సోదరబంధం బహు గొప్పది!

ఇద్దరు సోదరుల్లో తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నను రుణం అడిగాడు. ఆ దీన స్థితికి జాలిపడి కొంత ధనం ఇచ్చిన అన్న.. తమ్ముడు వెళ్లగానే దుఃఖంతో రోదించసాగాడు. అది చూసిన భార్య- ‘ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? ఇచ్చే ముందు నన్ను సంప్రదించనైనా లేదు’ అంటూ ఓదార్చబోయింది.

Published : 25 Apr 2024 00:06 IST

ఇస్లాం సందేశం

ద్దరు సోదరుల్లో తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నను రుణం అడిగాడు. ఆ దీన స్థితికి జాలిపడి కొంత ధనం ఇచ్చిన అన్న.. తమ్ముడు వెళ్లగానే దుఃఖంతో రోదించసాగాడు. అది చూసిన భార్య- ‘ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? ఇచ్చే ముందు నన్ను సంప్రదించనైనా లేదు’ అంటూ ఓదార్చబోయింది. ‘తమ్ముడు తన కష్టాన్ని చెప్పేంత వరకూ తెలుసుకోలేకపోయానని బాధపడుతున్నాను’ అని తన బాధకు కారణమేంటో చెప్పాడు. బంధువులు, ఇరుగుపొరుగువారి బాగోగుల్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలన్నది ప్రవక్త బోధనల సారాంశం. తమ ఇబ్బందుల గురించి చెప్పడానికి చాలామందికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అలాంటి నిరుపేదలు, నిస్సహాయులను ఖురాన్‌ ‘మిస్కీన్‌’ అంటోంది. వారి కష్టాలను మనమే తెలుసుకుని తీర్చాలన్నది ఖురాన్‌ బోధన. అతను సోదరుడి కష్టాలు తీరిస్తే.. అతడి కష్టాలను అల్లాహ్‌ తీరుస్తాడు. తాను సాయం చేసినంత కాలం అల్లాహ్‌ అతనికి సాయం చేస్తాడు. సోదరులు ఒకరినొకరు ఆదుకోవడమే కాదు, వారిలో లోపాలు, బలహీనతలు, దురలవాట్లు ఉంటే దూరం చేయాలి. ‘సోదర సంబంధాలను సంస్కరించుకోండి. అల్లాహ్‌ మీపై దయ చూపవచ్చు’ అని ఖురాన్‌ పేర్కొంది. అన్నదమ్ముల మధ్య మనస్ఫర్థలు వచ్చినప్పుడు ఒకరు కొంత తగ్గి, సంబంధాలను మెరుగుపరచుకోవడం పిరికితనం కాదు, అది మానవత్వానికి నిదర్శనం. అలాగే అన్నదమ్ముల మధ్య మనస్ఫర్థలు సృష్టించేవారికి దూరంగా ఉండాలి. సోదర ఐక్యత గురించి ‘నీ సోదరుడి ద్వారా నీకు బలాన్ని సమకూరుస్తాం. మీ ఉభయులకూ విశేషశక్తిని ప్రసాదిస్తాం’ అంటోంది ఖురాన్‌.

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు