logo

జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చేరిన రోగులకు తిప్పలు తప్పడం లేదు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన సొమ్ము గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Updated : 03 May 2024 07:58 IST

బిల్లులు చెల్లించని సర్కారు
సేవలు చేయలేమంటున్న నిర్వాహకులు
కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే 

మాటలు గొప్ప

‘‘ ఆరోగ్యశ్రీ పథకంలో 3,280కుపైగా చికిత్సలు చేర్చాం.. వ్యయ పరిమితి రూ.25 లక్షలకు పెంచాం.. పేదలకు ఉచితంగా వైద్యం అందుతుంది.. వారు తమ చేతిల్లోంచి పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్లేందుకు ఛార్జీలూ ప్రభుత్వమే చెల్లిస్తుందని’’ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గొప్పచెబుతున్నారు.


బకాయిల దెబ్బ

నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. నెలల తరబడి పెండింగులో పెట్టడంతో  నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. చివరికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడమే మానేశారు. ప్రభుత్వానికి పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తే తూతూమంత్రంగా చెల్లిస్తోంది.. ప్రభుత్వ తీరుతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు.

లేఖ కలకలం

మే 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ప్రభుత్వానికి గురువారం లేఖ రాశాయి. గత ఆరు నెలలుగా బకాయిల కోసం విన్నవిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.


పెండింగ్‌లో రూ.150 కోట్లు

మ్మడి కర్నూలు జిల్లాలోని పలు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చేరిన రోగులకు తిప్పలు తప్పడం లేదు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన సొమ్ము గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో ఆసుపత్రులకు రెండు, మూడు నెలలకు బిల్లులు వచ్చేవి. గతేడాదికాలంగా ఆరు నెలలైనా బిల్లులు చెల్లించడం లేదు. చివరికి ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తామని గతేడాది నవంబరు, ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం స్పందించి పెండింగ్‌ బకాయిల్లో 30 నుంచి 40 శాతం నిధులిచ్చి సరిపెట్టింది. ఉమ్మడి జిల్లాలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఇంకా రూ.150 కోట్ల వరకు రావాల్సి ఉంది.


నిబంధనలు ఏం చెబుతున్నాయి

రోగ్యశ్రీ పథకం కింద రోగి జబ్బు నిర్ధారించిన తర్వాత కేసును పరిశీలించి పరిశీలించి ఆరోగ్యమిత్రల ద్వారా వివరాలను ట్రస్టుకు పంపుతారు. ఆరోగ్యశ్రీ కింద ఆమోదం లభిస్తే రోగికి వైద్య చికిత్సతోపాటు అవసరమైతే శస్త్రచికిత్స చేస్తారు. ఒకటి, రెండు నెలల్లో సదరు ఆస్పత్రికి ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. రోగి ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు వైద్య పరీక్షలు, మందులు, మెనూ ఇవ్వాల్సి ఉంటుంది. డిశ్ఛార్జి అయ్యే సమయంలో మందులతోపాటు ఛార్జీలకు డబ్బులు ఇవ్వాలి. ఆసరా పథకం కింద రోగి కేసును బట్టి ప్రభుత్వం అతని ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. ఏదేని కేసుకు సంబంధించి ఆన్‌లైన్‌లో వివరాలు సక్రమంగా నమోదు చేయకపోతే నిధుల్లో కోత పెడుతోంది. ఆరోగ్యశ్రీ కింద చేరినవారు సక్రమంగా సేవలు అందలేదని, అదనపు ఫీజు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేసినా సదరు ఆసుపత్రులపై చర్యలు తీసుకుని జరిమానా విధించాల్సి ఉంటుంది.


సేవలు అందించలేని దుస్థితి

రోగ్యశ్రీ కింద ఉమ్మడి జిల్లాలో 70 నెట్‌వర్క్‌ ఆసుపత్రులుండగా అందులో కర్నూలులో 48, నంద్యాలలో 22 ఉన్నాయి. కర్నూలు నగరంలో 4, నంద్యాలలో 2 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులు చేస్తారు. కొందరు వైద్యులు సమూహంగా ఏర్పడి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. నెలలు గడుస్తున్నా ఆరోగ్యశ్రీ బిల్లులు రాకపోవడంతో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. బ్యాంకులకు రుణాలు చెల్లించడం, సిబ్బంది, వైద్యుల వేతనాలతోపాటు ఆసుపత్రుల నిర్వహణకు పెద్దఎత్తున నగదు అవసరమవుతుంది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో చివరికి ఆరోగ్యశ్రీ కేసులు తీసుకునేందుకు సుముఖత చూపడం లేదు. ఫీజులో రాయితీ ఇస్తామని.. ఆరోగ్యశ్రీ కింద చేర్చుకోమని వారు స్పష్టం చేస్తుండటంతో పేదల పరిస్థితి దయనీయంగా మారుతోంది.


రోగుల తిప్పలు

  • బనగానపల్లికి చెందిన ఇక్బాల్‌ ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం పైనుంచి పడి తలకు గాయమవడంతో ఓ నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో గత నెల 15న చేరారు. ఈ కేసు ఆరోగ్యశ్రీ కిందకు రాదని నిర్వాహకులు చెప్పారు. డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో వైద్యం అందించారు. మూడు రోజులకుగాను ఆసుపత్రి బిల్లు రూ.46 వేలు, మందులకు రూ.14 వేలు కలిపి రూ.60 వేలు ఖర్చైంది.
  • నవజాత శిశువు కండిషన్‌ బాగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఓ నెట్‌వర్క్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మొదట్లో ఆరోగ్యశ్రీ వర్తించదని నిర్వాహకులు స్పష్టం చేశారు. నాలుగు రోజులు వైద్యం అందించి రూ.2 లక్షల వరకు బిల్లు వేశారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కింద చేర్చుకున్నారు.
  • నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన సొమ్ము ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదు. ఫలితంగా ఆసుపత్రుల నిర్వాహకులు ఆరోగ్యశ్రీ కేసులను తిరస్కరిస్తుండటంతో పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది.

వైద్య పరీక్షల పేరిట దోపిడీ  

కొన్ని ఆసుపత్రుల నిర్వాహకులు పరీక్షల పేరిట సుమారు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ కేసు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చిన వెంటనే వసూలు చేసిన డబ్బులను రోగికి తిరిగి ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు. న్యూరోసర్జరీ, కార్డీయాలజీ సర్జరీ, కొన్ని శస్త్రచికిత్సలు, స్టంట్లకు రూ.50 వేలు అదనంగా వసూలు చేస్తుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని