70 x 7 సార్లైనా క్షమించాలి

తనను నమ్మినవారు క్షమాగుణం కలిగుండాలన్నది ఏసుప్రభువు ప్రబోధ. మనకి అపకారం, అన్యాయం చేసిన వ్యక్తిని హృదయ పూర్వకంగా క్షమించాలి. అంతేకాదు, ఆ విషయాన్ని మదిలోంచి చెరిపేయాలి.

Updated : 11 Apr 2024 04:23 IST

నను నమ్మినవారు క్షమాగుణం కలిగుండాలన్నది ఏసుప్రభువు ప్రబోధ. మనకి అపకారం, అన్యాయం చేసిన వ్యక్తిని హృదయ పూర్వకంగా క్షమించాలి. అంతేకాదు, ఆ విషయాన్ని మదిలోంచి చెరిపేయాలి. వాటిని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోకూడదు. పగ, ద్వేషాలను వదిలేయాలి. ‘నా సహోదరులు అనుచితంగా ప్రవర్తించి, మన్నించమంటే.. ఎన్నిసార్లు క్షమించాలి ప్రభూ?’ అన్న ప్రశ్నకు ‘70 x 7 మార్లు’ అని సెలవిచ్చాడు (మత్త 18:21) ఏసు. అంటే 490 మార్లు అన్నమాట. ఈ సందర్భంగా ఓ సంఘటనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సువార్తికుడు (మిషనరీ) గ్రాహంస్టెయిన్స్‌. ఒడిశాలో కుష్టురోగులకు సేవ చేసేవారు. 1999 జనవరి 22న సేవలో అలసి, కుమారులు ఫిలిప్‌, తిమోతిలతో కలిసి స్టెయిన్స్‌ తమ ఇంటి ముంగిట వాహనంలో నిద్రిస్తున్నాడు. ఇంతలో దారాసింగ్‌ అనే మతమౌఢ్యుడు అనుచరులతో కలిసొచ్చి- తండ్రీ కుమారులను సజీవదహనం చేశాడు. అలా భర్తను, కుమారులను కోల్పోయిన స్టెయిన్స్‌ భార్య గ్లాడిస్‌ కన్నీరుమున్నీరైంది. అయినా నిగ్రహించుకుని దేవుని వాక్కును మననం చేసుకుంది. ఆ దోషులను క్షమించింది. ఆమె ఔన్నత్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

మరో సంఘటన.. ఫ్రాన్స్‌ రాజైన 12వ లూయిస్‌ రాజు సింహాసనాన్ని అధిష్టించక పూర్వం ఎన్నో అభ్యంతరాలు చవిచూశాడు. ప్రత్యర్థులు ఆయనను హింసించి చెరసాలలో బంధించారు. చివరికి వారందరినీ జయించి రాజయ్యాక లూయిస్‌ అభిమానులు శత్రువులపై పగ తీర్చుకోమన్నారు. అప్పుడు లూయిస్‌ తనను హింసించినవారి జాబితాను తీసుకుమ్మని, ఆ పేర్ల వద్ద ఎర్రసిరాతో సిలువ గుర్తు వేశాడు. ఇది తెలిసిన ప్రత్యర్థులు తమకు సిలువలో మరణశిక్ష వేస్తాడనుకుని, పారిపోయారు. ‘నేను వేసిన సిలువ గుర్తు క్షమకు సంకేతం. ఏసుప్రభువు సిలువలో ఓ దొంగకు క్షమాభిక్ష ప్రసాదించాడు కదా. ఆ స్ఫూర్తితో వాళ్లను క్షమించాను’ అన్నాడు లూయిస్‌.

‘పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండేలా శత్రువులను కూడా ప్రేమించండి. వారి కోసం ప్రార్థించండి’ (మత్త 5:44) ప్రభువు చెప్పిన ఆ వాక్యాన్ని పాటిద్దామా!

పి.అవనీశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని