ఆమె పేరిటే ఆస్తులు

ఒకప్పుడు స్థిరాస్తి అంటే పురుషుల పేరు మీదే ఉండేది. ఎక్కడో అరాకొరా ఆస్తులు మహిళల పేరిట రిజిస్ట్రేషన్‌ అయ్యేవి. ఇప్పుడు పరిస్థితి మారుతూ వస్తోంది. గతంలో మహిళల పేరిట స్థిరాస్తులు ఉండాలనే ఆలోచనతో ఒక శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తగ్గించి ప్రోత్సహిస్తే..

Updated : 04 Nov 2023 10:56 IST

మహిళల పేరిట పెరుగుతున్న స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు

ఒకప్పుడు స్థిరాస్తి అంటే పురుషుల పేరు మీదే ఉండేది. ఎక్కడో అరాకొరా ఆస్తులు మహిళల పేరిట రిజిస్ట్రేషన్‌ అయ్యేవి. ఇప్పుడు పరిస్థితి మారుతూ వస్తోంది. గతంలో మహిళల పేరిట స్థిరాస్తులు ఉండాలనే ఆలోచనతో ఒక శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తగ్గించి ప్రోత్సహిస్తే.. ఇప్పుడా అవసరం లేకుండానే మహిళలు సొంత ఆస్తుల హక్కుదారులు అవుతున్నారు. ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగంగా ఉన్న మహిళలు ఆస్తులు సంపాదించడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 

రుణ మంజూరులో ప్రాధాన్యం

మహిళలు ఐటీతో పాటు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. రూ.లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇదే ఇప్పుడు వారిని సొంతింటిదారులను చేస్తోంది. బ్యాంకులు వారి పేరిట రుణాలు మంజూరు చేసేందుకు ముందుకొస్తున్నాయి. 0.5 శాతం తక్కువ వడ్డీకి కొన్ని బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇలా పలు అవకాశాలుండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంతో పాటు పరిసర జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో స్థిరాస్తులు వారి పేరిట రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ స్థిత ప్రజ్ఞ చెప్పారు. గతంలో ఇది నాలుగైదు శాతంగా ఉండగా ఇప్పుడు 40 శాతం దాకా పెరిగాయని చెబుతున్నారు. ఒక్కో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 50 వరకూ జరుగుతుంటే.. 20 వరకు మహిళలపేరిటే అవుతున్నాయన్నారు.

ఇంటి ఎంపికలో మహిళల నిర్ణయమే కీలకం : ఇంటి కొనుగోలులో తుది నిర్ణయం అమెదే. సొంత ఇంటిని అలంకరించుకోవడంతోనే కాదు. కిచెన్‌ ఎలా ఉండాలి.. పూజ గది ఎక్కడ రావాలి? బాల్కనీ సౌకర్యంగా ఉందా.. అతిథుల గది పక్కాగా ఉండేలా దగ్గరుండి జాగ్రత్తగా డిజైన్‌ చేయించుకుంటున్నారు. వంటింటిలో అన్ని సౌకర్యాలుండేలా జాగ్రత్త పడుతున్నారు. ఫ్రిజ్‌, కూరగాయలు తరిగే వరకూ సరైన ప్లాట్‌ఫామ్స్‌ ఉండేలా చూస్తున్నారు. పూజ గది నుంచి పూల మొక్కల వరకూ మహిళలు ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి కొంటున్నారు. వారికి అనువుగా ఉండేలా ఇంటిని నిర్మించుకుంటున్నారు.


మారిన నిర్మాణ సంస్థల దృక్పథం

ఇంటి కొనుగోలులో మహిళల ప్రాధాన్యం పెరగడంతో నిర్మాణదారులు అప్రమత్తం అయ్యారు. కేవలం ఇంజినీరింగ్‌ కోణంలోనే ఇల్లు కట్టకుండా.. ఇల్లాలి దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ మేరకు డిజైనింగ్‌ దశ నుంచే చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో ఐటీ ఉద్యోగులు, వేర్వేరు వృత్తుల్లో ఉన్న మహిళలు పెళ్లికి ముందే స్థిరాస్తులపై పెట్టుబడులు పెడుతున్నారు. ప్రవాస భారతీయ మహిళలు పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు జరుపుతున్నారు. పూర్తిగా వారి పేరు మీద ఇళ్లు, స్థలం కొంటున్నారు. కొందరు జాయింట్‌ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. మహిళల పేరున స్థిరాస్తుల నమోదు జాతీయ సగటు 43.3 శాతంగా ఉంది. 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారి పేరున స్థిరాస్తులు రిజిస్టర్‌ అవుతున్నాయి.

ఈనాడు - హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని