పచ్చబొట్టుతో ఆశీర్వాదం!

పచ్చబొట్టు వేయించుకోవడం అనేది సర్వసాధారణం. కానీ ‘సాక్‌ యాంట్‌ పచ్చబొట్టు’ సరదానో, ఫాషనో కాదు. వివరంగా చెప్పాలంటే.. థాయిలాండ్‌లోని చియాంగ్‌ మాయి నగరంలో వేసే వెదురు పచ్చబొట్టును పవిత్రంగా, ఆశీర్వాదంగా భావిస్తారు.

Published : 06 Jun 2024 00:13 IST

చ్చబొట్టు వేయించుకోవడం అనేది సర్వసాధారణం. కానీ ‘సాక్‌ యాంట్‌ పచ్చబొట్టు’ సరదానో, ఫాషనో కాదు. వివరంగా చెప్పాలంటే.. థాయిలాండ్‌లోని చియాంగ్‌ మాయి నగరంలో వేసే వెదురు పచ్చబొట్టును పవిత్రంగా, ఆశీర్వాదంగా భావిస్తారు. మాంత్రిక శక్తులు, కట్టుబాట్లతో కూడిన ఈ పచ్చబొట్టు ఆచారం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుందంటారు, అది వేయించుకున్నవారు. పురాతనమైన ఈ ఆచారం గురించిన ప్రస్తావన బౌద్ధ సాహిత్యంలో కనిపిస్తుంది.

తన వద్దకు వచ్చిన వ్యక్తిని ‘సిద్ధంగా ఉన్నావా?’- అని మృదువుగా అడుగుతాడు బౌద్ధ సన్యాసి. వారు అవునన్నాక.. ప్రార్థిస్తూ పచ్చబొట్టు వేసి, మంత్రశక్తిని ప్రసాదిస్తాడు. ‘సూది గాయం చేస్తూ.. నల్లటి సిరా శరీరంలోకి దిగుతుంటే.. అప్పుడు కలిగే బాధ చిత్రమైన అనుభూతినిస్తుంది. దాని గురించి ఒకరు చెబితే అర్థం కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి’ అంటారు ఈ టాటూ వేయించుకున్నవారు.

పచ్చబొట్టు తర్వాత ఆశీర్వదించి, అందరితో మంచిగా ఉండాలని, తోటివారికి మేలు చేయాలని ప్రబోధిస్తారు. ఆ నియమాలను తప్పక పాటించాలి కనుక.. ఈ టాటూను వినోదం కోసమో, కుతూహలంతోనో వేయించుకోరు. పూర్తి నమ్మకం ఉంటే అద్భుతాలే జరుగుతాయంటారు. భయాలు, సమస్యలు, శత్రుపీడ.. ఇలా దేనితో అవస్థ పడుతున్నారో తెలుసుకుని.. దానికి అనుకూలమైన డిజైన్‌ వేస్తారు. కొందరు ప్రముఖులు ఈ పచ్చబొట్టు వేయించుకోవడంతో బాగా ప్రాచుర్యం వచ్చింది. దీన్ని థాయ్‌లాండ్‌లోని చాలా ప్రాంతాల్లో వేస్తారు కానీ కొన్ని ఆలయాల్లోనే ఆశీర్వాదం లభిస్తుంది.

నాగరత్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని