రాయలసీమకే తలమానికం అనంతపురం గంగమ్మ ఆలయం

కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండల పరిధిలోని అనంతపురంలో గంగమ్మ ఆలయం విరాజిల్లుతోంది. మహాశివరాత్రి పర్వదినం తర్వాత రెండు రోజులకు ఇక్కడ తిరుణాల ప్రారంభమవుతుంది. 

Published : 07 Mar 2024 00:12 IST

కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండల పరిధిలోని అనంతపురంలో గంగమ్మ ఆలయం విరాజిల్లుతోంది. మహాశివరాత్రి పర్వదినం తర్వాత రెండు రోజులకు ఇక్కడ తిరుణాల ప్రారంభమవుతుంది.  అమ్మవారి చెంత ఒరపడితే (సాష్టాంగ నమస్కారం) సంతానలేమి, అనారోగ్యం లాంటి సమస్యలు రావని భక్తుల అపార నమ్మకం. తమ కోర్కెలు తీరిన భక్తులు చాందినీ బండ్లను కట్టుకుని జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. పరిసర ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు.

పూర్వం గోనె సంచుల వ్యాపారులు అనంతపురం జిల్లా నుంచి ఎడ్లబండిలో ప్రస్తుతం జాతర నిర్వహించే స్థలానికి వచ్చేవారట. వారితో పాటు గంగమ్మ తల్లి వచ్చి, పొలం కంచె వద్ద నిలిచిపోయిందని, అమ్మవారి శక్తిని గ్రహించి నిత్య పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రతీతి. స్థానికంగా ప్రచారంలో ఉన్న కథను అనుసరించి- గొల్లపల్లెకు చెందిన చెల్లు వంశీయులు తనకు పూజలు నిర్వహించాలని అమ్మవారు ఆదేశించిందని, అప్పటి నుంచి వంశపారంపర్యంగా వారే పూజారులుగా ఉంటున్నారని చెబుతారు.

తిరుణాల కార్యక్రమాలు... మార్చి 10న చాగలగుట్టపల్లెలో అమ్మవారి జాగారం, 11న నిండు తిరుణాల, అమ్మవారికి సిద్ధలపూజ, సిరిమాను తిరగడం, సర్వదర్శనం, బోనాలు, చాందినీబండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు. 12న అమ్మవారిని ఊరేగించడం, గంగ స్నానాలు, అభిషేకాలతో మైల తిరుణాల ముగుస్తుంది.

ఎలా చేరుకోవచ్చు.. గంగమ్మ ఆలయం లక్కిరెడ్డిపల్లె మండలం, అనంతపురం గ్రామంలో ఉంది. కడప వరకు రైలు లేదా బస్సుల్లో చేరుకుంటే.. అక్కడి నుంచి బస్సులు, ఆటోల్లో వెళ్లొచ్చు. జాతర సందర్భంగా పులివెందుల, రాయచోటి, కడప ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులుంటాయి.

బోగెం శ్రీనివాసులు, ఈనాడు, కడప


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని