మిస్డ్‌ కాల్‌ చాలు...

యటే కాదు, ఇళ్లలోనూ చెత్త పెద్ద సమస్యే. రోజువారీ చెత్తను మున్సిపాలిటీ బండి పట్టుకుపోతుంది కానీ వార్తాపత్రికలూ, పాడైపోయిన విద్యుత్‌ పరికరాలూ, సెల్‌ఫోన్లూ, ఆన్‌లైన్‌ షాపింగ్‌తో వచ్చిన కార్డుబోర్డు ప్యాకెట్లూ, వాటర్‌ బాటిల్సూ, ప్లాస్టిక్‌ కవర్లూ లాంటివి చాలా ఇళ్లలో స్టోర్‌ రూమ్‌లోనో బాల్కనీలో ఓ మూలో కుప్పగా పడి ఉంటాయి. ఎప్పటికప్పుడు వాటిని పాత సామానువాళ్లకి ఇచ్చేయాలనుకుంటారు కానీ తీర[దు. కొంతమంది వాటిని కూడా రోజువారీ చెత్తతో కలిపి పారేస్తుంటారు. చెత్తని అలా నెలల తరబడి పోగేసి ఉంచడమూ మంచిది కాదు. మామూలు చెత్తతో కలిపి పారేయడమూ సరికాదు. ఆ సమస్యకి పరిష్కారంగా ప్రారంభించిందే ‘స్క్రాప్‌క్యూ’. హైదరాబాద్‌లో పనిచేస్తూ ఇతర నగరాలకూ విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న ఈ సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మన చిరునామాతో పాటు అనువైన సమయాన్నీ అందులో నమోదు చేస్తే వాళ్ల మనుషులు వచ్చి చెత్తను తీసుకెళ్తారు. ఉచితంగా కాదు, అప్పటికప్పుడు దాన్ని తూచి తగిన ప్రతిఫలం ఇస్తారు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్‌ చేయడానికి వీలుకాని వాళ్లు 040- 30707070, 9030727277 నంబర్లకు మిస్డ్‌ కాల్‌ ఇచ్చినా చాలు. వాళ్ల సిబ్బందే ఫోన్‌ చేసి వివరాలు కనుక్కుని వచ్చి చెత్త తీసుకెళ్తారు. మనమే తీసుకెళ్లి ఇవ్వాలనుకుంటే అందుకూ కొన్ని సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది సంస్థ.


పాతవాటి స్థానంలో కొత్తవి!

వాడేసిన, పాడైపోయిన పాత సామాను ఇచ్చి డబ్బు తీసుకోవడానికి కొందరు మొహమాటపడితే, కొందరేమో కొన్న ధరతో పోల్చి సరైన ధర కాదని అసంతృప్తి వ్యక్తంచేస్తారు. మరికొందరేమో ఇష్టపడి కొనుక్కున్న వస్తువుల మీద వ్యామోహం వదులుకోలేక తర్వాత చూద్దాంలే అంటూ వాయిదా వేసి వాడని వస్తువుల్ని కూడా భద్రంగా దాచిపెట్టుకుంటారు. ఇలాంటి వాళ్లందరికీ సంతృప్తిని కలిగించే పరిష్కారంతో వచ్చింది ‘యూజ్‌డ్‌’ ఆప్‌. కేవలం ఈ- వేస్ట్‌నే కాదు, పాత దుస్తుల్లాంటివాటిని కూడా ఈ సంస్థ ఇంటికొచ్చి తీసుకుంటుంది. ఆయా వస్తువుల విలువ ఎంత ఉంటుందో ఇతర వేదికల మీద పోల్చిచూపించి మరీ కచ్చితంగా ధర నిర్ధారిస్తుంది. నగదు తీసుకోవడం ఇష్టపడనివారికి పాయింట్లు ఇచ్చి ఆ పాయింట్లను ఉపయోగించడం ద్వారా బ్రాండెడ్‌ షాపుల్లో తమకు కావలసిన వస్తువుల్నీ, దుస్తుల్నీ డిస్కౌంటులో పొందే సౌకర్యం కల్పిస్తోంది. పాత వస్తువు ఇచ్చినప్పుడే దాని స్థానంలో మనకు నచ్చిన కొత్తది తీసుకునే ఏర్పాటూ ఉంది. మన దగ్గర ఉన్న పాత వస్తువులకు ఎక్కడెక్కడ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు ఉన్నాయో కూడా ఈ ఆప్‌లో తెలుసుకోవచ్చు. ఒక్కోసారి కొంచెం రిపేరు చేయించుకుంటే పనిచేసే వస్తువుల్ని కూడా ఎక్కడ రిపేరు చేయించాలో తెలియక పాత సామానులో పడేస్తారు కొందరు. అలాంటివారికి దగ్గర్లో రిపేరు చేసే సౌకర్యం ఎక్కడ ఉన్నదీ కూడా చెబుతుందీ ఆప్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు