నోరు చేదు ఎందుకు?

నోరు చేదుగా ఉండటానికి రకరకాల కారణాలు దోహదం చేయొచ్చు. సహజంగానే వృద్ధాప్యంలో నాలుక మీదుండే రుచి మొగ్గల సంఖ్య తగ్గుతుంది. దీనికి తోడు లాలాజలం ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది....

Published : 29 May 2018 01:38 IST

సమస్య-సలహా
నోరు చేదు ఎందుకు?

ప్రశ్న: నాకు 65 ఏళ్లు. ఎప్పుడూ నోరు చేదుగా ఉంటుంది. ఎండలో పనిచేస్తే మరింత ఎక్కువ అవుతుంది కూడా. దీనికి కారణమేంటి? ఏమైనా చికిత్సలున్నాయా?

- ఒక పాఠకుడు, తురువోలు

జవాబు: నోరు చేదుగా ఉండటానికి రకరకాల కారణాలు దోహదం చేయొచ్చు. సహజంగానే వృద్ధాప్యంలో నాలుక మీదుండే రుచి మొగ్గల సంఖ్య తగ్గుతుంది. దీనికి తోడు లాలాజలం ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దాహం వేస్తున్న విషయాన్నీ సరిగా గుర్తించలేరు. ఫలితంగా నోరు పొడిబారుతుంది. అలాగే లాలాజలంలోని నీరు, ఖనిజ లవణాలు, జిగురుద్రవం, ఎంజైమ్‌ల మధ్య సమతుల్యత కూడా దెబ్బతినొచ్చు. దీంతో నోరు రుచి తగ్గుతుంది. చేదుగా అనిపిస్తుంటుంది. ఎండలోకి వెళితే నోటి చేదు ఎక్కువవుతుందని అంటున్నారు కాబట్టి మీ విషయంలో నోరు పొడిబారటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా ఎండలోకి వెళ్లినపుడు ఒంట్లో నీటిశాతం తగ్గుతుంది. చెమటతో పాటు ఖనిజ లవణాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. నోట్లో లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో నోరు మరింత పొడిబారిపోయి, ఎక్కువగా చేదు అనిపిస్తుండొచ్చు. కాబట్టి బయటకు వెళ్లే ముందే తగినంత నీరు తాగేలా చూసుకోవాలి. కాస్త ఓఆర్‌ఎస్‌ పొడిని నీటిలో కలుపుకొని తాగితే ఇంకా మంచిది. కొందరిలో జాగ్రన్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలతోనూ లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలేవైనా ఉన్నాయేమో కూడా చూసుకోవాలి. చాలామంది వృద్ధులు చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌, దంత సమస్యలను పెద్దగా పట్టించుకోరు. నోటి శుభ్రతను పాటించకపోయినా నోరు చేదుగా అనిపించొచ్చనే సంగతిని గుర్తించాలి. కాబట్టి వీలైనప్పుడల్లా ఓసారి దంత నిపుణులను కలిసి పరీక్షించుకోవాలి. నోరు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. సిగరెట్లు, బీడీలు, చుట్టలు కాల్చటం.. పొగాకు, జర్దా, ఖైనీ, గుట్కా వంటివి నమలటం వల్ల కూడా నోటి రుచి మారిపోవచ్చు. కాబట్టి సిగరెట్లు, బీడీలు తాగే అలవాటుంటే మానెయ్యాలి. పొగాకు, గుట్కాలకు దూరంగా ఉండాలి. జలుబు, సైనసైటిస్‌ వంటి సమస్యల్లోనూ నోటి రుచి దెబ్బతినొచ్చు. కొందరికి పులితేన్పులతోనూ (జీర్ణాశయంలోంచి ఆమ్లం పైకి ఎగదన్నుకొని రావటం) రుచి మారిపోయి.. చేదుగా అనిపించొచ్చు. అందువల్ల ఇలాంటి సమస్యలేమైనా ఉంటే తగు చికిత్స తీసుకోవాలి. అంతేకాదు, ఏసీఈ ఇన్‌హిబిటార్స్‌ రకం బీపీ మందులతోనూ నోటి రుచి మారిపోవచ్చు. బీపీ మందులు వేసుకోవటం మొదలెట్టాక ఇలాంటి ఇబ్బంది మొదలైతే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. అవసరమైతే డాక్టర్‌ మందులు మార్చటం చేస్తారు.

మీ సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా:
సమస్య - సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని