నిన్ను కూడా దేవుడే రక్షిస్తాడు!

స్వార్థం.. అనేది మంచివారిని కూడా కఠినులుగా మార్చేస్తుంది. రక్త సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. స్నేహితులు విడిపోతున్నారు. భేదభావాలు శత్రుత్వంగా పరిణమిస్తున్నాయి.

Published : 02 May 2024 00:34 IST

స్వార్థం.. అనేది మంచివారిని కూడా కఠినులుగా మార్చేస్తుంది. రక్త సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. స్నేహితులు విడిపోతున్నారు. భేదభావాలు శత్రుత్వంగా పరిణమిస్తున్నాయి. ఇలాంటి ద్వేషాలను ప్రేమతో జయించవచ్చు. నీకు ఇవ్వని వారికి ఇవ్వు. నీతో తెగదెంపులు చేసుకున్నవారిని అక్కునచేర్చుకో. నీపై దౌర్జన్యం చేసినవారిని క్షమించి, వదిలి పెట్టు. అదే ఉన్నత వ్యక్తిత్వం- అంటారు ఉలమాలు. ఒకసారి ప్రవక్త మార్గమధ్యంలో చెట్టు నీడన విశ్రమించారు. ఆయన్ను హతమార్చడానికి అదే అదనుగా భావించిన ఓ వ్యక్తి కత్తి చూపి.. ‘ఇప్పుడెవరు రక్షిస్తారు?’ అన్నాడు. ‘అల్లాహ్‌ రక్షిస్తాడు’ అన్నారు ప్రవక్త. అంతలో శత్రువు చేతిలో కత్తి కిందికి జారిపోయింది. ప్రవక్త ఆ కత్తిని తీసుకుని ‘ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు?’ అనడిగారు. అతడు వణుకుతూ ‘ఎవరూ లేరు’ అన్నాడు. ‘అలా అనుకోవడం పొరపాటు.. నిన్ను కూడా అల్లాహ్‌ యే రక్షిస్తాడు’ అంటూ అతణ్ణి క్షమించి వదిలేశారు ప్రవక్త.

ముహమ్మద్‌ ప్రవక్త(స)పై ఒక మహిళ చెత్త కుమ్మరించేది. ఆయన మస్జిద్‌కు వెళ్లే దారిలో ఆమె నివాసం. ఆమె మేడ మీది నుంచి వేసే చెత్త మీదపడినా.. ఆయన ఏమీ అనకుండా మౌనంగా వెళ్లిపోయేవారు. ఒకరోజు ఆయన వెళ్తున్నప్పుడు ఆ మహిళ కనిపించలేదు. ఆయన ఆగి, ఆమె గురించి అడిగారు. అనారోగ్యంతో మంచంపై ఉందని తెలిసి, లోనికి వెళ్లి పరామర్శించారు. ధైర్యం చెప్పారు. ప్రవక్త వైఖరి ఆమెపై గొప్ప ప్రభావం చూపింది. క్షమాగుణం ఎంత గొప్పదో ఈ సంఘటనలు చాటుతున్నాయి. మన్నింపు వైఖరిని అలవరచుకోవడమే ప్రవక్త పట్ల ప్రేమకు నిదర్శనం.                               

- తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని