కస్కస్‌ అనే నేను!

ఏంటి అలా అవాక్కయ్యారు! నేనేం అబద్ధం ఆడటం లేదు. మీతో జోక్‌ అంతకన్నా చేయడం లేదు. నిజంగా నా పేరు కస్కస్‌. ఇదేదో నా ముద్దు పేరు అనుకునేరు

Updated : 15 Oct 2023 06:47 IST

ఏంటి అలా అవాక్కయ్యారు! నేనేం అబద్ధం ఆడటం లేదు. మీతో జోక్‌ అంతకన్నా చేయడం లేదు. నిజంగా నా పేరు కస్కస్‌. ఇదేదో నా ముద్దు పేరు అనుకునేరు. నా అసలు పేరే ఇది. నా పేరే ఇంత చిత్రంగా ఉంటే... ఇక నేనెంత విచిత్రంగా ఉండాలి!! అందుకే ఆ విశేషాలు మీతో చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను. ఫ్రెండ్స్‌...నా గురించి తెలుసుకుంటారా మరి!

శరీరంపైన నల్లటి మచ్చలు ఉంటాయి కాబట్టి.. నన్ను ‘బ్లాక్‌ స్పాటెడ్‌ కస్కస్‌’ అని పిలుస్తారు. నేను న్యూగినియాకు చెందిన జీవిని. మాలో మరికొన్ని రకాలూ ఉన్నాయి. మేం దాదాపు 6 నుంచి 7 కిలోల వరకు బరువు తూగుతాం. 120 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాం. శరీరం పొడవేమో 70 సెంటీమీటర్లు ఉంటే.. నా తోక పొడవేమో 50 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. మాలో ‘బేర్‌ కస్కస్‌’ మాత్రమే మా కంటే కాస్త పెద్దగా ఉంటుంది.

మా తోకే... మాకు రక్ష!

మాలో ఆడా.. మగా.. రెండింటి శరీరాల మీద నలుపు మచ్చలు, మరి కొన్నింటి మీద ఎరుపు, ఇంకొన్నింటి శరీరం మీద నలుపు, ఎరుపు రెండు మచ్చలూ ఉంటాయి. ఇంకా మేం పదునైన గోర్లను కలిగి ఉంటాం. వీటి సాయంతోనే తేలిగ్గా చెట్లపైన జీవించగలం. మరో విషయం ఏంటంటే మా తోక మాకు చేయిలా పని చేస్తుంది. మేం పట్టుతప్పి పడిపోకుండా... ఇదే మమ్మల్ని కాపాడుతుంది.

ఏం తింటామంటే...

మేం ఎక్కువగా పండ్లు, ఆకులు, విత్తనాలను ఆహారంగా తీసుకుంటాం. అలా అని మేం కేవలం శాకాహారులం మాత్రమే కాదు. చిన్న చిన్న జీవులను కూడా తిని, మా బొజ్జ నింపుకొంటాం. మమ్మల్ని విపరీతంగా వేటాడటం, అక్రమరవాణా వల్ల మా ఉనికి ప్రమాదంలో పడింది. ముఖ్యంగా మమ్మల్ని మాంసం కోసం వేటాడతారు. అలాగే మేం చూడ్డానికి ముద్దుగా బొద్దుగా ఉంటాం కాబట్టి చట్టవిరుద్ధంగా మమ్మల్ని పెంచుకోవడం కోసం అక్రమ రవాణా చేస్తుంటారు. గతంలో ఓసారి చెన్నై విమానాశ్రయంలోనూ అధికారులు మాలో రెండింటిని పట్టుకుని కాపాడారు తెలుసా! ప్రస్తుతం మా సంఖ్య ఎంతో కచ్చితంగా తెలియదు కానీ, మేమైతే అంతరించిపోయే ప్రమాదంలో మాత్రం ఉన్నాం. నేస్తాలూ... మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటామరి బై.. బై...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు