జ్వరానికి నమస్కరించాలి!

ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్లిన సతీదేవిని ఘోరంగా అవమానించాడు దక్షుడు. ఆ పరాభవాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతయిందామె

Published : 02 Mar 2023 00:34 IST

ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్లిన సతీదేవిని ఘోరంగా అవమానించాడు దక్షుడు. ఆ పరాభవాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతయిందామె. దాంతో శివుడు ప్రమద గణాలతో వెళ్లి యజ్ఞాన్ని ధ్వంసం చేసి, దక్షుడి తల ఖండించాడు. శివుడి ఉగ్రరూపానికి భయపడిన యజ్ఞం ఆకాశంలోకి ఎగిరిపోగా, దేవతలూ, రుషులూ తలో దిక్కుకీ పరుగెత్తారు. మహాశివుణ్ణి శాంతింపజేసేందుకు ‘సతిని అవమానించిన దక్షుడికి తగిన శాస్తి జరిపించావు. ఈ యజ్ఞంలో దేవతలంతా నీకు భాగాల్ని కల్పిస్తారు. కాబట్టి శాంతించు’ అన్నాడు బ్రహ్మదేవుడు. అలా దేవతలు యజ్ఞంలో భాగం కల్పించడంతో ప్రసన్నుడయ్యాడు శివుడు. కానీ కోపం వల్ల శివుడి నుదుటి నుంచి పుట్టిన చెమట బిందువులు భూమి మీద రాలాయి. వాటి నుంచి ఎర్రటి నేత్రాలు, నల్లని రూపంతో భయంకర పురుషుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మ ‘నీ నొసటి నుంచి పుట్టిన పురుషుడు జ్వరం పేరుతో ప్రసిద్ధుడవుతాడు. అతడు సర్వత్రా సంచరిస్తాడు. అది ఒకే రూపంతో ప్రజ్వరిల్లితే భూమాత భరించ లేదు కనుక అనేక రూపాలకు వ్యాప్తిచెందించు’ అన్నాడు. ఆ విన్నపం వల్లే జ్వరం ఏనుగులకు తలనొప్పిగా, పాములకు కుబుసంగా, గోవులకు గిట్టల నొప్పిగా, లేళ్లకు తమను తాము చూసుకోలేని అసహాయతగా, గుర్రాలకు పార్శ్వభాగంలో శోణంగా, నెమళ్లకు ఈకలు రాలిపోయేలా, కోకిలకు నేత్ర వ్యాధిగా, చిలుకలకు వెక్కిళ్లుగా.. విభజించాడు శివుడు. జ్వరం సాక్షాత్తు శివుడి తేజస్సే అయినందున అది నమస్కరించదగిందని భారతం చెబుతోంది.

నారంశెట్టి ఉమామేశ్వరరావు 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని