ఫాల్గుణ మాసం ఎంతో శ్రేష్ఠం

ఫాల్గుణ మాసం సర్వదేవతా సమాహారం. తిథుల్లో ద్వాదశి మణిపూస లాంటిది. సంఖ్యాపరంగా పన్నెండుకు ఒక ప్రత్యేకత ఉంది. సూర్యుడికి 12 పేర్లున్నాయి. సంవత్సరానికి 12 మాసాలు. ఫాల్గుణం పన్నెండోది.

Published : 07 Mar 2024 00:18 IST

ఫాల్గుణ మాసం సర్వదేవతా సమాహారం. తిథుల్లో ద్వాదశి మణిపూస లాంటిది. సంఖ్యాపరంగా పన్నెండుకు ఒక ప్రత్యేకత ఉంది. సూర్యుడికి 12 పేర్లున్నాయి. సంవత్సరానికి 12 మాసాలు. ఫాల్గుణం పన్నెండోది. దాని తర్వాత కొత్త ఏడాది మొదలవుతుంది. ప్రకృతికంగా స్త్రీలకు పన్నెండో ఏడు, సమాజపరంగా విద్యార్థులకు పన్నెండో తరగతి ప్రధానం. ఫాల్గుణ మాసంలో శుక్లపాడ్యమి మొదలు ద్వాదశి దాకా రోజూ వ్రతం చేస్తారు. గణపతిని, అనంతుని, సూర్యభగవానుణ్ణి, దుర్గాలలితాదేవిని, ఆనందుని, విష్ణుమూర్తిని పూజిస్తారు.

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నృసింహ ద్వాదశిగా ప్రసిద్ధం. ఈ ద్వాదశిని గోవింద ద్వాదశి అని, విష్ణుమూర్తికి ప్రియమైన ఉసిరి పేరుతో అమలక ద్వాదశి అని పిలుస్తారు. ఈ మాసంలో ద్వాదశికి 12 రోజులు ఉపవాసం పాటిస్తూ క్షీరాన్నం ప్రసాదంగా పంచుతారు. పూరీ జగన్నాథ, తిరుమల వేంకటేశ్వర తదితర ప్రసిద్ధ దేవాలయాల్లో ఘనంగా వేడుక నిర్వహిస్తారు. ఫాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యతీర్థ స్నానాలు చేస్తే సకల శుభాలూ కలుగుతాయి. నదీస్నానం చేయలేనివారు ఇంట్లోనే స్నానం చేస్తూ గంగమ్మను స్మరించుకుంటారు. అలా గంగాస్మరణ వల్ల పుణ్యస్నానంతో సమానమైన ఫలం దక్కుతుంది. ఆ రోజున గృహ నిర్మాణం చేపడితే సువర్ణ, పుత్ర లాభాలు చేకూరుతాయి. నృసింహ కవచం పఠించి, భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వైకుంఠ ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తారు. ఆధ్యాత్మిక చింతనే జీవిత పరమార్థం. ఆచారాల్లో ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసుకుని పాటించాలి. అదే మోక్షసాధన.

ఉప్పు రాఘవేంద్రరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని