Mokila: మోకిల.. గజం ఎంతంటే?

అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో మరో భారీ లేఅవుట్‌ను హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) సిద్ధం చేసింది.

Updated : 23 Jul 2023 10:44 IST

165.37 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ భారీ లేఅవుట్‌
అమ్మకానికి 1,321 ప్లాట్లు సిద్ధం
 తొలిదశలో 50 ప్లాట్లు విక్రయాలకు వేలం

ఈనాడు, హైదరాబాద్‌: అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో మరో భారీ లేఅవుట్‌ను హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) సిద్ధం చేసింది. మొత్తం 165.37 ఎకరాల్లో 1,321 ప్లాట్లను విక్రయించనుంది. ఇందులో తొలిదశలో 50 ప్లాట్లను ఈవేలం వేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహించిన ప్రీబిడ్‌ సమావేశానికి కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. వెస్ట్‌ సిటీ హబ్‌గా మోకిల రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తు అంతా అవుటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ కేంద్రీకృతం కావడం...నగర ట్రాఫిక్‌ రణగొణ ధ్వనుల నుంచి నగరానికి కాస్త దూరంగా నివాసాలు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఈ ప్రాంతంలో స్థలాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా మోకిల ప్రాంతంలో హెచ్‌ఎండీఏ ఈ లేఅవుట్‌కు శ్రీకారం చుట్టింది.

వివాదాలకు తావు లేకుండా

ప్రస్తుతం ఎక్కడైనా వంద గజాల స్థలం కొనాలంటే సవాలక్ష అనుమానాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా యాజమాన్య హక్కులే కీలకం. తీరా స్థలం కొన్న తర్వాత..దానిపై వివాదాలను లేవనెత్తడం పరిపాటిగా మారింది. ఒకే స్థలం ఇద్దరి ముగ్గురి పేరుతో రిజిస్ట్రేషన్లు చేసిన ఉదంతాలు కోకొల్లలు. దీంతో స్థలం కొన్న సంతోషం ఆవిరై.. కోర్టుల చుట్టూ తిరగకలేక చివరికి ప్లాట్లను సైతం వదులుకున్న వారు ఎందరో. దీనికి భిన్నంగా వివాదాలకు తావులేకుండా హెచ్‌ఎండీఏ మోకిల లేఅవుట్‌ను సిద్ధం చేసింది. ప్రభుత్వ సంస్థ కావడంతో చాలామంది హెచ్‌ఎండీఏ వద్ద స్థలాలను కొనటానికి ఆసక్తి చూపుతుంటారు. మరోవైపు లేఅవుట్లలో ప్లాట్లు కొనడం ఒక ఎత్తు అయితే..అందులో మౌలిక వసతుల కల్పన చాలా కీలకం. చాలా ప్రైవేటు లేఅవుట్లలో ప్లాట్లు అమ్ముకొని తీరా మౌలిక వసతుల కల్పన సమయంలో యజమానులు ముఖం చాటేస్తుంటారు. హెచ్‌ఎండీఏ వద్ద తనఖా ప్లాట్లు ఉన్నప్పటికీ పెద్దగా లెక్క చేయడం లేదు. దీంతో కొన్నవారు తీరా అక్కడ సౌకర్యాలు లేక లబోదిబోమంటున్నారు. తీరా అమ్ముకుందామన్నా కొనేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఎంతోకొంతకు ఇచ్చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఇలాంటి మోసాలకు తావులేకుండా హెచ్‌ఎండీఏనే స్వయంగా మౌలిక వసతులన్నీ కల్పిస్తోంది. ప్రస్తుతం మోకిల హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ పక్కన 100 అడుగుల శంకర్‌పల్లి రహదారి ఉంది. లేఅవుట్‌లో అంతర్గత రహదారులు..భూగర్భ డ్రైనేజీతోపాటు తాగునీరు, విద్యుత్తు తదితర సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ లేఅవుట్‌ నుంచి కేవలం 20 నిమిషాల్లోనే కోకాపేట్‌ నియోపోలీస్‌, ఆర్థిక జిల్లా, గండిపేట పార్కు, సీబీఐటీ, ఓషియన్‌ పార్కులకు చేరుకునే అవకాశం ఉంది. అటు ఎయిర్‌పోర్టుకు ఇటు నగరానికి చేరుకోవాలన్నా అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు దగ్గరలోనే ఉండటంతో కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన రానుందని అధికారులు భావిస్తున్నారు.

కనీసం ధర రూ.25 వేలు

ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరాకు ధర భారీ స్థాయిలో పలుకుతోంది. ఈ నేపథ్యంలో మోకిల లేఅవుట్‌లో కనీస ధర చదరపు గజానికి రూ.25 వేలుగా హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఆపైనే ఈ-వేలంలో అధిక ధర కోట్‌ చేసిన వారు ప్లాట్లను దక్కించుకోవచ్చు. కనీస వేలం పాట ధర చదరపు గజానికి రూ.500 పెంచాల్సి ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండేలా ప్లాట్ల పరిమాణం 300 గజాలు ఆపైనే ఉన్నాయి. ఈ వేలంలో ప్లాట్లు దక్కించుకున్న వారికి అర్హతను బట్టి బ్యాంకు నుంచి రుణాలు పొందే వీలుందని అధికారులు తెలిపారు. తొలి విడతలో ప్లాట్ల విక్రయాలకు అనూహ్య స్పందన వస్తుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 50 ప్లాట్ల విక్రయాల తర్వాత మళ్లీ మరో విడతలోనూ అమ్మకాలు చేపట్టనున్నారు. ఇందులో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు నిర్మించుకునే అవకాశం ఉంది. మొత్తం లేఅవుట్‌లో పచ్చదనం, పార్కులు, ఇతర ప్రజా అవసరాలకు స్థలాలు కేటాయించారు. శుక్రవారం జరిగిన ప్రీబిడ్‌ సమావేశంలో పాల్గొన్న పలువురు కొనుగోలుదారులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎంఎస్‌టీసీ ప్రతినిధులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరాలు వెల్లడించారు. మోకిల వెంచర్‌ ప్రాధాన్యత, హెచ్‌ఎండీఏ కల్పిస్తున్న మౌలిక వసతుల గురించి ఎస్టేట్‌ అధికారి బి.కిషన్‌రావు కొనుగోలుదారులకు వివరించారు. ఎస్‌ఈలు అప్పారావు, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు