మలిసంధ్యలో మాధవ ధ్యానం

యౌవనం తొలిసంధ్య అనుకుంటే.. వార్ధక్యం మలిసంధ్య లాంటిది. ఆ మునిమాపు దశ నుంచి అనాయాసంగా నిష్క్రమించటానికి భగవంతుడి చరణాలే శరణ్యం. ఆధ్యాత్మిక చింతనే అత్యున్నత మార్గం.

Published : 02 May 2024 00:33 IST

యౌవనం తొలిసంధ్య అనుకుంటే.. వార్ధక్యం మలిసంధ్య లాంటిది. ఆ మునిమాపు దశ నుంచి అనాయాసంగా నిష్క్రమించటానికి భగవంతుడి చరణాలే శరణ్యం. ఆధ్యాత్మిక చింతనే అత్యున్నత మార్గం. విషయానందం నుంచి బ్రహ్మానంద స్థితికి ఎంత త్వరగా చేరుకుంటే జీవిత చరమాంకంలో అంత ప్రశాంతతను ఆస్వాదించగలం. లౌకికమైన లంపటాలకు ఎంత దూరంగా ఉంటే, అంత్యకాలంలో అంత ఆనందాన్ని అనుభవించగలం.

భర్త పాండురాజు హఠాన్మరణం తర్వాత.. ఎన్నో కష్టాలకు ఓర్చి పుత్రుల్ని ప్రయోజకుల్ని చేసింది కుంతీదేవి. కానీ వాళ్ల జీవితాల్లో తన పాత్ర ముగిసిందని స్పష్టమయ్యాక స్వచ్ఛందంగా పక్కకు తొలగాలనుకుంది. మహాభారత యుద్ధానంతరం శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించింది. ఆయన తన మేనల్లుడే కాదు, తాపత్రయాలను తగ్గించి, ప్రశాంతత చేకూర్చే సంరక్షకుడని కుంతికి తెలుసు. అందుకే తనవారు- అనుకుంటున్న అందరిపై ‘మోహవిచ్ఛేదం చేయుమయ్య..’ అంటూ ప్రాధేయపడిôది. ‘మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నావు. నీ రుణం ఎలా తీర్చుకునేది? ఆత్మీయులైన యాదవులు, పాండవుల మీద నాకున్న అనురాగ బంధాన్ని ఇక తెగతెంపులు చేసెయ్యి స్వామీ! నా బుద్ధి ఎల్లప్పుడూ నీ పవిత్ర పాదపద్మాల స్మరణలో లగ్నమయ్యేట్లు చెయ్యి! అది చాలు’ అని వేడుకుంది. అలా ఆనాడు ఆ మహాసాధ్వి తన జీవన మలిసంధ్యలో విన్నవించుకున్నట్టు.. మనం కూడా ఆ మాధవుడి ముందు ప్రార్థనాగీతాన్ని ఆలపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 అది ద్వాపరయుగం. మానవ సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. పుత్రులు ఆమెని బాగానే చూసుకుంటున్నారు. కోడలూ తన మాట జవదాటని సౌమ్యురాలే! మునిమనవణ్ణి కూడా అప్పుడే రుక్మిణీనాథుడు కాపాడాడు. అయినా కుంతీదేవి ఆ వ్యామోహాల నుంచి తనకు విముక్తి కలిగించమని స్వామిని వేడుకుంది. ఇది కలియుగం. మేడిపండును పోలిన మమతానురాగాలు.. పైకి తళుకులీనుతున్నట్లు కనిపిస్తున్నా, లోనంతా లుకలుకలే. అయినా అవే అపురూపమని భ్రమ పడుతుంటాం. వాటిని వదలలేక, వైరాగ్యాన్ని అలవరచుకోక వెర్రిగా పాకులాడుతుంటాం. వయసు వాలిపోతున్న వేళలో మనసును కుంతీదేవిలా మనవారి నుంచి మాధవుడి వైపు మరలించాలి. బంధనాల సంకెళ్లను పటాపంచలు చేయమని పరమాత్మను ప్రార్థించాలి.

ముగింపే ముఖ్యం..

నాటక ప్రదర్శన కొంత బాగుంటే సరిపోదు. తుది అంకం ఆకట్టుకుంటేనే విజయవంతమైందని భావిస్తాం. మన జీవితమూ అంతే! ముదిమి ప్రాయం ఎలా ముగిసిందనేది ప్రమాణంగా తీసుకొని.. ఆ వ్యక్తి జీవన సార్థకతను నిర్థరిస్తారు. అందువల్ల జీవన పర్యంతం.. అంతిమ గడియల్ని గుర్తుచేసుకుంటూ, అప్రమత్తంగా జీవించాలి. ఈ నేపథ్యంలో భక్త కబీర్‌ చక్కటి కవిత్వం రాశారు. సమీపిస్తున్న తోటమాలిని చూసిన మొగ్గలు ‘విరబూసిన పూలు ఈ రోజు కోతకు గురయ్యాయి. రేపు మన వంతూ రాకమానదు’ అని విలపిస్తాయంటూ భావయుక్తంగా చెప్పారు. మృత్యువు కూడా ఆ తోటమాలిలా మన జీవన నందన వనంలోకి అనివార్యంగా వస్తుందని కబీర్‌ హెచ్చరించాడు. మొగ్గల వలె మనం కూడా మేల్కొని, మనసును లౌకిక విషయాల నుంచి పారలౌకిక చింతన దిశగా మళ్లాలని హితవు పలికాడు.

మనసు మాధవుడిపై నిలవాలంటే..

వృద్ధాప్యంలో ఓ భక్తుడు రమణ మహర్షి వద్దకు వచ్చాడు. ‘భగవాన్‌! ఇంత వయసొచ్చినా.. మనసు భగవంతుడి దిశగా ఎందుకు మరలటం లేదు?!’ అని ఆవేదన చెందాడు. అప్పుడు మహర్షి ‘మనిషికి సంపదే ఎక్కువ ప్రియం. ఆ సంపద కన్నా సంతానం, అంత కన్నా తన శరీరం, ఆ దేహం కన్నా ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల్లోకెల్లా నయనం.. కన్ను కన్నా ప్రాణం మీద ప్రీతి. ఉదాహరణకు- ఒక కుర్రాడు తప్పు చేశాడని శిక్షించబోతే.. తల్లిదండ్రులు చూడలేక ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇచ్చేసి అయినా- విడిపించుకుంటారు. అలా విత్తం కన్నా సంతానం ప్రియం. ‘ఆ తప్పు మూల్యంతో చెల్లేది కాదు, అతడికి బదులు నువ్వు లోబడితే వదులుతాం’ అంటే.. అందుకా తండ్రి అంగీకరించడు. ఎందుకంటే సంతానం కన్నా తన శరీరం, ఇంద్రియాలు, ప్రాణం ప్రియం కనుక. ఇలా ఉంటుంది మనిషి అపేక్ష, స్వార్థం. అలాంటి మమకారాలన్నీ తగ్గించుకుంటే.. అప్పుడు మనసు భగవంతుడిపై నిలుస్తుంది’ అన్నారు.

పరుగు ఆపితేనే ప్రశాంతత

‘ఏ మార్గాన్ని అనుసరించే వారికైనా జీవితంలో తప్పని సరిగా కొందరితో సంబంధం ఏర్పడుతుంది. జన్మవల్లనో, ప్రేమవల్లనో, కలయిక వల్లనో! కానీ ఆ సంబంధ బాంధవ్యాల్లోని అసందర్భాన్ని, అసంగత్వాన్ని, అశాశ్వతత్వాన్ని ఎవరైతే త్వరగా గుర్తిస్తారో- వారు వియోగ సమయంలో విచారించరు’ అన్నాడు గౌతమ బుద్ధుడు. ఈ రోజుల్లో మనం మృత్యుపాశంలో చిక్కుకునే వరకూ ఈ మానసిక స్థితికి చేరుకోవటం లేదు. లౌకిక కార్యకలాపాల నుంచి విరామం తీసుకోవటం లేదు. పరుగు ఆపితేనే ప్రశాంతత- అని తెలుసుకోవటం లేదు. ‘వార్ధక్యం ముంచుకొస్తున్నా కర్మలు చేస్తూ ఉండనవసరం లేదు. భగవంతుడిపై అసలైన భక్తి, అనురాగం పెంపొందే కొద్దీ కర్మలు తగ్గుతూ వస్తాయి. దైవ కృప ప్రసరించగానే కర్మలు పూర్తిగా తొలగిపోతాయి’ అన్నారు రామకృష్ణ పరమహంస. విషయానందం నుంచి బ్రహ్మానంద స్థితికి ఎంత త్వరగా చేరుకుంటే చివరి రోజుల్లో అంత ప్రశాంతంగా ఉండగలం. విషయానందం అంటే ప్రాపంచిక విషయాల్లో ఆనందాన్ని పొందటం. బ్రహ్మానందమంటే ఆధ్యాత్మికతలో ఆనందాన్ని ఆస్వాదించటం!

పరమాత్మ ధ్యానం.. పరోపకారం..

పరమాత్మ ధ్యానం, పరోపకారం ప్రశాంతమైన వార్ధక్యానికి మూల సూత్రాలు. ఈ దేహంలో దారుఢ్యం ఉన్నప్పుడే సత్కార్యాలు చేస్తూ, ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించుకుంటూ గడపాలి. దానం అడిగేందుకు వచ్చిన వామనుణ్ణి ఉద్దేశించి- ‘అయ్యో! మృత్యువు ఆప్తమిత్రుడు కాదు, యముడు దగ్గరి చుట్టం కాదు. సేవకులు భక్తితో సేవించాలనే బుద్ధిమంతులు కారు, ప్రాణం శాశ్వతం కాదు. బ్రహ్మ ఈ శరీరాన్ని రాళ్లతో మలచలేదు. అయినా.. మనుషులు సత్యం, దానం, దయ, ధర్మం.. అన్నీ వదలివేస్తున్నారు. ఆఖరి వరకూ ఈ మాయా సంసారాన్నే సత్యమని భావిస్తున్నారు’ అంటూ చెప్పి ఆవేదన చెందాడు బలిచక్రవర్తి. యౌవనం కన్నా వార్ధక్యానికి ఉన్న ప్రత్యేకత అనుభవసారం. అపారమైన జీవితానుభవాలతో పాఠాలు నేర్చుకుని, వివేక వైరాగ్యాలు పెంచుకుని రాబోయే తరాలకు మార్గదర్శకులుగా నిలవాల్సింది పెద్దవారే! ఈ అంత్యదశ చింతనను ఈశోపనిషత్తు అద్భుతంగా వర్ణించింది.
సూర్యుడు అస్తమిస్తున్న కాలాన్ని సంధ్యారాగం అంటారు. మనం అస్తమించే గడియలు కూడా ఆంతరంగిక ప్రశాంతతతో, ఆధ్యాత్మిక అన్వేషణతో సంధ్యారాగంలా రవళించాలి. నిశ్చలమైన మన చరమకాలం నలుగురికి ఆదర్శంగా నిలవాలి.
- మనోజ్ఞ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని