సుఖం.. దుఃఖం..

గీతలోని శ్లోకాలను వివరించేటప్పుడు కథల రూపంలో సరళంగా అర్థమయ్యేలా చెప్పేవారు విద్యాప్రకాశానందగిరి. అందుకు ఒక ఉదాహరణ ఇది. ఆయన ‘సమ దుఃఖం సమం ధీరం’ అనే భగవద్గీత శ్లోకాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఆసక్తికరమైన కథను చెప్పారు.

Published : 04 Apr 2024 00:16 IST

గీతలోని శ్లోకాలను వివరించేటప్పుడు కథల రూపంలో సరళంగా అర్థమయ్యేలా చెప్పేవారు విద్యాప్రకాశానందగిరి. అందుకు ఒక ఉదాహరణ ఇది. ఆయన ‘సమ దుఃఖం సమం ధీరం’ అనే భగవద్గీత శ్లోకాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఆసక్తికరమైన కథను చెప్పారు.

ఒకసారి ఓ గ్రామస్థులు హరికథ భాగవతార్‌ను తమ ఊరికి ఆహ్వానించి మూడు రోజులపాటు హరికథా కాలక్షేపాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం రెండు రోజులు చక్కగా సాగింది. మూడోరోజు కూడా అలాగే చెప్పేందుకు సన్నద్ధమై హరికథను మొదలుపెడుతున్నాడాయన. ఇంతలో గ్రామ పెద్ద వెంట ఇద్దరు వ్యక్తులు ఓ పెద్ద పుష్పమాలను తీసుకొస్తూ కనిపించారు. అంత పెద్దగా, అందంగా ఉన్న దండను తనకు వేయడం తలచుకోగానే చాలా సంతోషం కలిగింది. ‘ఆహా! ఎంతటి భాగ్యం! ఇది మరువలేని రోజు’ అనుకున్నాడు. ఇంతలో మాలను తెచ్చి అతడి మెడలో వేశారు. ఆనందించాల్సిన భాగవతార్‌ ముఖంలో ఆందోళన చూసి.. ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. పూలమాలలో ఉన్న ఎర్ర చీమలు కుడుతున్నందున ఆయన దుఃఖిస్తున్నారని వారికి తెలియదు. తన భాగ్యానికి సంతోషించి క్షణం గడవక ముందే బాధపడుతూ ‘ఏమి నా దౌర్భాగ్యం?!’ అనుకున్నాడాయన. మాలను తీసేద్దామంటే పెద్దలు నొచ్చుకుంటారని మొదట సందేహించాడు. కానీ కాసేపటికి చీమలదాడి తట్టుకోలేక తన ఇబ్బంది తెలియజేశాడు. పక్కనున్న వ్యక్తి మాలను తొలగించగా ఊపిరి పీల్చుకున్నాడు. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలనే సత్యాన్ని చాటుతుందీ సంఘటన.

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని