నిశ్చలత్వమూ ఆధ్యాత్మిక సాధనే!

ఆ ఆలయానికి కొత్తగా పర్యవేక్షణ అధికారిని నియమించారు. ఆయన వచ్చీ రాగానే కొత్త కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాడు. హఠాత్తుగా ఆయన దృష్టి ఉచిత అన్నప్రసాద పథకం మీద పడింది.

Published : 04 Apr 2024 00:14 IST

ఆలయానికి కొత్తగా పర్యవేక్షణ అధికారిని నియమించారు. ఆయన వచ్చీ రాగానే కొత్త కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాడు. హఠాత్తుగా ఆయన దృష్టి ఉచిత అన్నప్రసాద పథకం మీద పడింది. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు మాత్రమే ఉచిత భోజనం పెట్టాలని ఆదేశాలు జారీచేశాడు. ఏ పనీ చేయకుండా దేవాలయ ప్రాంగణంలో జపమాల తిప్పుతుండే సన్యాసులకు, అలాగే గుడి ముందు కూర్చునే బిచ్చగాళ్లకు ఉచిత భోజనం నిలిపేయాలని ఆదేశించాడు. ఆ గుడిలో ఎన్నో సంవత్సరాలుగా ఒక సన్యాసి ఒంటిపూట భోజనం చేస్తూ, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ప్రశాంత జీవనం గడుపుతున్నాడు. ఇతరుల సంగతలా ఉంచి.. ఆయనకు భోజనం నిలిపేయటం ఇతర సిబ్బందికి సుతరామూ ఇష్టం లేదు. వారంతా అధికారితో సన్యాసి భోజన ఏర్పాటు గురించి ప్రస్తావించారు. కోపోద్రిక్తుడైన ఆ అధికారి.. చెట్టు కింద నిశ్చలంగా జపం చేసుకుంటున్న ఆ సన్యాసి దగ్గరకు వెళ్లాడు. ‘ఈ రోజు నుంచి ఇలా ఊరికే కూర్చునే వారికి భోజనం పెట్టదలచుకోలేదు. నేను చెప్పేది అర్థమయ్యిందా?’ అన్నాడు కటువుగా. ‘అయ్యా నాకు భోజనం పెట్టనవసరం లేదు. కానీ ఊరికే కూర్చున్నాను అనడం మాత్రం భావ్యంకాదు. అది అందరికీ సాధ్యమయ్యేది కాదని తమరు గ్రహించాలి’ అన్నాడు. అధికారి మరింత కోపంతో ‘ఏమయ్యా సన్యాసీ! నేనంటే వెటకారంగా ఉందా? కాస్త పక్కకు తొలగి, కొంచెం చోటివ్వు! ఏ పనీ లేకుండా ఊరికే కూర్చోవటం ఎంత తేలికో రుజువు చేస్తాను’ అన్నాడా అధికారి. కానీ రెండు నిమిషాలు కూడా కుదురుగా కూర్చోలేకపోయాడు. చటాలున లేచి, దించిన తల ఎత్తకుండా అక్కడే ఉన్న గుమాస్తాతో ‘ఈ సన్యాసికి ఒక పూట కాదు, మూడు పూటలా భోజనం పెట్టండి’ అన్నాడు. ఏ ఆలోచనలూ లేకుండా నిశ్చలంగా గడపటం, భగవంతుణ్ణి ధ్యానించటం దుస్సాధ్యమైన ఆధ్యాత్మిక సాధన అని అర్థం చేసుకున్నాడు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని