ఇది ‘సూపర్‌ హీరో డాగ్‌’!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందో పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. టీవీల్లోనూ చూస్తూనే ఉంటారు. ఖాళీ చాక్లెట్‌ కవర్లో, బిస్కెట్‌ ప్యాకెట్లో ఇష్టం వచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటారు కొందరు. అలాంటిది ఓ కుక్క మాత్రం ఏకంగా ఒక పార్కును

Published : 11 Jun 2022 01:49 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందో పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. టీవీల్లోనూ చూస్తూనే ఉంటారు. ఖాళీ చాక్లెట్‌ కవర్లో, బిస్కెట్‌ ప్యాకెట్లో ఇష్టం వచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటారు కొందరు. అలాంటిది ఓ కుక్క మాత్రం ఏకంగా ఒక పార్కును పరిశుభ్రంగా ఉంచుతూ, మనుషులకు రోల్‌ మోడల్‌గా నిలుస్తోంది. ఆ వివరాలే ఇవీ..

చిలీ దేశ రాజధాని నగరం శాంటియాగోలోని మెట్రోపాలిటన్‌ పార్కుకు నిత్యం వందల మంది టూరిస్టులు వచ్చివెళ్తుంటారు. ఒకరోజు పెంపుడు కుక్క ‘సామ్‌’ను, తన యజమాని ఆ పార్కుకు వాకింగ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ట్రాక్‌ మీద నడుస్తుండగా.. పక్కనే చాలా బాటిళ్లూ, కవర్లూ, మాస్కులూ, ఇతర ప్లాస్టిక్‌ వ్యర్థాలూ వారికి కనిపించాయట. అప్పుడే ఆ యజమానికో ఆలోచన వచ్చింది.

వారానికి మూడుసార్లు...

పార్కులోని వ్యర్థాలను కుక్క సహాయంతో తానే సొంతంగా ఏరివేయాలని అనుకున్నాడా యజమాని. మరుసటి రోజే ‘సామ్‌’ వీపుపైన ఒక బ్యాగ్‌ను తగిలించి.. పార్కులోని చెత్తా చెదారాన్ని సేకరించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజూ వాకింగ్‌కు వెళ్లినా.. వారానికి మూడుసార్లు మాత్రం పార్కును శుభ్రం చేస్తున్నారు. కనిపించిన చెత్తను యజమాని తీస్తూ.. కుక్క వీపునున్న సంచిలో వేస్తుంటాడు. అలా సేకరించిన వ్యర్థాలను, అధికారుల సాయంతో రీసైక్లింగ్‌ ప్లాంట్‌కు తరలిస్తారట. 

డాక్యుమెంటరీ కూడా...

పార్కు శుభ్రతా బాధ్యతలు చేపట్టిన ఆ పప్పీ.. గత ఏప్రిల్‌ ఒక్క నెలలోనే 602 మాస్కులూ, 585 సీసాలూ, 304 డబ్బాలను సేకరించిందట. చాక్లెట్‌ కవర్లూ, ఇతర చెత్త వీటికి అదనం. ఈ శునకం వాలంటరీ సేవలకు గుర్తింపుగా అక్కడి యంత్రాంగం ఓ కామిక్‌ డాక్యుమెంటరీ కూడా రూపొందించింది. దానికి ‘సామ్‌ - ద సూపర్‌ హీరో ఆఫ్‌ మెట్రోపాలిటన్‌ పార్క్‌’ అని పేరు పెట్టి విడుదల చేశారు. ఈ డాక్యుమెంటరీని అక్కడి స్కూళ్లలో ప్రదర్శిస్తూ.. పర్యావరణం, పరిసరాల పరిశుభ్రల గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కుక్క సేవలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. దాంతో రోజుల వ్యవధిలోనే చిన్నపాటి సెలబ్రిటీగా మారిన ఈ పప్పీని.. స్థానికులు ‘సూపర్‌హీరో డాగ్‌’ అని పిలుస్తున్నారు. నిజంగా ఈ ‘సామ్‌’ చాలా గొప్ప పని చేస్తుంది కదూ! మనం మాత్రం వ్యర్థాలను చెత్త డబ్బాల్లోనే పడేస్తూ.. మంచి పిల్లలుగా ఉందాం ఫ్రెండ్స్‌..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని