ఎతికాఫ్‌.. ఏకాంత ఆరాధన

ఖురాన్‌ అవతరణకు కృతజ్ఞతగా పాటించేవే రంజాన్‌ ఉపవాసాలు. చివరి పది రోజుల్లోని బేసి సంఖ్యల్లో ఒక రాత్రి ఖురాన్‌ అవతరణ జరిగింది. అది ఏ రాత్రి అనే విషయంలో స్పష్టత లేదు.

Published : 04 Apr 2024 00:17 IST

ఖురాన్‌ అవతరణకు కృతజ్ఞతగా పాటించేవే రంజాన్‌ ఉపవాసాలు. చివరి పది రోజుల్లోని బేసి సంఖ్యల్లో ఒక రాత్రి ఖురాన్‌ అవతరణ జరిగింది. అది ఏ రాత్రి అనే విషయంలో స్పష్టత లేదు. అందువల్ల రంజాన్‌ నెల చివరి పది రోజులూ మస్జిదులో ఒక మూలన పరదా కట్టుకుని అందులోనే ఉండిపోతారు. ఇలా ఉండిపోవడాన్ని ఇస్లామీయ పరిభాషలో ‘ఎతికాఫ్‌’ అంటారు. గడిచిన 20 రోజుల్లో రంజాన్‌ ఉపవాసంలో ఏమైనా తప్పిదాలుంటే.. మన్నింపు వేడుకుంటారు. పూర్తి ఏకాగ్రతతో, నిబద్ధతతో, విధేయతతో అల్లాహ్‌ను వేడుకునే అవకాశం ఎతికాఫ్‌లో దొరుకుతుంది. పదిరోజులు మస్జిదులో ఏకాంత ఆరాధనలో లీనమవడం వల్ల మానసిక అలజడుల నుంచి రక్షణ పొందవచ్చు. అల్లాహ్‌ పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఈ పది రోజులూ సదా అల్లాహ్‌ స్మరణతో పునీతులవుతారు. ఎతికాఫ్‌ పాటించే వారికి హజ్‌ యాత్ర చేసినంత పుణ్యం దక్కుతుందన్నది ప్రవక్త ఉద్బోధ.

రంజాన్‌ నెల 20వ రాత్రి మొదలుకొని షవ్వాల్‌ నెలవంక కనిపించే వరకూ మస్జిదులో గడపాలి. ఎతికాఫ్‌ పాటించేవారు ఖురాన్‌ పారాయణం, దరూద్‌ పఠన, దుఆలు పాటించడం ఉంటాయి. ఎతికాఫ్‌లో ఉన్నన్ని రోజులూ అనవసర విషయాలూ, వ్యర్థ మాటలకు దూరంగా ఉండాలి. క్రయవిక్రయాలు చేయ కూడదు. మస్జిదులన్నీ ఎతికాఫ్‌ పాటించేవారితో నిండిపోతాయి. అలా ఉన్నవారు నమాజు వేళలు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు తప్ప ఆ పరదా దాటి బయటకు రాకూడదు. మహిళలు ఇళ్లల్లోనే ఓ గది మూలన ఎతికాఫ్‌ పాటిస్తారు. పది రోజులు వీలవని వారు మూడు రోజులైనా ఎతికాఫ్‌ సంకల్పం చేసుకోవచ్చు. లౌకిక విషయాలకు దూరంగా ఉండి అల్లాహ్‌ సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడమే ఎతికాఫ్‌ అసలు ఉద్దేశం. అల్లాహ్‌ పట్ల ప్రేమను పెంచుకునే మార్గమిది. ముహమ్మద్‌ ప్రవక్త జీవితాంతం రంజాన్‌ నెల చివరి పది రోజులు ఎతికాఫ్‌ పాటించేవారు.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని