close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పనీర్‌తో... పాప్‌కార్న్‌!

పనీర్‌తో మంచూరియా, మసాలా కూరల్లాంటివి అందరూ చేసేవే. కానీ పిల్లల నుంచీ పెద్దలవరకూ ఇష్టపడే పనీర్‌ని అలాంటి కొన్ని రుచులకే పరిమితం చేయకుండా ఈసారి స్నాక్స్‌ రూపంలోనూ ట్రైచేద్దామా...

కోఫ్తా

కావలసినవి పనీర్‌ తురుము: కప్పు, బ్రెడ్‌స్లైసులు: మూడు, ఉల్లిపాయ: ఒకటి, క్యాప్సికం తరుగు: పావుకప్పు, వెల్లుల్లి తరుగు: అరచెంచా, పచ్చిమిర్చి: రెండు, పుదీనా ఆకులు: ఏడు, నిమ్మరసం: అరచెంచా, జీలకర్రపొడి: అరచెంచా, చాట్‌మసాలా: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం
ఓ గిన్నెలో నూనె, బ్రెడ్‌స్లైసులు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకోవాలి. తరువాత బ్రెడ్‌స్లైసుల్ని ఓసారి నీటిలో ముంచి పనీర్‌ మిశ్రమంలో వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. అయిదు నిమిషాలయ్యాక ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


పెప్పర్‌ పనీర్‌

కావలసినవి పనీర్‌ ముక్కలు: రెండు కప్పులు, ఉల్లిపాయ: ఒకటి పెద్దది, పచ్చిమిర్చి: రెండు, అల్లం తరుగు: చెంచా, వెల్లుల్లి తరుగు: చెంచా, టొమాటోసాస్‌: టేబుల్‌స్పూను, పసుపు: పావుచెంచా, మిరియాలపొడి: టేబుల్‌స్పూను, నూనె: టేబుల్‌స్పూను, కొత్తిమీర: కట్ట,  ఉప్పు: తగినంత, గరంమసాలా: అరచెంచా, సోంపు: పావుచెంచా, జీలకర్రపొడి: పావుచెంచా.
తయారీ విధానం స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. ఇప్పుడు అల్లం-వెల్లుల్లి-పచ్చిమిర్చిని కలిపి ముద్దలా చేసి అందులో వేయాలి. ఆ తరువాత పసుపు, గరంమసాలా, సగం మిరియాలపొడి, తగినంత ఉప్పు, టొమాటోసాస్‌ వేసి అన్నింటినీ కలపాలి. రెండు నిమిషాలయ్యాక పనీర్‌ ముక్కలు వేసి కలిపి... మిగిలిన మిరియాలపొడి, జీలకర్రపొడి, కొత్తిమీర, సోంపు, వేసి అన్నింటినీ కలిపి దింపేయాలి.


సటాయ్‌

కావలసినవి పొడుగ్గా తరిగిన పనీర్‌ ముక్కలు: ఎనిమిది, మొక్కజొన్నపిండి: మూడు టేబుల్‌స్పూన్లు, మైదా: రెండుటేబుల్‌స్పూన్లు,

షెజవాన్‌ సాస్‌: టేబుల్‌స్పూను (బజార్లో దొరుకుతుంది), నిమ్మరసం: చెంచా, టొమాటోసాస్‌: టేబుల్‌స్పూను, సోయాసాస్‌: టేబుల్‌స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద: అరచెంచా, వెల్లుల్లి తరుగు: చెంచా, నూనె: వేయించేందుకు సరిపడా, వేయించి పొట్టుతీసిన పల్లీలు: పావుకప్పు, ఉప్పు: తగినంత, కారం: పావుచెంచా, చాప్‌స్టిక్స్‌: ఎనిమిది.
తయారీ విధానం: ఓ గిన్నెలో ముప్పావువంతు మొక్కజొన్నపిండి, మైదా, కారం, తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లిముద్ద, సగం చొప్పున టొమాటోసాస్‌, సోయాసాస్‌, షెజవాన్‌ సాస్‌ వేసుకుని అన్నింటినీ బాగా కలిపి ఆ తరువాత నీళ్లు పోస్తూ బజ్జీల పిండిలా చేసుకోవాలి. పనీర్‌ ముక్కల్ని ఈ మిశ్రమంలో ముంచి ఆ తరువాత కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.  ఇప్పుడు స్టౌమీద మళ్లీ బాణలి పెట్టి రెండు చెంచాల నూనె వేసి వెల్లుల్లి తరుగు, కచ్చాపచ్చాగా దంచిన పల్లీముక్కలు వేయాలి. నిమిషమయ్యాక మిగిలిన సాస్‌లు, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మిగిలిన మొక్కజొన్నపిండిలో నీళ్లు పోసి పల్చగా చేసుకుని దాన్ని కూడా బాణలిలో వేయాలి. ఇందులో పనీర్‌ ముక్కల్ని ఉంచి వాటికి మసాలా పట్టేవరకూ బాగా కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి. ఆ తరువాత వాటికి చాప్‌స్టిక్స్‌ గుచ్చి సాస్‌తో కలిపి వడ్డించాలి.


పాప్‌కార్న్‌

కావలసినవి పనీర్‌ ముక్కలు: ఒకటిన్నర కప్పు, పసుపు: పావుచెంచా, కారం: అరచెంచా, అల్లం వెల్లుల్లి ముద్ద: చెంచా, మిరియాలపొడి: అరచెంచా, గరంమసాలా: పావుచెంచా, దనియాలపొడి: కొద్దిగా, ఉప్పు: తగినంత, మొక్కజొన్నపిండి: పావుకప్పు, బ్రెడ్‌పొడి: కప్పు, నూనె: వేయించేందుకు సరిపడా.
తయరీ విధానం: పనీర్‌ముక్కల్ని ఓ గిన్నెలో తీసుకుని వాటిపైన అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, సగం మిరియాలపొడి, దనియాలపొడి, గరంమసాలా, అరచెంచా ఉప్పు వేసుకుని అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో మొక్కజొన్నపిండి, మిగిలిన మిరియాలపొడి, కొద్దిగా ఉప్పు తీసుకుని నీళ్లు పోసి పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు పనీర్‌ ముక్కల్ని మొక్కజొన్న పిండిలో ముంచి, తరువాత బ్రెడ్‌పొడిలో అద్ది... కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకుంటే సరిపోతుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు