అద్దె రాబడులు ఎలా ఉన్నాయి?

హైదరాబాద్‌ మార్కెట్‌లోని స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడితే ఎక్కువమంది మంచి రాబడులనే అందుకుంటున్నారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో కొనుగోలు చేస్తే ఆశించిన దానికంటే ఎక్కువే గిట్టుబాటు అవుతుంది.

Updated : 11 May 2024 06:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్‌లోని స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడితే ఎక్కువమంది మంచి రాబడులనే అందుకుంటున్నారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో కొనుగోలు చేస్తే ఆశించిన దానికంటే ఎక్కువే గిట్టుబాటు అవుతుంది. మరి అద్దె రాబడులు ఎలా ఉన్నాయి? ఇటీవల మార్పులు వచ్చాయా? ఇతర నగరాలతో పోలిస్తే వార్షిక అద్దె రాబడిలో మనం ఎక్కడ ఉన్నాం? స్థిరాస్తులు కొనుగోలు చేసేవారిలో అద్దెలు ఎలా ఉన్నాయనేది ఎక్కువమంది బేరీజు వేస్తుంటారు. పెట్టిన పెట్టుబడికి, వస్తున్న అద్దెలు..భవిష్యత్తులో స్థిరాస్తులకు పెరిగే విలువ ఆధారంగా కొనాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటారు. అద్దె రాబడులను సిటీల వారీగా గత త్రైమాసికంలో అనరాక్‌ సంస్థ అధ్యయనం చేసింది. బెంగళూరు 4.45 శాతంతో మొదటి స్థానంలో నిల్చింది. కొవిడ్‌ సమయంలో 3.6 శాతంగా ఉండేది. ముంబయి 4.15 శాతంతో రెండోస్థానంలో ఉంది. ఆతర్వాత గుర్గావ్‌ ఉంది. 11 నగరాల్లో చూస్తే హైదరాబాద్‌ 3.2శాతంతో 9వ స్థానంలో నిల్చింది. 3నెలలంటే స్వల్పకాలమని.. దీర్ఘకాలానికి పరిగణనలోకి తీసుకోవాలని స్థానిక బిల్డర్లు అంటున్నారు.

5 శాతం పెరిగాయ్‌.. ఏటా అద్దెల్లో పెరుగుదల 3 నుంచి 8 శాతం ఉంది. మైక్రో మార్కెట్లను బట్టి ఇందులో హెచ్చుతగ్గులు ఉన్నాయి. హైటెక్‌ సిటీలో రెండు పడకల ఫ్లాట్‌ 2022లో రూ.24,600గా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 2023లో రూ.31వేలకి పెరిగిందని ఇప్పుడు అదే ప్రాంతంలో రూ.32,500 వేలు చెబుతున్నారని నివేదిక పేర్కొంది. గచ్చిబౌలిలోనూ ఇంచుమించు ఇదేలా అద్దెలు ఉన్నాయి.

  • బెంగళూరులో మనకంటే ఎక్కువగానే ఉన్నాయి. రెండు పడకగదుల ఫ్లాట్‌కి రూ.32,500 నుంచి రూ.34వేల వరకు ఉంటుంది. అద్దెల రాబడి 8 శాతంగా ఉంది.
  • పుణె, కోల్‌కతా, చెన్నైలో మనకంటే  తక్కువగా ఉన్నాయి.ఇక్కడ రూ.16,500-రూ.26,500 వరకు ఉన్నాయి. అద్దెల వార్షికరాబడి 3 నుంచి 4 శాతం మధ్యలో ఉంది.
  • రాజధాని దిల్లీలో నెలవారీ ఇంటి అద్దెలు రూ.25 వేల నుంచి 41,500 వరకు ఉన్నాయి. అద్దెల వార్షిక రాబడి 4-9 శాతం వరకు ఉంది.
  • ముంబయిలోని చెంబూరు,ములాంద్‌ ప్రాంతాల్లో రూ.46,500 నుంచి రూ.60వేల వరకు ఉన్నాయి. అద్దె రాబడి 4 నుంచి 6 శాతం వరకు ఉంది.

పెట్టుబడి... అద్దెలు ఎక్కువే

సిటీలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఐటీ కారిడార్‌లో అద్దెలు అధికం. పని ప్రదేశానికి దగ్గరలో ఉండేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపడంతో ఐటీ కంపెనీలకు చుట్టుపక్కల నివాస ప్రదేశాల్లో ఇళ్లకు డిమాండ్‌ ఉంటోంది. సహజంగానే ఇల్లు కొనుగోలు చేయాలన్నా అదేస్థాయిలో పెట్టుబడి పెట్టాలి. దీనికి తగ్గట్టుగానే అద్దె రాబడులు ఉంటాయి. మనదగ్గర కొత్తఇళ్ల ధరలు భారీగా పెరగడంతో అద్దె రాబడికి పొంతన కుదరడంలేదని నగరవాసి ఒకరు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని