నెల్లూరు చేపల పులుసు ఇష్టమా? - Sunday Magazine
close

నెల్లూరు చేపల పులుసు ఇష్టమా?

ఆదివారం నాడు... చికెనో, మటనో కాకుండా చేపలు తెచ్చుకుంటే... కాస్త వెరైటీగా ఏదో ఒకటి చేయాలనుకోవడం సహజమే. కానీ ఏంటనేదే ప్రశ్న అయితే... ఈ వంటకాలను చూసేయండోసారి.

పెప్పర్‌ ఫిష్‌

కావలసినవి ఏదయినా ఒక రకం చేప ముక్కలు: అయిదారు, మొక్కజొన్నపిండి: టేబుల్‌స్పూను, ఉల్లిపాయలు: రెండుపెద్దవి, నూనె: అరకప్పు, ఆకుపచ్చ, ఎరుపురంగు క్యాప్సికం: ఒక్కోటి చొప్పున, వెల్లుల్లి: మూడు, ఎండుమిర్చి: రెండు, ఉప్పు: తగినంత. సాస్‌కోసం: రెడ్‌ చిల్లీసాస్‌: రెండు చెంచాలు, సోయాసాస్‌: మూడు చెంచాలు, శొంఠిపొడి: చెంచా, వెల్లుల్లి ముద్ద: చెంచా, నువ్వులనూనె: చెంచా, చక్కెర: చెంచా. 

తయారీ విధానం: ఓ గిన్నెలో సాస్‌ కోసం పెట్టుకున్న పదార్థాలను వేసుకుని కలుపుకోవాలి. చేప ముక్కలపైన మొక్కజొన్నపిండి వేసి కలపాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు, వెల్లులి తరుగు, ఎండుమిర్చి వేయించి, సాస్‌ వేసి బాగా కలిపి దింపేయాలి. మరో బాణలిని స్టౌమీద పెట్టి నూనె వేసి చేపముక్కల్ని వేయించి వీటిపైన ముందుగా చేసుకున్న మసాలా వేసి బాగా కలిపి అయిదు నిమిషాలుఅయ్యాక దింపేయాలి. 

నెల్లూరు చేపల పులుసు

కావలసినవి ఏదయినా ఒకరకం చేప ముక్కలు: అరకేజీ, నూనె: అరకప్పు, ఆవాలు: పావుచెంచా, జీలకర్ర: పావుచెంచా, మెంతులు: పావుచెంచా, ఎండుమిర్చి: మూడు, కరివేపాకు రెబ్బలు: అయిదు, వెల్లుల్లి: ఎనిమిది రెబ్బలు, పచ్చిమిర్చి: నాలుగు, చిన్న ఉల్లిపాయలు: ఇరవై, చింతపండు: పెద్ద నిమ్మకాయంత, టొమాటోలు: ఆరు, పసుపు: చెంచా, కారం: రెండు చెంచాలు, దనియాలపొడి: మూడు చెంచాలు, ఉప్పు: తగినంత. మసాలాకోసం: మెంతులు: అరచెంచా, జీలకర్ర: రెండు చెంచాలు, మిరియాలు: చెంచా, ఆవాలు: చెంచా.

తయారీ విధానం: ముందుగా చింతపండును నానబెట్టుకుని చిక్కగా రసం తీసుకోవాలి. టొమాటోలను గుజ్జులా చేసుకోవాలి. మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలను వేయించుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. తరువాత వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేయించి టొమాటో గుజ్జు, చింతపండు రసం వేయాలి. ఇప్పుడు పసుపు, కారం దనియాలపొడి, ఉప్పు వేసి రెండుకప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు చేపముక్కలు వేయాలి. అవి ఉడికాక ముందుగా చేసిపెట్టుకున్న  మసాలా వేసి కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.

టిక్కా

కావలసినవి: చేప ముక్కలు: కేజీ, గడ్డ పెరుగు: పావుకప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద: మూడు చెంచాలు, ఆవనూనె: పావుకప్పు, ఉప్పు: తగినంత, గరంమసాలా: మూడు చెంచాలు, కారం: అరచెంచా, నిమ్మరసం: టేబుల్‌స్పూను, పసుపు: చెంచా, చాట్‌మసాలా: కొద్దిగా. ఆవ మసాలాకోసం: నలుపురంగు ఆవాలు: రెండు చెంచాలు, పసుపురంగు ఆవాలు: రెండు చెంచాలు, వినెగర్‌: చెంచా, పచ్చిమిర్చి: రెండు, అల్లం: చిన్న ముక్క, పసుపు: కొద్దిగా,ఉప్పు: తగినంత, నిమ్మరసం: రెండు చెంచాలు. 

తయారీ విధానం: మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. చాట్‌మసాలా, నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలనూ, ఆవ మసాలానూ చేపముక్కలపైన వేసి బాగా కలిపి మూడు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత ఈ ముక్కల్ని ఇనుప చువ్వలకు గుచ్చి తందూరీ పాన్‌పైన కాల్చుకుని తీసుకోవాలి. లేదంటే ఓవన్‌లోనూ గ్రిల్‌ చేసుకోవచ్చు. చివరగా వీటిపైన నిమ్మసరం, చాట్‌మసాలా వేయాలి.

తవా తాలీ మచ్చీ

కావలసినవి ఏదయినా ఒకరకం చేప: ఏడు వందల గ్రాములు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, అల్లం తరుగు: టేబుల్‌స్పూను, వెల్లుల్లి తరుగు: టేబుల్‌స్పూను, బియ్యప్పిండి: కప్పు, మొక్కజొన్నపిండి: అరకప్పు, గుడ్లు: మూడు, నిమ్మకాయలు: అయిదు (రసం తీసుకోవాలి), షాజీరా: రెండు చెంచాలు, కారం: రెండు చెంచాలు, గరంమసాలా: టేబుల్‌స్పూను, మిరియాలపొడి: ఒకటిన్నర చెంచా, దనియాలపొడి: రెండు చెంచాలు, దాల్చిన చెక్కపొడి: చెంచా, నెయ్యి: రెండు కప్పులు.

తయారీ విధానం: చేపను ముక్కల్లా కోసుకోవాలి. వాటిపైన తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలుపుకోవాలి. పది నిమిషాలయ్యాక ఆ ముక్కలపైన అల్లంవెల్లుల్లి తరుగు, మొక్కజొన్నపిండి, బియ్యప్పిండి, కోడిగుడ్ల సొన, నిమ్మరసం వేసి కలపాలి. మరో గిన్నెలో షాజీరా, కారం, గరంమసాలా, మిరియాలపొడి, దనియాలపొడి, దాల్చినచెక్కపొడి, మరికొంచెం ఉప్పు వేసుకుని నీళ్లతో ముద్దలా చేయాలి. ఈ మిశ్రమాన్నీ చేప ముక్కలపైన వేసి బాగా కలిపి పది నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టాలి.ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక చేపముక్కల్ని వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. 

- కైలాష్‌ గుండపల్లి, ఎగ్జిక్యూటివ్‌ షెఫ్‌ నొవొటెల్‌, హైదరాబాద్‌


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న