రియాల్టీలోకి సంస్థాగత పెట్టుబడుల వెల్లువ

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లోకి సంస్థాగత పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ ఏడాది క్రితంతో పోలిస్తే భారీగా పెట్టుబడులు వచ్చాయి.

Published : 15 Jul 2023 00:25 IST

ఈనాడు, హైదరాబాద్‌ : రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లోకి సంస్థాగత పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ ఏడాది క్రితంతో పోలిస్తే భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఏకంగా 43 శాతం పెట్టుబడులు పెరిగినట్లు కొలియర్స్‌ ఇండియా శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2023 తొలి భాగంలో 3.7 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి.

  • దేశ రాజధాని ప్రాంతం దిల్లీ రియాల్టీకి జనవరి నుంచి జూన్‌ వరకు 1.07 బిలియన్‌ అమెరికా డాలర్లు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 58 శాతం అధికం.
  • బెంగళూరు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లోకి కొన్ని రెట్లు అధికంగా పెట్టుబడులు వచ్చాయి. 24.3 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల నుంచి ఏకంగా 196.6 మిలియన్‌ యూఎస్‌ డాలర్లకు పెరిగాయి.
  • హైదరాబాద్‌ 127.3 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల పెట్టుబడుల్ని తొలి ఆరునెలల్లో ఆకర్షించింది. గత ఏడాది సంస్థాగత పెట్టుబడులే రాలేదు.

ఇక్కడ తగ్గాయ్‌..

  • చెన్నైలో 69 శాతం సంస్థాగత పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఏడాది క్రితం 274.6 మిలియన్‌ యూఎస్‌డీ ఉండగా.. ఈసారి 85.4 మిలియన్‌ యూఎస్‌డీకి పడిపోయాయి.
  • ఆర్థిక రాజధాని ముంబయిది ఇదే పరిస్థితి. ఇక్కడ సంస్థాగత పెట్టుబడులు 17 శాతం తగ్గాయి. 469.7 మిలియన్ల నుంచి 389.1 మిలియన్‌ యూఎస్‌ డాలర్లకు తగ్గాయి. అయినా దిల్లీ తర్వాత అత్యధిక పెట్టుబడులు ఈ నగరానికి వచ్చాయి.

కార్యాలయాల్లోకి..

  • సంస్థాగత పెట్టుబడులు 74 శాతం వరకు కార్యాలయాల నిర్మాణాలపైనే పెట్టారు. దిల్లీలో అత్యధికంగా 29 శాతం, ముంబయిలో 11 శాతం, బెంగళూరులో 5 శాతం, హైదరాబాద్‌లో 4 శాతం ఆఫీస్‌ స్పేస్‌లో పెట్టారు. చెన్నైలో పరిశ్రమలు, గోడౌన్లలో వెచ్చించారు.
  • గృహ నిర్మాణం చేపట్టిన దేశీయ సంస్థల్లో సంస్థాగత మదుపరులు 12 శాతం పెట్టుబడులు పెట్టారు. ఏకంగా 5 రెట్లు పెరిగాయి.

అతిపెద్ద ఒప్పందాలు.. 

  • బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్వెస్టర్‌ దిల్లీలోని కార్యాలయ నిర్మాణాలకు భారతీ ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడి పెట్టింది.
  • సీపీపీఐబీ ఇన్వెస్టర్‌ ముంబయిలో ఆర్‌ఎంజెడ్‌ గ్రూప్‌లో, జీఐసీ ఇన్వెస్టర్‌ హైదరాబాద్‌లో ఫొనిక్స్‌లో పెట్టుబడులు పెట్టాయి.

రాబడి పరంగా చూస్తే..

  • సంస్థాగత మదుపరులు తమ పెట్టుబడులకు అత్యధిక రాబడిని గ్రేటర్‌ ‘ఏ’ కార్యాలయాల నుంచి పొందుతున్నారు. వీటిలో 8 నుంచి 9 శాతం రాబడి అందుకున్నారు.
  • రిటైల్‌లోనూ అద్దెల రూపంలో మంచి రాబడే అందుకున్నారు. ఇక్కడ 8 నుంచి 10 శాతం వరకు రాబడి గ్యారంటీ అంటున్నారు.
  • గ్రేడ్‌ ‘ఏ’ గోడౌన్లు కూడా మంచి రాబడులను అందిస్తున్నాయి. పూర్తి లీజు కుదిరితే 7 నుంచి 8.5 శాతం రాబడి మదుపరులకు దక్కుతోంది. గ్లోబల్‌ ఇన్వెస్టర్లు 71 శాతం వీటిలో వెచ్చిస్తున్నారు.
  • కొత్తగా వస్తున్న కోలివింగ్‌, స్టూడెంట్‌ హౌసింగ్‌లోనూ సంస్థాగత పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. వీటిలోనూ 6 నుంచి 7 శాతం వరకు రాబడి చవిచూస్తున్నారు.
  • అతి తక్కువ రాబడి గృహ నిర్మాణంలోనే పొందుతున్నారు. ఇక్కడ 2 నుంచి 2.5 శాతానికి మించి రావడం లేదు. దీంతో వీటిలో అతి తక్కువ పెట్టుబడులు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని