పరిశుద్ధతకు ప్రతిరూపం అతడు

యాకోబు కుమారుడైన యోసేపు పరిశుద్ధతకు అసలైన ఉదాహరణగా నిలుస్తాడు. యాకోబు తన పుత్రులందరిలోకీ యోసేపునే ఎక్కువగా ప్రేమించాడు. మిగిలినవారికి అది నచ్చలేదు. అసూయతో యోసేపును హతమార్చాలనుకున్నారు.

Published : 06 Jun 2024 00:14 IST

యాకోబు కుమారుడైన యోసేపు పరిశుద్ధతకు అసలైన ఉదాహరణగా నిలుస్తాడు.

యాకోబు తన పుత్రులందరిలోకీ యోసేపునే ఎక్కువగా ప్రేమించాడు. మిగిలినవారికి అది నచ్చలేదు. అసూయతో యోసేపును హతమార్చాలనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఐగుప్తు వర్తకులు అతణ్ణి రక్షించి, తమ వెంట తీసుకెళ్లారు. దేవుడు యోసేపును ప్రేమించి, అంచెలంచెలుగా హెచ్చించాడు. యోసేపు సౌందర్యవంతుడు. పోతీఫర్‌ (ఫరోరాజు వద్ద సైన్యాధిపతి) భార్య అతణ్ణి ఇష్టపడి, తనతో శయనించమని అనేకసార్లు బలవంతపెట్టినా సమ్మతించ లేదు. ఒకరోజు విధినిర్వహణలో భాగంగా యోసేపు అంతఃపురంలోకి వచ్చినప్పుడు అక్కడ పోతీఫర్‌ భార్య తప్ప మరెవరూ లేరు. దాంతో ఆమె అతణ్ణి వశపరచు కునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. యోసేపు స్థానంలో మరో పురుషుడుంటే అద్భుత అవకాశం అనుకునేవాడు. అమెతో సన్నిహితంగా మెలిగినా ఎవరికీ తెలియదు. ఆ నేరాన్ని ఎవరూ రుజువు చేయలేరు. అలాంటి పరిస్థితిలోనూ అతడు ప్రలోభం చెందలేదు. దైవం తనకు తోడుగా ఉండగా, నిజాయితీపరుడైన యోసేపు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ ప్రయత్నంలో అతని వస్త్రాన్ని ఆమె (ఆది 39:12) లాగేసింది. తన మాట వినలేదని కక్ష కట్టి, యోసేపు మీద అభాండం వేసింది. తాను లాక్కున్న వస్త్రాన్ని చూపి, అతడు దాడిచేశాడని భర్తకు చెప్పింది. పోతీఫర్‌ ఆగ్రహించి యోసేపును చెరసాలలో పెట్టించాడు. కానీ దైవం అతణ్ణి వెన్నంటి ఉన్నాడు. ఫరోరాజుకు వచ్చిన స్వప్నం కారణంగా చెరసాల నుంచి విడుదలవడమే కాదు,  ఆయన ఆంతరంగికుల్లో ఒకనిగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంలో పౌలు తన కుమారుడైన తిమోతిని ‘నువ్వు య®వనంలో కలిగే ఇచ్ఛల నుంచి పారిపో తిమోతీ!’ అంటూ హితవు పలకడాన్ని స్మరించుకుందాం. ‘నీ దేహం దేవుని ఆలయమై ఉంది. దాన్ని అపవిత్ర కార్యాలకు దూరంగా ఉంచాలి. కామక్రోధ లోభ మద మాత్సర్యాలు అనే ఐదింటిలో మొదటిది మరీ ప్రమాదకరం. కనుక అప్రమత్తంగా ఉందాం. ప్రభువు బలిష్టమైన రెక్కల కింద వినమ్రంగా జీవిద్దాం.

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని