Real Happiness: అసలైన సంతోషం

‘నీ తలరాతలో అల్లాహ్‌ రాసినదాన్ని సమ్మతించి, తృప్తిచెందు. అప్పుడు అందరి కంటే నువ్వే ధనవంతుడివి’ అన్నారు ముహమ్మద్‌ ప్రవక్త (స) మహనీయులు. ఆత్మసంతృప్తిని మించిన సంపద మరొకటి ఉండదు. అది లేనివారు ఎన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఇంకా ఏవో కావాలనే పేరాశతో సంతోషాన్ని దూరం చేసుకుంటారు.

Published : 06 Jun 2024 00:13 IST

‘నీ తలరాతలో అల్లాహ్‌ రాసినదాన్ని సమ్మతించి, తృప్తిచెందు. అప్పుడు అందరి కంటే నువ్వే ధనవంతుడివి’ అన్నారు ముహమ్మద్‌ ప్రవక్త (స) మహనీయులు. ఆత్మసంతృప్తిని మించిన సంపద మరొకటి ఉండదు. అది లేనివారు ఎన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఇంకా ఏవో కావాలనే పేరాశతో సంతోషాన్ని దూరం చేసుకుంటారు. ఒక బంగారు గని దొరికినా అలాంటిది ఇంకోటి కావాలనుకునే మనిషి అత్యాశను వివరించారు ప్రవక్త.

ఆత్మసంతృప్తి ఔన్నత్యాన్ని తెలియజేసే కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒక రాజు ఎప్పుడూ నిరాశగానే ఉండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. పాలనా వ్యవహారాలు గాడి తప్పాయి. రాజ కుటుంబీకులు, మంత్రులు, అధికారులూ ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ఆస్థాన వైద్యుడు- ‘శారీరకంగా ఏ సమస్యా లేదు. నిరాశతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. రాజ్యంలో సుఖసంతోషాలతో, ఆత్మసంతృప్తిగా ఉన్న వ్యక్తి తొడిగిన చొక్కాను రాజుగారు ధరిస్తే పరిస్థితి చక్కబడుతుంది’ అన్నాడు.

అలాంటి వ్యక్తి కోసం మంత్రి నగరమంతా గాలించి, ఫలితం లేక తిరిగెళ్తోంటే.. ఒక గుడిసెలోంచి ‘ఓ అల్లాహ్‌! నువ్వు కరుణామయుడివి. నీ కృపతో నా జీవితం సుఖసంతోషాలతో, సంతృప్తిగా గడుస్తోంది’ అని వినిపించింది. మంత్రి సంబరంగా గుడిసెలోకి వెళ్లి, ‘నీ చొక్కా ఇచ్చావంటే ప్రతిఫలంగా రాజుగారు అనేక విలువైన బహుమతులు ఇస్తారు’ అంటూ వివరించి, అతడి చొక్కా తీసుకుని రాజదర్బారుకు వచ్చాడు. చిరుగులు, అతుకులతో ఉన్న ఆ చొక్కాను రాజుకు ఇచ్చి, జరిగినదంతా చెప్పాడు. ‘ధనం, దర్పం, అధికారం అన్నీ అనుభవిస్తూ కూడా నిరాశ చెందుతున్నాను. సరైన ఇల్లూ, దుస్తులైనా లేని నిరుపేద సంతృప్తిగా, సంతోషంగా ఉన్నాడా?’ అంటూ ఆశ్చర్యపోతూ చొక్కా తీసుకున్నాడు. అల్లాహ్‌ తన కళ్లు తెరిపించినందుకు ఆనందించాడు. పేదవానికి కృతజ్ఞతలు సమర్పించాడు. రాజు అనారోగ్యం ఇట్టే మాయమైంది.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు