పీసీఓఎస్‌ బరువు

అండాశయాల్లో నీటి తిత్తులు (పీసీఓఎస్‌) అనగానే నెలసరి అస్తవ్యస్తం కావటం, రుతుస్రావం ఎక్కువగా కావటం వంటివే గుర్తుకొస్తాయి.

Published : 27 Feb 2024 00:07 IST

అండాశయాల్లో నీటి తిత్తులు (పీసీఓఎస్‌) అనగానే నెలసరి అస్తవ్యస్తం కావటం, రుతుస్రావం ఎక్కువగా కావటం వంటివే గుర్తుకొస్తాయి. కానీ దీంతో బరువూ పెరుగుతుంది. పీసీఓఎస్‌ నేరుగా అధిక బరువుకు కారణమవుతుందా? లేదా? అనేది కచ్చితంగా తెలియదు. కానీ జన్యువులతో పాటు ఆహారం, వ్యాయామం, జీవనశైలి వంటి పరిసర అంశాలూ దీనికి దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. మహిళల్లో సుమారు 15% మంది అండాశయ నీటితిత్తులతో బాధపడుతుంటారని అంచనా. వీరిలో 11 ఏళ్ల వయసులోనే దీనికి సంబంధించిన లక్షణాలు పొడసూపటం మొదలవుతుంది. ఇది శరీర బరువును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటే నియంత్రించుకునే వీలుంటుంది. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటం వల్ల పీసీఓఎస్‌ తలెత్తుతుంది. వీరిలో టెస్టోస్టిరాన్‌ అనే పురుష హార్మోన్‌ కాస్త ఎక్కువగా విడుదలవుతుంది. ఇది అండాశయాల పనితీరు మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా నెలసరి సమయానికి రాకపోవటం, మొటిమలు, మీసాలు, గడ్డాలు మొలవటం వంటి లక్షణాలు మొదలవుతాయి. ఇవే కాకుండా సంతానం కలగకపోవటం, బరువు పెరగటం, మెడ వెనకాల చర్మం రంగు మారటం, జుట్టు పలచగా అవటం, కొలెస్ట్రాల్‌ మోతాదులు ఎక్కువ కావటం, కణాలు ఇన్సులిన్‌కు స్పందించకపోవటం (ఇన్సులిన్‌ నిరోధకత), కుంగుబాటు వంటి సమ్యలూ బయలుదేరతాయి.

బరువెందుకు పెరుగుతుంది?

పీసీఓఎస్‌లో బరువు పెరగటానికి ప్రధాన కారణం ఇన్సులిన్‌ నిరోధకత. ఇందులో కణాలు ఇన్సులిన్‌ హార్మోన్‌కు స్పందించవు. దీంతో రక్తంలోని గ్లూకోజు కణాల్లోకి సరిగా చేరుకోదు. అప్పుడు శరీరం మరింత ఎక్కువగా ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. రాన్రానూ గ్లూకోజు మోతాదులను నియంత్రణలో ఉంచటానికి ఇన్సులిన్‌ అధికంగా విడుదలవుతూనే వస్తుంది. పీసీఓఎస్‌లో ఊబకాయానికి ఇదే ముఖ్యమైన కారణం. పీసీఓఎస్‌ గలవారిలో సగానికన్నా ఎక్కువ మంది అధిక బరువుతోనూ బాధపడుతుంటారు. రక్తంలో గ్లూకోజు స్థాయులు నిరంతరం అధికంగా ఉండటం మధుమేహానికీ దారితీస్తుంది. సాధారణంగా మహిళల్లో తుంటి, తొడలు, పిరుదుల వద్ద బరువు పెరుగుతుంది. అయితే పీసీఓఎస్‌లో కడుపు వద్ద కొవ్వు పేరుకోవటం వల్ల బొజ్జ వస్తుంది. ఒకసారి బొజ్జ పెరిగితే తగ్గటం కష్టమైన పనే అనుకోవచ్చు.

నయం కాదు గానీ..

  • ప్రస్తుతానికి పీసీఓఎస్‌ను నయం చేసే చికిత్స ఏదీ లేదు. కానీ దీని ప్రభావాలను తగ్గించుకునే అవకాశాలైతే ఉన్నాయి.
  • బరువు అధికంగా ఉంటే ఆహార, వ్యాయామ నియమాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. శరీర బరువులో 5 నుంచి 10 శాతం తగ్గినా కొలెస్ట్రాల్‌ తగ్గుముఖం పడుతుంది. ముందస్తు మధుమేహం లక్షణాలూ తగ్గుతాయి. ముఖ్యంగా సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
  • పీసీఓఎస్‌ గలవారిలో కొందరికి డాక్టర్లు మెట్‌ఫార్మిన్‌ మందు వేసుకోవాలనీ సూచిస్తారు. సాధారణంగా దీన్ని మధుమేహం గలవారికి ఇస్తుంటారు. అయితే ఇది కణాలు మరింత సమర్థంగా గ్లూకోజును స్వీకరించేలా చేయటం వల్ల పీసీఓఎస్‌ లక్షణాలు తగ్గటానికీ ఉపయోగపడగలదు.
  • ఫలదీకరణ జరగటానికి తోడ్పడే మందులతో గర్భధారణ జరిగేలా చూసుకోవచ్చు. ఇవి పనిచేయకపోతే ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో అండాశయం మీదుండే పొర మందాన్ని తగ్గించాల్సి ఉంటుంది. దీంతో అండాశయాల నుంచి టెస్టోస్టిరాన్‌ విడుదలయ్యే మోతాదు తగ్గుతుంది.
  • సంతానం కోసం ప్రయత్నించని వారికి గర్భనిరోధక మాత్రలు మేలు చేస్తాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. నెలసరి సరిగా వచ్చేలా చేస్తాయి. ఇవి మొటిమలు, అవాంఛిత రోమాలు పెరగకుండానూ చూస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని