సంపాదనలో 2.5% ఇవ్వాల్సిందే!

ముస్లిములు తమ సంపాదనను జకాత్‌, సదఖా, ఫిత్రా అనే పద్దుల్లో ఖర్చుపెడతారు.

Updated : 28 Mar 2024 04:19 IST

ముస్లిములు తమ సంపాదనను జకాత్‌, సదఖా, ఫిత్రా అనే పద్దుల్లో ఖర్చుపెడతారు. ఏడాదిగా దాచుకున్న సంపదలోంచి రెండున్నర శాతాన్ని అనాథలు, నిరుపేదలు, నిస్సహాయులు, బాటసారులు, రుణగ్రస్తులకు దానం చేసి ఆదుకుంటారు. జకాత్‌ అంటే శుద్ధి. ఉపవాసంతో ఆత్మశుద్ధి చేసుకున్నట్లు ఏడాదిపాటు నిలవున్న తమ సంపదను శుద్ధి చేసుకోవాలన్నది అల్లాహ్‌ ఆదేశం. ఇస్లామ్‌ ఐదు మూల స్థంభాల్లో ఒకటైన జకాత్‌ దానం గురించి దివ్యఖురాన్‌ ప్రస్తావించింది. తమ సంపదలోంచి రెండున్నర శాతం అభాగ్యులు, వితంతువులకు పంచేవారికి స్వర్గం శుభవార్తలు అందించింది. ‘ధనం, వెండి బంగారాలు, పశుసంపద, ఇలా యావదాస్తిని లెక్కగట్టి పేదలకు పంచడం వల్ల సంపద శుద్ధి అవుతుంది. ఎంత శ్రమించినా ఇల్లు గడవక, ఆత్మాభిమానంతో చేయి చాచలేనివారికి, రుణభారంతో కుంగి పోతున్న వారికి దానం చేయాలి. తోటివారిపై మీరు దయ చూపితే.. దివిలో ఉన్నవాడు మిమ్మల్ని కరుణిస్తాడు’ అని ప్రవక్త (స) చెప్పారు. అందువల్ల జకాత్‌ దానాలు చేసేందుకు రంజాన్‌ నెలను సువర్ణావకాశంగా భావిస్తారు. నిజానికి జకాత్‌ కూడా ఒక ఆరాధన. దీన్ని ఎవరూ ఎగ్గొట్టాలనుకోరు. ఈ ధార్మిక విధి బంధువులు ఎలా ఉన్నారు, ఏమైనా కష్టాల్లో ఉన్నారా, అవసరాలు ఉన్నాయా- అని తెలుసుకునేలా చేస్తుంది. జకాత్‌ సొమ్ము వారి అభిమానం దెబ్బతినకుండా వివేచనతో సాయం అందించేలా ప్రోత్సహిస్తుంది. అలా సంబంధాలు పటిష్టమవుతాయి. ప్రేమ, దయ, ఆత్మీయతలతో సమాజం బాగుంటుంది. బంధువుల తర్వాత జకాత్‌ తీసుకునే అర్హత మన ఇరుగుపొరుగువారికి ఉంటుంది. వాళ్లు అభిమానం అడ్డొచ్చి అడగకపోవచ్చు. మనమే తెలుసుకుని, ఆదుకోవాలి. అలా జకాత్‌ అనుబంధాలను బలోపేతం చేస్తుంది. ఇరుగుపొరుగు మధ్య సోదర సంబంధం నెలకొంటుంది. కొన్ని సామాజిక సంస్థలు జకాత్‌ సేకరించి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నాయి. పేదపిల్లలను చదివించడం, హాస్టళ్లు నడపటం, నిరుపేదల పెళ్లిళ్లు వంటి సంక్షేమం కోసం ఈ నిధులను ఉపయోగించాలని ఉలమాలు చెబుతారు.

దానం ఫలించాలంటే..

దానగ్రహీతను తక్కువగా చూడటం పాపం. తమకు దానం చేసే అవకాశం దొరకడం అదృష్టంగానూ, దానాన్ని స్వీకరిస్తున్న వాళ్లు.. దానం ఇస్తున్నవారికి మేలు చేస్తున్నట్లుగానూ భావించాలి- అన్నది ఇస్లామ్‌ ప్రబోధ.

‘దానధర్మాలు చేయడమంటే అల్లాహ్‌కు రుణం ఇవ్వడం లాంటిది. దైవం ఆ సొమ్మును రెట్టింపు చేసి తిరిగి ఇస్తాడు’

‘దయాగుణంతో తమ సంపదను ఇతరుల కోసం ఖర్చు చేసేవారు.. అంత కంటే గొప్ప ప్రతిఫలాలను తమ ప్రభువు వద్ద పొందుతారు. వారికి ఏ విధమైన భయం గానీ, దుఃఖం గానీ కలిగే అవకాశం లేదు’ ఇవి ఖురాన్‌ సందేశాలు.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని