కోతి కొమ్మచ్చి.. వీడియో గేమ్‌ మెచ్చేసి!

అదృష్టమంటే ఈ కోతిదే.. హాయిగా కంప్యూటర్‌ ముందు కూర్చుని ఎంచక్కా వీడియో గేమ్‌ ఆడుతోంది. అది ఓ చోట అంత బుద్ధిగా కూర్చుని.. ఏకాగ్రతతతో ఆడడానికి ఓ కారణమూ ఉంది. అదేంటంటే... అది గేమ్‌లో గెలిస్తే బహుమతిగా దానికి బనానా స్మూతీ

Published : 25 Apr 2021 01:53 IST

అదృష్టమంటే ఈ కోతిదే.. హాయిగా కంప్యూటర్‌ ముందు కూర్చుని ఎంచక్కా వీడియో గేమ్‌ ఆడుతోంది. అది ఓ చోట అంత బుద్ధిగా కూర్చుని.. ఏకాగ్రతతతో ఆడడానికి ఓ కారణమూ ఉంది. అదేంటంటే... అది గేమ్‌లో గెలిస్తే బహుమతిగా దానికి బనానా స్మూతీ ఇస్తారట మరి. ఎంత బాగా ఆడితే అంత ఎక్కువ తినిపిస్తారట. ఇక్కడే మీకో సందేహం వచ్చి ఉంటుంది. ‘కోతికి అన్ని తెలివి తేటలున్నాయా..? గేమ్‌ని అంత చక్కగా ఎలా ఆడగలుగుతుంది?’ అని.. మీ అనుమానం నిజమే. మరి అసలు విషయం ఏంటో తెలుసుకుందామా!
ఎలన్‌ మస్క్‌.. ఈ అంకుల్‌ పేరు మీరు వినే ఉంటారు కదా! ఈయన ప్రపంచ కుబేరుల్లో ఒకరు. కార్లు, రాకెట్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత. వాటితో పాటే ఇప్పుడు మరో కొత్త సంస్థనూ ప్రారంభించారాయన. దాని పేరు ‘న్యూరాలింక్‌’. మనుషుల మెదళ్లను నియంత్రించే పరికరాలను కనిపెడుతుందంట ఈ కంపెనీ! మన మెదడు బాగానే పనిచేస్తుందిగా.. మరి కృత్రిమ పరికరాలెందుకంటారా? కొందరిలో శారీరక లోపాలుంటాయి. ముఖ్యంగా మెదడు మాత్రమే పనిచేస్తూ, మిగతా శరీరమంతా చచ్చుబడి పోతుంది. అలాంటి వాళ్లు సొంతంగా తమ పని తాము చేసుకోలేరు. వారికోసమే ఈ ఏర్పాటన్నమాట.
సంకేతాల సాయంతో..
మెదడును నియంత్రించే పరికరాలను శస్త్ర చికిత్స ద్వారా తలలో అమర్చుతారు. వాళ్లు చెప్పాలనుకున్న విషయాన్ని ఆ పరికరాలు గ్రహిస్తాయి. అవిచ్చే సంకేతాల సాయంతో మొదట స్మార్ట్‌ఫోన్‌, ఆ తర్వాత కంప్యూటర్‌ను నియంత్రించగలిగేలా దీన్ని రూపొందించాలనేది సంస్థ ఉద్దేశం. పక్షవాతం వల్ల కాళ్లు, చేతులు కదల్చలేని వాళ్లకూ దీన్ని ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలన్నది వాళ్ల ఆశయం. ఇక ఈ కోతి విషయానికొస్తే.. దీని పేరు పాగర్‌. దీని మెదడులో ‘లింక్‌’ అనే పరికరాన్ని పెట్టారు. దీని వల్లే పాగర్‌ చేతులు గేమ్‌కు అనుగుణంగా కదలడానికి దాని మెదడు నుంచి సంకేతాలు అందుతాయంట. ఇంతకు ముందు ఈ ప్రయోగాన్ని పందుల మీదా, వేరే జంతువుల మీద కూడా చేశారట. అదన్నమాట సంగతి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని