logo

అయ్యో పాపం ఆరుషి

నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి(18 నెలల).

Published : 03 May 2024 07:49 IST

హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి

మునుగోడు, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి(18 నెలల). వీరిది రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. బతుకుదెరువు కోసం ఇటీవల హైదరాబాద్‌కు వలస వెళ్లారు. ప్రస్తుతం రవి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. జీతం కుటుంబ పోషణకే సరిపోతుంది. నెల క్రితం ఆ చిన్నారి పగలు, రాత్రి తేడా లేకుండా ఏడుస్తుంటే అర్థం కాక ఆసుపత్రికి తీసుకెళ్లి మందులు తీసుకున్నారు. అయినా ఆ పాపలో ఏ మాత్రం మార్పు రాలేదు. స్కానింగ్‌ తీయిస్తే వెన్నుపూసలో 8.4 సెంటిమీటర్ల గడ్డ ఉందనే విషయం తేలింది. వెంటనే శస్త్రచికిత్స చేయించకుంటే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలపడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొద్ది రోజుల పాటు తమ బాధను దిగమింగుకున్నారు. తప్పని పరిస్థితిలో గత శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

ఇప్పటి వరకు రూ.2లక్షల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి అత్యవసర  వార్డులో చికిత్స పొందుతుంది. చికిత్స అత్యవసరం కావడంతో తెలిసిన వారి వద్ద రూ.2.50 లక్షలు అప్పు తెచ్చి చెల్లించి శస్త్ర చికిత్స చేసి గడ్డను తొలగించారు. పది రోజులు పాటు ఆసుపత్రిలోనే ఉంచాలని వైద్యులు సూచించారు. అప్పటిదాక ఉండాలంటే వైద్యానికి అయ్యే ఇతర ఖర్చులు పెట్టే స్థితిలో లేక ఆ తల్లిదండ్రులు కుమిలి పోతున్నారు. ఇప్పటికే వైద్యం కోసం బయట చాలా అప్పులు చేశానని, ఇంకా అప్పు చేసే దారిలేదని ఆవేదనకు గురవుతున్నారు. దాతలు ముందుకొచ్చి తమకు తోచినంత సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. సాయం చేయాలనుకునే దాతలు చరవాణి నంబరు 96764 88878ను సంప్రదించగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని