చాక్లెట్లను మనమే తయారు చేసుకోవచ్చు!

హాయ్‌ నేస్తాలూ..! తినే వాటిల్లో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టమని అడగడమే ఆలస్యం.. ఫస్ట్‌ అయితే చాక్లెట్స్‌, ఆ తర్వాత ఐస్‌క్రీం అని టక్కున జవాబిస్తాం

Published : 10 Nov 2023 00:52 IST

హాయ్‌ నేస్తాలూ..! తినే వాటిల్లో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టమని అడగడమే ఆలస్యం.. ఫస్ట్‌ అయితే చాక్లెట్స్‌, ఆ తర్వాత ఐస్‌క్రీం అని టక్కున జవాబిస్తాం. రెండ్రోజులకొక చాక్లెట్‌ అయినా తినాల్సిందే. వాటిల్లోనూ రకరకాల ఫ్లేవర్ల రుచి చూసుంటారు. అయితే, ఇప్పుడు మనం చాక్లెట్ల మ్యూజియం గురించి తెలుసుకోబోతున్నమాట.

చాక్లెట్స్‌ అనగానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నోరూరుతుంది. ఎవరైనా విదేశాల నుంచి వస్తున్నామని చెప్పినా, గ్యాడ్జెట్స్‌తోపాటు చాక్లెట్స్‌ తీసుకురమ్మంటాం. తమిళనాడు రాష్ట్రంలోని ఊటీలో చాక్లెట్‌ మ్యూజియం ఉంది. ఇక్కడ చాలా రకాల ఫ్లేవర్స్‌ దొరుకుతాయి.

చాలా ఆకారాలు..

మ్యూజియం అనేకంటే దాన్ని ఫ్యాక్టరీ అనాలేమో.. ఇక్కడ చాక్లెట్లను వాళ్లే తయారుచేసి మరీ అమ్ముతారట. ఇంకో విషయం ఏంటంటే.. ఆ తయారీ విధానాన్ని కూడా ఎంచక్కా మనం చూడొచ్చు. చెట్ల నుంచి కోకో బీన్స్‌ సేకరణ దగ్గర నుంచి చాక్లెట్‌ మన చేతిలోకి వచ్చే వరకూ ప్రతి దశనూ ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. అంతేకాదు.. ఆ ప్రక్రియకు సంబంధించిన చిత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. చాక్లెట్‌ మిశ్రమంతో బార్బీబొమ్మ, ఇతర ఆట వస్తువులు, చెట్లు, పక్షులు ఇలా రకరకాల ఆకారాలను తయారు చేసి మ్యూజియంలో ఉంచారు. ప్రత్యేకంగా వాటిని చూడటానికే పర్యాటకులు వెళ్తుంటారట.

దేశంలోనే మొదటిది..

ఈ చాక్లెట్‌ మ్యూజియం మన దేశంలోనే మొట్టమొదటిది. మరో విషయం ఏంటంటే.. దీనికి ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం దక్కింది. ఇక్కడి చాక్లెట్‌ తయారీ కిట్లతో మనమే సొంతంగా నచ్చిన ఫ్లేవర్లతో చాక్లెట్లను తయారు చేసుకోవచ్చట. ‘మరి మనకు తెలియదు కదా?’ అనే సందేహం అక్కర్లేదు.. ఎందుకంటే.. వాటిని ఎలా చేయాలో నేర్పించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారట. ఇక్కడి నుంచి రకరకాల చాక్లెట్‌ సిరప్‌లతోపాటు కోకో బీన్స్‌ కూడా కొనుగోలు చేసి తీసుకెళ్లొచ్చు. ఇక్కడికొచ్చే పర్యాటకులందరికీ చాక్లెట్లను బహుమతిగా అందిస్తారట. నేస్తాలూ.. ఈ చాక్లెట్‌ మ్యూజియం విశేషాలు భలే ఉన్నాయి కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని