అల్లాహ్‌ సందేశాలూ, ఆదేశాలూ

ముస్లింలు సరళంగా, సమృద్ధికరంగా, ధర్మబద్ధంగా జీవించేందుకు కరుణామయుడైన అల్లాహ్‌ వెలువరించిన మార్గదర్శక గ్రంథమే పవిత్ర ఖురాన్‌. అందులోని ఉపదేశాలు, ఆదేశాలను విధేయతతో పాటించడంలో ఇహపరాల సాఫల్యం దాగి ఉందన్నది ముహమ్మద్‌ ప్రవక్త ఉద్బోధ.

Published : 21 Mar 2024 00:03 IST

ఇస్లాం సందేశం

ముస్లింలు సరళంగా, సమృద్ధికరంగా, ధర్మబద్ధంగా జీవించేందుకు కరుణామయుడైన అల్లాహ్‌ వెలువరించిన మార్గదర్శక గ్రంథమే పవిత్ర ఖురాన్‌. అందులోని ఉపదేశాలు, ఆదేశాలను విధేయతతో పాటించడంలో ఇహపరాల సాఫల్యం దాగి ఉందన్నది ముహమ్మద్‌ ప్రవక్త ఉద్బోధ. ఖురాన్‌ పారాయణానికి రంజాన్‌ నెల అత్యంత శుభప్రదం. ఇందులో ధార్మిక విషయాలే కాకుండా రాజకీయ, సాంఘిక, ఆర్థిక, నైతిక, ప్రాపంచిక.. ఇలా ఎన్నో అంశాలకు సంబంధించిన నియమావళి తెలుసుకోవచ్చు. మన బాధ్యతలను చక్కగా నిర్వహించడానికి ఖురాన్‌ బోధనలు దోహదపడతాయి. ఆ పాఠాలను నేర్చుకొని, జీవితానికి అన్వయించుకొని, వాటిని మన విధానంగా మార్చుకోవాలన్నది ప్రవక్త ప్రవచనాల సారాంశం. ప్రఖ్యాత ఇస్లామిక్‌ విద్వాంసులు హజ్రత్‌ హసన్‌ బస్రీ (రహ్మ) నేటి ముస్లిముల పరిస్థితికి ఆందోళన చెందుతూ- ‘ఖురాన్‌ దైవ ఆదేశమని, ఆయన నుంచే అవతరించిందని మన పెద్దలు దృఢంగా నమ్మేవారు. పగలు ఆ ఆదేశాలను ఆచరించేవారు. రాత్రి వేళల్లో యోచన, పరిశీలనా దృష్టితో ఆ పవిత్ర గ్రంథాన్ని లోతుగా అధ్యయనం చేసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి శోచనీయం. ఖురాన్‌ పదాలను చిలుక పలుకుల్లా పఠిస్తూ, వాటి అక్షరాలను సరిచేయడం ధ్యేయంగా పెట్టుకున్నారే కానీ ఆచరణ విషయంలో సోమరులై పోయారు’ అన్నారు. సముద్ర లోతుల్లోకి వెళ్లేకొద్దీ ఎంతో విలువైన ముత్యాలు దొరికినట్టు ఖురాన్‌ను అధ్యయనం చేస్తూ ఉంటే అంతకంటే విలువైన ఆణిముత్యాలు దొరుకుతాయి. ఇంతటి మహత్తర గ్రంథాన్ని రంజాన్‌ మాసంలో పఠించి ఒక మూలన అలంకరించడం కాకుండా.. రోజులో కొంత సమయం ఈ గ్రంథానికి కేటాయించాలి. అల్లాహ్‌ సందేశాలను అధ్యయనం చేయడం ద్వారా జీవన సాఫల్యం పొందగలుగుతాం.

ఖురాన్‌ అమూల్య సూక్తుల్లో కొన్ని..

  • ఇచ్చిన మాటపై నిలబడండి.
  • అవినీతికి పాల్పడకండి.
  • ఇతరుల మాటలు గోడచాటుగా వినకండి, చాడీలు చెప్పకండి.
  • కోపాన్ని తగ్గించుకోండి. 
  • కటువుగా మాట్లాడకండి.
  • ఇతరుల ధనాన్ని కాజేయకండి.
  • అందరితో ఆత్మీయంగా మెలగండి.
  • పిసినారితనం వద్దు.
  • ఎవరిపైనా అసూయ చెందకండి.
  • అహంకారం చూపకండి.
  • ఇతరుల తప్పులపై మన్నింపుల వైఖరి అలవరచుకోండి.
  • పరిశుద్ధతను పాటించండి.
  • తల్లిదండ్రులతో ప్రేమగా వ్యవహరించాలి.
  • ప్రజలతో మృదువుగా మాట్లాడండి.
  • ఎవరినీ గేలి చేయకండి.
  • వడ్డీ సొమ్ము తినకండి. రుణం తీసుకున్నవారు ఇబ్బందిలో ఉంటే వారి పరిస్థితి మెరుగయ్యే వరకూ గడువు ఇవ్వాలి.
  • వ్యభిచారం, మత్తుపానీయాలకు దూరంగా ఉండండి.
  • అతిగా అనుమానించకండి.

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని