హెచ్‌ఎండీఏ భూసమీకరణ షురూ

హెచ్‌ఎండీఏ భూ సమీకరణ (ల్యాండ్‌పూలింగ్‌) ప్రాజెక్టుకు సంబంధించి రైతులు, పట్టాదారులు, వ్యక్తిగత భూముల యజమానులు స్వచ్ఛందంగా పాల్గొనేలా తాజాగా ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Published : 16 Mar 2024 04:39 IST

ఆసక్తి వ్యక్తీకరణకు నోటిఫికేషన్‌ జారీ
60-40 విధానంలో అభివృద్ధికి ప్రణాళిక
రైతులు, పట్టాదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ భూ సమీకరణ (ల్యాండ్‌పూలింగ్‌) ప్రాజెక్టుకు సంబంధించి రైతులు, పట్టాదారులు, వ్యక్తిగత భూముల యజమానులు స్వచ్ఛందంగా పాల్గొనేలా తాజాగా ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అవుటర్‌ చుట్టూ వివిధ ప్రాంతాల్లో లేఅవుట్లు, ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు, కొత్త వర్క్‌ సెంటర్‌లు, సామాజిక, విద్య, ఆరోగ్యం ఇతర మౌలిక వసతుల కోసం భూ సమీకరణ చేపడుతోంది. అయితే వ్యవసాయానికి పనికిరాని భూములను నిర్బంధంగా కాకుండా రైతులు లేదా పట్టాదారులు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవాలని నిర్ణయించింది. వారు ఎలాంటి రుసుంలు, కన్వర్షన్‌, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. సమీకరించిన భూమిలో హెచ్‌ఎండీఏనే పక్కా రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా వ్యవస్థ, విద్యుత్తు సౌకర్యం వంటి మౌలిక వసతులను కల్పిస్తుంది. సమీకరించిన భూమిలో రహదారులు ఇతర అభివృద్ధి పనుల తర్వాత మిగిలిన దాంట్లో 60 శాతం యజమానులకు కేటాయిస్తారు. అంటే ఎకరానికి 1741 చదరపు గజాలు అభివృద్ధి చేసిన భూమిని యజమానికి కేటాయిస్తారు. రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌తో సహా అభివృద్ధి చేసిన భూమిని రైతు లేదా పట్టాదారుకు ఇస్తారు. 40 శాతం హెచ్‌ఎండీఏకు ఉంటుంది. ఇందులో లేఅవుట్లు, సామాజిక, విద్య, సాంస్కృతిక సౌకర్యాలకు కేటాయిస్తారు. హెచ్‌ఎండీఏ విస్తరించిన 7200 చదరపు కిలోమీటర్ల పరిధిలో రైతులు, భూ యజమానులు, పట్టదారులు వ్యక్తిగతంగా లేదా సమూహాలుగా దరఖాస్తు చేసుకోవాలి. ఓఆర్‌ఆర్‌ లోపల కనీస విస్తీర్ణం 50 ఎకరాలుంటాలి. ఓఆర్‌ఆర్‌ వెలుపల కనీసం 100 ఎకరాలు అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. చిన్నచిన్న విస్తీర్ణాలైతే పక్కపక్కనే ఉండాలి. మరిన్ని వివరాలకు హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం, స్వర్ణజయంతి కాంప్లెక్స్‌, అమీర్‌పేటలో సంప్రదించాలని అధికారులు కోరారు.

తక్కువ ధరలో ప్లాట్లు..

స్థలాల ధరలు భారీగా పెరగడంతో హెచ్‌ఎండీఏ వేలం వేసిన ప్లాట్లు మధ్యతరగతి, సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి కొంత దూరంగా ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌కు మధ్య లేఅవుట్లు అభివృద్ధి చేసి వేలం వేయడం ద్వారా మధ్యతరగతి ప్రజలు కూడా ఈ ధరలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. ఇందులో 150, 200 గజాల నుంచి ఆపైన పరిమాణంలో ప్లాట్లుగా సిద్ధం చేసే అవకాశం ఉంది.

గుర్తించిన భూములు 924.28 ఎకరాలు

ఇన్ముల్‌నెర్వ (95.25), లేమూర్‌ (83.48), ప్రతాప్‌సింగారం (152.25), కొర్రెముల (20.95), బోగారం (125), దండుమల్కాపూర్‌ (355.45), నాదూర్‌గుల్‌-కూర్మల్‌గూడ (91.90).


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని