Heavy Rains: వానల నుంచి పాత ఇంటికి రక్షణ

వర్షాలు కురుస్తుండటంతో కాలానుగుణంగా ఇంట్లో వచ్చే సమస్యలు చిన్నవే అయినా చికాకు కలిగిస్తుంటాయి. ఇళ్లు కారడం, ఇంటి గోడలకు చెమ్మరావటం, అక్కడక్కడ పాచి పేరుకుపోయి పాత ఇళ్లలో ఉన్నవారు ఇబ్బందిపడుతుంటారు

Updated : 08 Jun 2024 03:03 IST

చిన్నపాటి జాగ్రత్తలతో ఈ కాలాన్ని వెళ్లదీయొచ్చు

వర్షాలు కురుస్తుండటంతో కాలానుగుణంగా ఇంట్లో వచ్చే సమస్యలు చిన్నవే అయినా చికాకు కలిగిస్తుంటాయి. ఇళ్లు కారడం, ఇంటి గోడలకు చెమ్మరావటం, అక్కడక్కడ పాచి పేరుకుపోయి పాత ఇళ్లలో ఉన్నవారు ఇబ్బందిపడుతుంటారు. ఉపేక్షిస్తే ఇంటి నాణ్యత దెబ్బతింటుంది. జీవితకాలం పడిపోతుంది. చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. 

మాదాపూర్, న్యూస్‌టుడే

శుభ్రం చేసుకోవాలి 

 •  ఇంటి డాబాపై చెత్త చేరనియ్యద్దు.
 • స్లాబ్‌ నుంచి లీకేజీలు గమనిస్తే వాటర్‌ప్రూఫ్‌ కోటింగ్‌ చేయించుకోవాలి. లీకేజీలను బట్టి వేర్వేరు టెక్నిక్‌లను ఉపయోగించి అరికట్టే విధానాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. 
 • గోడల్లోకి నీటి చెమ్మ వెళ్లకుండా ఉండేందుకు మార్కెట్‌లో పాలిమర్‌ పెయింట్స్‌ అందుబాటులో ఉంటాయి. ఆ రంగులు వేసుకోవడం వల్ల నీరు గోడలోకి ఇంకే అవకాశం ఉండదు.
 • ఇంటిపైకప్పు మీద పాచి ఇతర ఫంగస్‌ రాకుండా ఉండేందుకు మార్కెట్‌లో కెమికల్‌ రంగులు దొరుకుతాయి. వీటిని వాడొచ్చు.
 • డాబాపై నీరు నిలవకుండా వర్షపునీరు కిందకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన పైపులను తొలకరికి ముందు శుభ్రం చేయాలి
 • ట్యాంకులు, సంపుల్లో నీటిని శుభ్రం చేసుకునేందుకు బ్లీచింగ్‌ పౌడర్‌ వేసుకోవాలి. మార్కెట్‌లో క్లోరిన్‌ బిళ్లలు లభిస్తాయి. 0.5 గ్రాముల బిళ్ల 20 లీటర్ల నీటిని శుద్ధి చేస్తుంది.

బోరు బావి రీఛార్జి చేసుకోవాలి 

ఇంట్లో ఉన్న బోరుబావి చుట్టూ 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు గల గుంతను ఏర్పాటు చేసుకోవాలి. దాని అడుగు భాగం నుంచి ఒక అర అడుగు వదిలేసి కేసింగ్‌ పైపునకు 4 నుంచి 5 అడుగుల వరకు రంధ్రాలు చేసుకోవాలి. వాటి మధ్య 2 నుంచి 3 అంగుళాల ఖాళీ ఉండేటట్లు 6 మిల్లీమీటర్ల పరిమాణంతో 300 నుంచి 400 రంధ్రాలు చేసుకోవాలి. వీటిల్లో మట్టి, చెత్త చేరకుండా నైలాన్‌ జాలీ కేసింగ్‌ పైపు చుట్టూ గట్టిగా చుట్టాలి. తరువాత గుంతను పెద్దసైజు కంకర్ల రాళ్లతో నింపాలి. కంకర రాళ్లపై నైలాన్‌మెష్‌ పరుచుకోవాలి. ఆ మెష్‌పై అడుగు మేర ఇసుకతో నింపాలి. ఇలా చేయడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకి బోరుబావి రీఛార్జ్‌ అవుతుంది.

ఇంటిపైకప్పు మీద పడిన వర్షపు నీరు వృధాగా డ్రైనేజీలోకి వదిలేయకుండా భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి ఆవరణలో మనకు అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో ఇంకుడు గుంతను తవ్వాలి. పైకప్పు మీద పడిన నీరు అందులోకి వెళ్లేలా చేయాలి. గుంతలో చేరిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలి.

విద్యుత్తు ప్రమాదాల నివారణ

 • వర్షాకాలంలో విద్యుదాఘాతాలు పొంచి ఉంటాయి. అప్రమత్తంగా ఉండాలి. 
 • వైరింగ్‌ జాయింట్లు లేకుండా చూసుకోవాలి. దీని వల్ల తడిసిన గోడల నుంచి విద్యుత్తు సరఫరాను నివారించవచ్చు.
 • విద్యుత్తు సరఫరా హెచ్చుతగ్గులను నివారించే ఆర్‌సీసీబీ పనిచేస్తుందో లేదో సరిచూసుకోవాలి.
 • ఇంట్లో ఎర్తింగ్‌ సరఫరాను సరిచూసుకొని, ఎర్తింగ్‌ సక్రమంగా ఉండేందుకు పదికేజీల ఉప్పును బకెట్‌ నీళ్లలో కలిపి ఎర్తింగ్‌ గుంతలో పోయాలి.
 • పిడుగు ధాటికి విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇంటి పైకప్పు మీద లైటెనింగ్‌ అరెస్టర్‌ పరికరం అమర్చుకోవచ్చు. దీని ధర మార్కెట్‌లో రూ. 800 నుంచి 1500 వరకు ఉంటుంది. ఈ పరికరం పిడుగు ధాటికి వచ్చే కాంతి, విద్యుత్‌ శక్తి ఇంటి మీద పడకుండా నివారిస్తుంది. గత ఏడాది వానాకాలంలో పలు ఇళ్లపై పిడుగులు పడి ఇళ్లలో గృహోపకరణాలు కాలిపోయిన ఘటనలు జరిగాయి.  
 • స్విచ్‌ల మీద నీళ్లు పడకుండా చూసుకోవాలి, తడి చేతులతో స్విచ్‌లను వేయరాదు. విద్యుత్తు మరమ్మతులు చేసే సమయంలో కాళ్ల కింద రబ్బర్‌ మ్యాట్‌ ఉండేలా చూసుకోవాలి.
 • సంపుల్లో నీరు లాగేందుకు ఉపయోగించే మోటార్లపై కప్పు ఉంచాలి. వాటిని ఆన్‌ ఆఫ్‌ చేసే సమయంలో కాళ్లకు రబ్బర్‌ చెప్పులు వేసుకోవడం మరిచిపోరాదు.

  మొక్కలకు అనువైన కాలం 

వర్షాకాలంలో మొక్కలు పెంచేందుకు అనువైన వాతావరణం ఉంటుంది. ఇంటి పైకప్పుతోపాటు ఇంట్లో కూడా మొక్కలను పెంచుకోవచ్చు. పైకప్పు మీద కుండీల్లో ఫైకస్‌బ్లాక్, ఫైకస్‌పాండ, స్టార్‌లైట్, ఆరేకఫామ్స్‌ వంటి చిన్నసైజు మొక్కలతోపాటు అందం, అలంకరణ కోసం గులాబీ, మందారం వంటి పూల మొక్కలు పెంచుకోవచ్చు. కిచెన్‌ గార్డెన్‌ కోసం ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇంటి లోపల ఇండోర్‌ ప్లాంట్స్, మల్టీకలర్‌ మొక్కలు మరింత శోభనిస్తాయి. లెమన్‌గ్రాస్‌ ఇంట్లో దోమల నివారణకు దోహదం చేస్తుంది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని