Hamida Banu: పహిల్వాన్‌ను నిమిషంలో ఓడించి.. గూగుల్‌ డూడుల్‌లో ఉన్న హమీదా బాను ఎవరు?

Hamida Banu: ఈ రోజు గూగుల్‌ డూడుల్‌ చూశారా? అందులో కన్పిస్తున్న వ్యక్తి భారత మహిళా రెజ్లర్‌ హమీదా బాను. ఇంతకీ ఎవరామే? ఏంటామె ప్రత్యేకత?

Updated : 04 May 2024 10:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమీదా బాను (Hamida Banu).. భారత తొలి మహిళా ప్రొఫెషనల్‌ రెజ్లర్‌గా గుర్తింపు పొందారు. 1940ల్లో క్రీడల్లో పురుషాధిక్యం ఎక్కువగా ఉండే రోజుల్లో రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టిన మహిళ ఆమె.. ఎంతో మంది పహిల్వాన్‌లను నిమిషాల్లోనే మట్టికరిపించారు. ‘అమెజాన్‌ ఆఫ్‌ అలీగఢ్‌’గా పేరొందిన ఆమెకు నివాళిగా నేడు గూగుల్‌ (Google) ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది.

కట్టుబాట్లను దాటుకుని..

హమీదా 1900ల్లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ప్రాంతంలో జన్మించారు. 1940-50ల్లో ఒక దశాబ్దం పాటు ఆమె కెరీర్‌ సాగింది. దాదాపు 300లకు పైగా పోటీల్లో ఆమె విజయం సాధించారు. హమీదా కెరీర్‌ ఎన్నో ఒడుదొడుకులతో సాగింది. ఆ కాలంలో అథ్లెటిక్స్‌లోకి ఆడవాళ్లను ఎక్కువగా రానిచ్చేవారు కాదు. అలాంటి కట్టుబాట్లను దాటడమే గాక.. రెజ్లింగ్‌కు ఎంచుకున్నారామె..!

తనను కించపర్చేవారికి ఆటతో గట్టి సమాధానమిచ్చేవారు. అంతేనా.. రెజ్లింగ్‌లో తనను ఓడించే తొలి మగవాడిని పెళ్లి చేసుకుంటానని ఓసారి సవాల్‌ విసిరారు. ఆమె ఛాలెంజ్‌ను స్వీకరించి పాటియాలా, కోల్‌కతా నుంచి ఇద్దరు పురుష ఛాంపియన్లు ఆమెతో పోటీ పడి ఓడిపోయారు. మూడోసారి రెజ్లింగ్‌లో దిగ్గజంగా పేరొందిన బాబా పహిల్వాన్‌తో పోటీ పడి.. కేవలం 1 నిమిషం 34 సెకన్లలో అతడిని మట్టికరిపించారు. సవాల్‌ సమయంలో ఆమె పెట్టిన షరతు కారణంగా బాబా పహిల్వాన్‌ ఈ ఓటమి తర్వాత ప్రొఫెషనల్‌ రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. 1954 మే 4వ తేదీన ఈ మ్యాచ్‌ జరిగింది. ఈ విజయంతో ఆమె అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆమెకు గుర్తుగా నేడు గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది.

అంతర్జాతీయంగానూ ఆమె ఎంతోమందితో పోటీపడ్డారు. రష్యా ‘ఫీమేల్‌ బియర్‌’గా పేరొందిన ప్రముఖ మహిళా రెజ్లర్‌ వెరా కిస్టిలిన్‌ను కేవలం 2 నిమిషాల్లో ఓడించారు. అప్పట్లో కొన్నేళ్ల పాటు ఆమె పేరు వార్తాపత్రికల్లో హెడ్‌లైన్లలో వచ్చింది. దీంతో ‘అమెజాన్‌ ఆఫ్‌ అలీగఢ్‌’గా గుర్తింపు సాధించారు.

రోజుకు 5.6 లీటర్ల పాలు..

హమీదా బాను ఆహార్యం, ఆమె డైట్‌ గురించి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 108 కేజీల బరువుండే ఆమె అసాధారణ ఆహారం తీసుకునేవారని సమాచారం. రోజుకు 9 గంటల నిద్ర, ఆరు గంటల ట్రైనింగ్‌ పోగా.. మిగతా సమయమంతా భోజనానికి కేటాయించేవారు. రోజుకు 5.6 లీటర్ల పాలు, 1.8 లీటర్లు పండ్ల రసం, దాదాపు కేజీ మటన్‌, బాదం పప్పు, నాటు కోడి, అరకేజీ నెయ్యి ఇలాంటి డైట్‌ తీసుకునేవారట.

వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి. తనకు రెజ్లింగ్‌లో శిక్షణ ఇచ్చిన కోచ్‌తో ఆమె సహజీవనం చేశారు. అయితే, అతడు ఆమెను ఎంతగానో వేధించినట్లు ఆమె మనవడు (దత్తపుత్రుడి కొడుకు) ఫిరోజ్‌ షేక్‌ మీడియాకు చెప్పారు. ఆ గాయాల కారణంగా రెజ్లింగ్‌కు దూరమైన ఆమె.. చివరి రోజుల్లో చాలా కష్టాలు అనుభవించారని పేర్కొన్నారు. ఏదేమైనా.. క్రీడల్లో అడుగుపెట్టేందుకు ఎంతోమంది అమ్మాయిలకు హమీదా స్ఫూర్తిగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని