దయామయుడి పునరుత్థానం

ఏసుప్రభువు చేసిన ప్రబోధల వల్ల అన్యాయార్జితంతో ప్రజలను దోచుకుంటున్న యూదు మతాధికారులు నష్టపోయారు. ఏసు గురించి తప్పుడు నివేదికలిచ్చి శిక్షకు పరాకాష్ట అయిన సిలువ మరణాన్ని ప్రతిపాదించారు. తప్పని  పరిస్థితిలో పిలాతు ప్రభువుకు సిలువ దండన అమలు చేయమన్నాడు.

Updated : 28 Mar 2024 04:10 IST

మార్చి 29 గుడ్‌ ఫ్రైడే, 31 ఈస్టర్‌ సండే

ఏసుప్రభువు చేసిన ప్రబోధల వల్ల అన్యాయార్జితంతో ప్రజలను దోచుకుంటున్న యూదు మతాధికారులు నష్టపోయారు. ఏసు గురించి తప్పుడు నివేదికలిచ్చి శిక్షకు పరాకాష్ట అయిన సిలువ మరణాన్ని ప్రతిపాదించారు. తప్పని  పరిస్థితిలో పిలాతు ప్రభువుకు సిలువ దండన అమలు చేయమన్నాడు. కరుణామయుడు మరణించిన రోజు గుడ్‌ఫ్రైడే. మూడో రోజున తిరిగొచ్చిన రోజు ఈస్టర్‌.

గుడ్‌ఫ్రైడే అంటే శుభశుక్రవారం కదా! ప్రభువు మరణించిన దినం అశుభం అవుతుంది కానీ శుభ దినం ఎలా అయ్యింది- అని కొందరికి సందేహం వస్తుంది. అసలు సంగతేమంటే.. ప్రభువు తన అమూల్యమైన ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచి, మానవాళిని పాపవిముక్తులను గావించేందుకు అంతటి త్యాగం చేశాడు. అందుకే గుడ్‌ఫ్రైడే అన్నారు. క్రైస్తవుల నమ్మకం, నిరీక్షణ ఫలించిన పునరుత్థాన దినం ఈస్టర్‌ సండే. ఈ పర్వదినాన క్రైస్తవులు బృందాలుగా కూడి ఆనందోత్సాహాలతో చర్చికి వెళ్లి ప్రార్థిస్తారు.

మానవరూపంలోనే అవతరించాడు

ఒకసారి పరలోకంలో.. మానవలోకాన్ని బంధనాల నుంచి విడుదల చేసేందుకు ఎవరు వెళ్తారని అడగ్గా- ఏసు స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. పాపపంకిలంలో చిక్కుకున్న వారిని బంధనాల నుంచి విడుదల చేయాలని ఏసుక్రీస్తు మనిషి రూపంలో అవతరించాడు. అనేక సూర్యుల కంటే ఎక్కువ తేజస్సు గల దేవుడు ప్రత్యక్షమైతే మనం భౌతిక నేత్రాలతో చూడలేం కదా! కనుకనే సాటిమనిషి రూపంలోనే అవతరించి అనేక సందేశాలు అందించారు. పాపాలకు విరుగుడు రక్తమని, ఆ రక్తం పాపి అయిన వేరొక మనిషిదో, గొర్రెలు, కోళ్లు, పక్షులదో కాదు.. పరిశుద్ధ రక్తంతోనే పాప విమోచనం అవుతుందని మతగ్రంథాలు తెలియజేశాయి. పాప విమోచన కోసం, సర్వమానవ కల్యాణం కోసం పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు రక్తం చిందించి, ప్రాణాన్ని అర్పించాడు.

సిలువలో ఏమన్నాడు..

ఏసు ఏ విధంగా మరణిస్తాడనే విషయాన్ని క్రీ.పూ.700 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవక్త ప్రవచించాడు. ‘తన ఏకైక కుమారుణ్ణి అలా శిక్షించడానికి ఆయనకు ఇష్టమయ్యెను. (యెషయా 53:10) ఈ సందర్భంలో క్రీస్తు సిలువలో ఏడు మాటలు పలికాడు. ఆ వాక్యాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తొలి మాట: ‘తండ్రీ! వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు’ (లూకా 23:34) ఏసు సిలువలో 6 గంటలు వేలాడినా.. ఎవరి మీదా ఆయనకు కక్ష, ద్వేషం లేవు. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు కష్టమైనా క్రోధం వెల్లడించలేదు. అందుకు బదులుగా ప్రేమ, కనికరం, క్షమాగుణం వ్యక్తంచేశాడు. ఆయనకు మనపట్ల గల ప్రేమకు రుజువది. బాధతో అల్లాడుతున్న పిరికివాని స్వరంలా కాకుండా, విజయం పొందినవాని ఘోషగా, శ్రమ, వేదన, మరణ సమయాల్లో ఒకేలా నడచుకోవాలని సూచించేలా ఉన్నాయా మాటలు. ‘తండ్రీ’ అని సంబోధించడంలో క్రీస్తుకు దేవునితో గల ఆత్మీయ సంబంధం స్పష్టమవుతుంది. యూదులు ఏసు ప్రభువుపై చేసిన నేరారోపణ.. ఆయన తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పడం. అందుకే వారు శిక్షించారు.

రెండోమాట: ‘నువ్వు నాతో పాటు పరదైసులో ఉందువు’ (లూకా 23:43) తన పక్కన ఒక దొంగకు సిలువ విధించినప్పుడు- ‘నువ్వు నా రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో’ అన్నాడు. ఆ మాటలు వినగానే.. దొంగ హృదయాన్ని అనిర్వచనీయమైన ఓ శక్తి బలంగా తాకింది. ఆ వెంటనే ఏసు ప్రభువు దొంగతో ‘నువ్వు నాతో పాటు ఉంటావు’ అన్నాడు.

మూడోమాట: ‘అమ్మా ఇదిగో నీ కుమారుడు’- అని తల్లి మేరీమాతతో చెప్పి, శిష్యుని వంక చూసి.. ‘ఇదిగో నీ తల్లి’ అంటూ అప్పగించాడు. అలా మాతృమూర్తి పట్ల తన బాధ్యతను నెరవేర్చాడు.

నాలుగోమాట: ‘నా దేవా! నువ్వు నన్నెందుకు విడనాడావు?’ అన్నాడు. (కీర్తన 22:1)

ఐదోమాట: ‘నేను దప్పిగొనుచున్నాను’ (యోహాను 19:28) అక్కడున్న ప్రజలు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి, ఆయన నోటికి అందించారు. (సిలువలో హింస తర్వాత గాయాల నుంచి ఉపశమనం కలిగించే చేదైన ద్రవాన్ని పీల్చుకున్న స్పాంజ్‌ని కుంచె లాంటి హిస్సోపు పుడకకు తగిలించి ప్రభువుకు ఇచ్చారని భావం)

ఆరోమాట: ఏసు దాన్ని అందిపుచ్చుకుని ‘సమాప్తమైంది’ అన్నాడు (యోహాను 19:30). ఈ మాట మూడు సువార్తల్లోనూ లిఖితమైంది. ఆదికాండంలో దేవుడు సృష్టిని పూర్తిచేసిన తర్వాత ‘సంపూర్తి చేశాను’ అని ప్రకటించాడు. సమాప్తమైందని చెబుతున్న ఒక గొప్ప స్వరం గర్భాలయంలో ఉన్న సింహాసనం నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు.

ఏడోమాట: ‘తండ్రీ! నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను’ అన్నాడు. (లూకా 23:46)

నాలుగో మాటలో ‘తండ్రీ’ అని కాకుండా ‘నా దేవా’ అన్నాడు ప్రభువు. మనుషులు చేసిన పాపం అనే అంధకారం ప్రభువును ఆవరించినప్పుడు ‘నాదేవా అని సంబోధించి, ‘నా చెయ్యి ఎందుకు విడిచావు?’ అన్నాడు. ఈ సమయంలో ఎడబాటు లేదు. తండ్రితో సహవాసం తిరిగి లభించింది. కనుక కుమారుడు తండ్రీ అని పిలిచాడు. ఎవరైనా ఈ లోకాన్ని వీడినప్పుడు.. చనిపోయారు, ప్రాణం వదిలారు- అంటాం. కానీ ఏసు మరణించినప్పుడు ‘తండ్రీ! నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను’ అంటూ తల వంచి తన ఆత్మను సమర్పించాడు. ఏసుప్రభువు మనిషిగా జన్మించినప్పుడు.. తనలో మానవ లక్షణాలను పూర్తిగా సంతరించుకున్నాడు. అతడి జన్మ విలక్షణమైంది. ప్రభువు మరణ ఘడియను తనకు తానుగా ముందు నిర్ణయించు కున్నాడు. ఇది మనుషులకు అసాధ్యం.

కరుణామయుడైన ప్రభువు పాపరహితుడు, పునరుత్థానుడై సదా జీవిస్తున్నాడు. మన పాపాల వల్ల ఆయన చేతుల్లో మేకులు దిగాయి. మన చెడు ఆలోచనల కారణంగా ఆయన తలపై ముళ్ల కిరీటం చేరింది. మన మనసులోంచి వచ్చే దురాలోచనల వల్ల ఆయన గుండెల్లో బల్లెపు పోటు.. ఇలా మన వల్లే ఆయన పలు హింసలపాలై తన రక్తాన్ని చిందించాడు. కనుక ఏసుకు మళ్లీ మళ్లీ సిలువ వేయకుండా మనం పాపాలకు దూరంగా ఉందాం.

సువార్త సఫలం

ప్రభువు సిలువలో విగతజీవి అయిన దినం శుభశుక్రవారం. మరునాడు సమాధిలో ఉండి, ఆదివారం నాడు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినం ఈస్టర్‌. అలా సమాధి తెరుచుకున్న ఘట్టం ఎన్నడూ లేదు. నభూతో నభవిష్యతి. క్రీస్తు మృత్యువు నుంచి లేచి రాని పక్షంలో ప్రకటించిన సువార్త వ్యర్థమే. మన విశ్వాసం వ్యర్థమే. కానీ ఏసుక్రీస్తు మృత్యువు నుంచి సజీవంగా లేచివచ్చాడు.

మర్రి ఎ.బాబ్జి

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని