అధిక కొలెస్ట్రాల్‌ను కాలేయం తింటుంది!

శరీరం తనను తాను కాపాడుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది.

Updated : 19 Mar 2024 01:12 IST

శరీరం తనను తాను కాపాడుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. కాలేయంలోని రోగనిరోధక కణాలు అధిక కొలెస్ట్రాల్‌ మోతాదులకు స్పందించటమే కాకుండా.. ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్‌ను తినేస్తున్నట్టూ స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూటెట్‌ అధ్యయనంలో బయట పడింది. ఇలా రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడు తున్నట్టు తేలింది. ఒకరకంగా రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటానికి బీజం కాలేయం లోనే పడుతున్నట్టు ఇది సూచిస్తోంది. రక్తంలో అధిక చెడు కొలెస్ట్రాల్‌కు శరీరంలోని వేర్వేరు కణజాలాలు స్పందించే తీరును అర్థం చేసుకోవాలన్నది పరిశోధకుల ఉద్దేశం. ఇందుకోసం ఎలుకల్లో ఉన్నట్టుండి కొలెస్ట్రాల్‌ మోతాదులు పెరిగేలా చేసి పరిశీలించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే- కాలేయం వెంటనే స్పందించి, అధిక కొలెస్ట్రాల్‌ను కొంతవరకు తొలగించటం. అయితే కాలేయ కణాలు కాకుండా కుఫర్‌ అనే రోగనిరోధక కణాలు ఇందుకు దోహదం చేస్తుండటం విచిత్రం. ఇవి హానికారక పదార్థాలను గుర్తించి,  వాటిని తినేస్తుండటం విశేషం. మానవ కణజాలంలోనూ ఇలాగే జరుగుతున్నట్టూ పరిశోధకులు ధ్రువీకరించారు. అంటే అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించటంలో కాలేయం ముందు వరుసలో నిలుస్తోందన్నమాట. సాధారణంగా కాలేయం కొవ్వును దాచుకుంటుందని భావిస్తుంటారు. అయితే కొలెస్ట్రాల్‌ మోతాదులను నియంత్రించటంలో కాలేయ రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తేలటం గమనార్హం. పూడికలు ఏర్పడటం కేవలం రక్తనాళాలకు సంబంధించిందే కాదని, ఇది పలు అవయవాలనూ ప్రభావితం చేస్తున్నట్టు తాజా అధ్యయనం తెలియజేస్తోంది. కొలెస్ట్రాల్‌ అనేది ఒకరకమైన కొవ్వు. హార్మోన్లు, కణాల పైపొరలు ఏర్పడటం వంటి రకరకాల పనులకు ఇది అత్యవసరం. అయితే రక్తంలో దీని మోతాదులు పెరిగితే మాత్రం హాని చేస్తుంది. రక్తనాళాల గోడలకు అంటుకుపోయి, పూడికలుగా మారుతుంది. గుండె, మెదడు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే గుండెపోటు, పక్షవాతం సంభవిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని