దైవకృపతోనే ప్రశాంతత

ఒకరోజు సముద్రం వద్దనున్న మత్స్యకారులు- తాము రాత్రంతా చేపల కోసం ప్రయత్నించినా ఒక్కటీ దొరకలేదని ఏసుతో చెప్పారు. చేపలు పట్టడంలో సిద్ధహస్తుడైన పేతురుకు కూడా దొరకలేదు.

Updated : 18 Apr 2024 00:55 IST

ఒకరోజు సముద్రం వద్దనున్న మత్స్యకారులు- తాము రాత్రంతా చేపల కోసం ప్రయత్నించినా ఒక్కటీ దొరకలేదని ఏసుతో చెప్పారు. చేపలు పట్టడంలో సిద్ధహస్తుడైన పేతురుకు కూడా దొరకలేదు. ‘ఇప్పుడు వెళ్లి ప్రయత్నించండి’ అన్నాడు ఏసు. వాళ్లు వెళ్లిన మరుక్షణం వలలు పిగిలిపోయేంతగా చేపలు దొరికాయి. ఏసు ముందుగానే ఇలా చెప్పి ఉంటే చేపలు అప్పుడే దొరికేవి. కానీ ఆయనలా చేయక పోవడానికి కారణం.. మొదట లోపరహితంగా ప్రయత్నించాలి, తర్వాత తన వద్దకు రావాలన్న ఆలోచనే. అనుకున్న పని పూర్తవ్వాలంటే దాని కోసం మానవ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. ప్రయత్నించకుండా పని జరగాలనుకోవడం అమాయకత్వం లేదా మూర్ఖత్వం. ఇలా ప్రతి ఒక్కరూ తన ప్రయత్నం తాను చేస్తూ ఆ దేవాధిదేవుని స్మరించుకుంటే విజయం తప్పక లభిస్తుంది. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది కూడా. దైవబలం లేకుంటే.. (యోహాను 1:3) ఎంతటి నిపుణులకైనా ఫలితం దక్కడంలో జాప్యం ఏర్పడుతుంది. ఆయన సృష్టించిన మనం, ఆయనకోసమే జీవించాలి. మనకు కలిగింది ఏదైనా ఆయనవల్లే కలిగింది. అందుకే విజయం చేకూరేవరకూ ప్రయత్నం ఆపకూడదు. నిత్యం ప్రార్థన చేస్తూ దేవుని కృప మనపై ఉండేలా చూసుకోవాలి. ఇదే క్రీస్తు చూపిన మార్గం. అలాగే దైనందిన జీవితంలో అనేక ఒత్తిళ్లకు గురవుతుంటాం. ఇతరులకు చేతనైనంత సహాయం చేయడం వల్ల ఆ భారం తగ్గుతుంది. మనసుకు ప్రశాంతత, ఉపశమనం కలుగుతాయి.

- పి.విజయ రాజు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని