చేపా.. చేపా..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మన దగ్గర అక్కడక్కడా పావురాలు గుంపులు గుంపులుగా కనిపిస్తుంటాయి కదా! కొందరు వాటికి దాణా వేస్తుంటారు కూడా.

Published : 03 Dec 2022 00:38 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మన దగ్గర అక్కడక్కడా పావురాలు గుంపులు గుంపులుగా కనిపిస్తుంటాయి కదా! కొందరు వాటికి దాణా వేస్తుంటారు కూడా. మరికొందరైతే ఫొటోలూ దిగుతుంటారు. అలాగే.. చేపలూ ఓ ప్రాంతంలో గుంపులు గుంపులుగా కనిపిస్తుంటాయి. స్థానికులతోపాటు పర్యాటకులూ అక్కడికి వచ్చివెళ్తుంటారట. అదెక్కడో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!

వియత్నాంకి చెందిన మోయ్‌ అనే వ్యక్తి బాతులను పెంచుతుంటాడు. నది పక్కనే ఆయన ఇల్లు. ఆ నది వెంబడి.. చాలా నివాసాలు ఉన్నా, ప్రతిరోజూ ఆయన ఇంటి దగ్గరికే వేలకొద్దీ చేపలు గుంపులుగా వస్తుంటాయి. మోయ్‌ పెట్టే ఆహారాన్ని హాయిగా తిని వెళ్లిపోతుంటాయి. ఆ నదికి ఆనుకొని ఉంటున్న వేరే వాళ్లు పెట్టిన ఆహారాన్ని మాత్రం అవి ముట్టుకోవట. దాదాపు రెండేళ్లుగా సాగుతుందీ తంతు. 

చేపల ఆకలి తీర్చాలని..

2020లో ఒకరోజు మోయ్‌ వాళ్ల కుటుంబ సభ్యులు అక్కడ కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారట. ఇంట్లో అతనొక్కడే ఉండటంతో వంట చేయసాగాడు. ఏదో శబ్దం వినిపించడంతో కిటికీలోంచి బయటకు చూశాడు. పక్కనే ఉన్న నదిలోంచి చేపలు నోళ్లు బయటకు పెట్టడం గమనించాడు. అవి ఆకలితో ఉన్నాయనుకొని, ఇంట్లో పెంచుకునే బాతులు తినే గింజలను ఆ చేపలకు విసిరేశాడు. తర్వాత ఇంట్లోకి వెళ్లి తన పనిలో మునిగిపోయాడు. మరుసటి రోజు.. ముందురోజు కంటే ఎక్కువ చేపలు తన ఇంటి వద్దకు వచ్చి నీళ్లలోంచి నోళ్లు బయటకు పెట్టడం చూశాడు. మొదట ఆశ్చర్యపోయినా, వాటి ఆకలి తీర్చేందుకు మళ్లీ వెళ్లి ఆహారం అందించాడు.

బస్తా నుంచి క్వింటాళ్లలో..

మొదట్లో వందల సంఖ్యలో వచ్చే చేపలకు ప్రతి రోజూ బస్తా గింజలను మోయ్‌ ఆహారంగా అందించేవాడు. క్రమంగా ఆ సంఖ్య వేలల్లోకి చేరింది. ఇప్పుడు క్వింటాళ్ల కొద్దీ సమకూర్చాల్సి వస్తోంది. అన్ని చేపలు రోజూ ఒకే సమయంలో ఎలా వస్తున్నాయో, వేరే వాళ్లు వేసే ఆహారాన్ని ఎందుకు తినడం లేదో ఎవరికీ అంతుచిక్కడం లేదట. ఆ చేపలకు ఆహారం సమకూర్చడం తన శక్తికి మించిన పని కావడంతో.. స్థానికంగా కూరగాయలను, పండ్లను సేకరిస్తున్నాడు మోయ్‌. ఈ విషయం కాస్త బయటి ప్రపంచానికి తెలియడంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారితోపాటు పర్యాటకులు ఇక్కడికి వరస కడుతున్నారట.

వేటాడొద్దని కోరుతూ..

మోయ్‌ ఇంటి వద్దకు వేల సంఖ్యలో చేపలు వస్తుండటంతో, కొందరు ఇదే అదునుగా వాటిని పట్టుకునేందుకు వలలు వేస్తున్నారట. అయితే, మోయ్‌ మాత్రం ఆహారం కోసం వచ్చే చేపలను పట్టుకునేందుకు వల వేయొద్దని వారిని కోరుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలోనూ కొందరు వేటాడే ప్రయత్నం చేస్తుండటంతో.. అక్కడో మనిషిని ఉంచి మరీ బయట తన పనులు చూసుకొని వస్తున్నాడట. అక్కడి వారు దీన్ని ముద్దుగా ‘చేపల బడి’ అని పిలుస్తున్నారు. భలే ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని