Pranaya Vilasam Review: రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్‌ నటించిన సినిమా ఎలా ఉందంటే?

మమితా బైజు, అర్జున్‌ అశోకన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్‌’లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా కథేంటంటే?

Published : 04 May 2024 10:49 IST

చిత్రం: ప్రణయ విలాసం; నటీనటులు: మమితా బైజు, అర్జున్‌ అశోకన్‌, అనస్వర రాజన్, హకీం షా, శ్రీధన్య, మనోజ్‌ కె.యు, మియా జార్జ్‌; సంగీతం: షాన్‌ రెహమాన్‌; ఛాయాగ్రహణం: షినోజ్‌; కూర్పు: బిను నెపోలియన్‌; రచన: జ్యోతిష్‌, సును ఏవీ; దర్శకత్వం: నిఖిల్‌ మురళి; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఈటీవీ విన్‌.

విభిన్న కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించేందుకు ముందుంటుంది ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్‌’ (ETV Win). ఒరిజినల్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లతోపాటు బాక్సాఫీసు వద్ద సందడి చేసిన పలు చిత్రాలనూ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తుంది. అలా ఈ వారం అందుబాటులోకి వచ్చిన సినిమా ‘ప్రణయ విలాసం’ (Pranaya Vilasam). ‘ప్రేమలు’ (Premalu) హీరోయిన్‌ మమిత బైజు (Mamitha Baiju), అర్జున్‌ అశోకన్‌ (Arjun Ashokan) తదితరులు నటించిన ఈ మలయాళ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి? (Pranaya Vilasam review in telugu)

కథేంటంటే?: సూరజ్‌ (అర్జున్‌ అశోకన్‌)కి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఆసక్తి. ఆ రంగంలో స్థిరపడేందుకు శిక్షణ తీసుకోవాలనుకుంటాడు. తండ్రి రాజీవన్‌ (మనోజ్‌ కె.యు)కి కొడుకు అభిరుచి నచ్చదు. బుద్ధిగా చదువుకోమని సూచిస్తాడు. అలా డిగ్రీలో చేరిన సూరజ్‌కు గోపిక (మమితా బైజు) పరిచయమవుతుంది. కొంతకాలానికి వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. మరోవైపు, కాలేజీ రోజుల్లో తాను ప్రేమించిన మీరా (మియా జార్జ్‌) మళ్లీ రాజీవన్‌ లైఫ్‌లోకి వస్తుంది. ఆమెతో మాట్లాడడం తప్పా, ఒప్పా? అని తేల్చుకునే సమయంలో ఆయన భార్య అనుశ్రీ (శ్రీధన్య) అనారోగ్యంతో మరణిస్తుంది. సతీమణి రాసుకున్న డైరీని చదివి రాజీవన్‌ షాక్‌ అవుతాడు. పెళ్లికి ముందు ఆమెకూ ఓ ప్రేమకథ ఉందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతాడు. తండ్రి మాట కాదని సూరజ్‌ డైరీ మొత్తం చదివి, ఆమె చివరి కోరిక నెరవేర్చాలనుకుంటాడు. ఇంతకీ ఆ కోరిక ఏంటి? ఈ క్రమంలో అతడికి ఎదురైన అనుభవాలేంటి? ప్రేమించిన వ్యక్తిని అనుశ్రీ ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయింది? రాజీవన్‌- మీరా సెకండ్‌ ఇన్నింగ్‌ లవ్‌స్టోరీ ఏమైంది? సూరజ్‌- గోపిక ఒక్కటయ్యారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే (Pranaya Vilasam review).

ఎలా ఉందంటే?: ఏ చిత్ర పరిశ్రమ టచ్‌ చేయలేని కాన్సెప్టులను మలయాళ ఇండస్ట్రీ తెరకెక్కిస్తుంటుంది. అగ్ర హీరోల నుంచి యువ నటుల వరకూ అందరిదీ అదే బాట. ఈ ‘ప్రణయ విలాసం’ ఆ కోవకే చెందుతుంది. తొలిప్రేమ జ్ఞాపకాల గురించి ఎన్నో చిత్రాల్లో చూశాం. కానీ, వాటిని హీరో తల్లిదండ్రుల కోణంలో ఆవిష్కరించడం విశేషం. ఎలాంటి హంగామా లేకుండా సింపుల్‌గా హీరో, హీరోయిన్‌ని పరిచయం చేసిన దర్శకుడు అసలు కథను చెప్పేందుకు మాత్రం కాస్త టైమ్‌ తీసుకున్నారు. హీరో కాలేజీ వాతావరణం, కుటుంబ నేపథ్యాన్ని చూపిస్తూ అక్కడక్కడ నవ్వులు పంచారు. తండ్రి అంటే కొడుక్కి పైకి కోపం ఉన్నా లోపల ఇష్టం ఉండడం, తండ్రి కొడుకుని తిట్టినప్పుడల్లా అమ్మ ప్రోత్సహించడం.. పలు సినిమాల్లోని టెంప్లేటే ఇందులోనూ కనిపిస్తుంది. సూరజ్‌- గోపికల ప్రేమ ఎక్కడికి దారి తీస్తుందా?అని ఆసక్తిగా చూసే ప్రేక్షకుడికి రాజీవన్‌- మీరా లవ్‌స్టోరీ రూపంలో ట్విస్ట్‌ ఎదురవుతుంది. ఓ వైపు ‘అంత వయసొచ్చిన ఆయన భార్య, కొడుకుని మోసం చేస్తున్నాడా?’ అని, మరోవైపు ‘నిజమైన ప్రేమ ఇంటే ఇదేనేమో!’ అని అనిపించేలా ఆయా సన్నివేశాలను రూపొందించారు. అవి చాలామందికి కనెక్ట్‌ అవుతాయి. అనుశ్రీ మరణం సన్నివేశంతో ద్వితీయార్ధంపై ఆసక్తి నెలకొంటుంది (Pranaya Vilasam review in telugu).

ఆమె ఫ్లాష్‌బ్యాక్‌తోనే సెకండాఫ్‌ రన్‌ అవుతుంది. డైరీ రాజీవన్‌కు దొరికినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. తల్లి అస్తికలు కలిపేందుకు తండ్రితో కలిసి ప్రయాణించే హీరో డైరీని చదువుతూ.. గతంలో ఏం జరిగిందో ప్రేక్షకుడికి వివరిస్తాడు. నాటి ప్రేమకహానీలో అనుశ్రీని యంగ్‌గా చూపించకుండా మరో హీరోయిన్‌ అనస్వరన్‌ను తెరపైకి తీసుకురావడం ఊరటనిచ్చే అంశం. ఆమె లవర్‌ వినోద్‌గా హకీం షా ఆకట్టుకున్నారు. ఇద్దరు క్యూట్‌ జోడీ అనిపించుకున్నారు. అనస్వరన్‌ పాత్రతో ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌’ అంశాన్ని తనదైన శైలిలో చూపించారు దర్శకుడు. ఆ ప్రేమికులు పెళ్లి పీటలెందుకు ఎక్కలేదు? అనే ఉత్కంఠను అటు డైరీ చదువున్న సూరజ్‌లోనూ ఇటు ఆడియన్స్‌లోనూ రేకెత్తించారు. దాన్ని వెంటనే రివీల్‌ చేయకుండా.. ఎప్పుడైతే రాజీవన్‌- సూరజ్‌లు వినోద్‌ను కలుసుకుంటారో అప్పుడు తెరదించారు. క్లైమాక్స్‌ సంతృప్తినిస్తుంది. అనుశ్రీ- వినోద్‌లపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టడంతో రాజీవన్‌- మీరా, సూరజ్‌- గోపికల కథలను అసంపూర్తిగా వదిలేసినట్టైంది. 

ఎవరెలా చేశారంటే?: మమితా బైజు, మియా జార్జ్‌, అనస్వరన్‌ రాజన్‌ మినహా మిగిలిన వారంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తే. కానీ, ఆయా పాత్రల్లో ఒదిగిపోయి ఆకట్టుకున్నారు. రాజీవన్‌ పాత్రధారి మనోజ్‌కు స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఎక్కువ. మమితా బైజు పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు. సాంకేతిక బృంద విషయానికొస్తే.. ఎమోషన్‌ను ప్రేక్షకుడికి కనెక్ట్‌ అయ్యేలా చేయడంలో షాన్‌ రెహమాన్‌ నేపథ్య సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. కేరళ ప్రకృతి అందాలను చూపించడంలో షినోజ్‌ మంచి మార్కులు కొట్టేశారు. రెండు గంటల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని బిను నెపోలియన్‌ ఇంకాస్త ట్రిమ్‌ చేయాల్సింది. నిఖిల్‌ మురళి దర్శకత్వం ఓకే (Pranaya Vilasam review).

ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా?: నిరభ్యంతరంగా చూడొచ్చు. ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు, సంభాషణలు లేవు. ఫీల్‌గుడ్‌ మూవీ చూద్దామనుకుంటే ట్రై చేయొచ్చు.

  • బలాలు:
  • + కాన్సెప్టు
  • + ద్వితీయార్ధం
  • బలహీనతలు:
  • - అసంపూర్తి పాత్రలు
  • - ప్రథమార్ధంలో సాగదీత
  • చివరిగా: ‘ప్రణయ విలాసం’.. భావోద్వేగ ప్రయాణం
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని