ఫలితాల తర్వాత పరుగేనా?

సార్వత్రిక ఎన్నికలు 2024 అనంతరం గృహ నిర్మాణ మార్కెట్‌ మరో శిఖరాన్ని అందుకుంటుందా? గత రెండు సాధారణ ఎన్నికల అనుభవాలనుబట్టి అవుననే అంటున్నాయి జాతీయ స్థాయిలోని నిర్మాణ రంగ నిపుణులు.

Updated : 23 Mar 2024 10:07 IST

ఈనాడు, హైదరాబాద్‌

సార్వత్రిక ఎన్నికలు 2024 అనంతరం గృహ నిర్మాణ మార్కెట్‌ మరో శిఖరాన్ని అందుకుంటుందా? గత రెండు సాధారణ ఎన్నికల అనుభవాలనుబట్టి అవుననే అంటున్నాయి జాతీయ స్థాయిలోని నిర్మాణ రంగ నిపుణులు. 2014, 2019 ఎన్నికల ఫలితాలు గృహ కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను పెంచాయని.. ఈసారి అందుకు అవకాశం ఉందని అంటున్నారు. కఠినమైన రియల్‌ ఎస్టేట్‌ నిబంధనలు, బలమైన జీడీపీ వృద్ధి అంచనాలు, అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం, ఆశావహంగా ఉన్న గృహ కొనుగోలుదారులు.. ఇవన్నీ చూస్తుంటే 2024 ఎన్నికల అనంతరం మార్కెట్‌ మరో శిఖరాన్ని చూడటానికి అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు కన్పిస్తున్నాయని అంచనా వేస్తున్నారు.

ఎన్నికల నగారా మోగగానే మొదటగా ప్రభావితం అయ్యే రంగాల్లో రియల్‌ ఎస్టేట్‌ ఒకటి. దాదాపు రెండున్నర నెలలకుపైగా అమలులో ఉండే ఎన్నికల కోడ్‌లతో లావాదేవీలు స్తంభిస్తుంటాయి. స్థిరాస్తి మార్కెట్‌లో ఇప్పటికీ నగదు లావాదేవీల వాటా అధికంగా ఉంది. ఎన్నికల నిబంధనల కారణంగా ఒక వ్యక్తి రూ.50 వేలకు మించి వెంట తీసుకెళ్లడానికి వీల్లేదు. అంతకుమించిదే ఆధారాలు చూపాలి. లేదంటే పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మరీ పోలీసులు కార్లు, బైకుపై వెళ్లేవారు బ్యాగుల తనిఖీలతో నగదు తీసుకెళ్లడానికి చాలామంది సాహసించరు. దీంతో స్థిరాస్తి కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లపై ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా ప్రభావం సహజమే. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మార్కెట్‌ క్రమంగా పుంజుకునే దశలో ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చాయి. దీని ప్రభావం 3 నెలలపాటు ఉంటుంది. అనంతరం పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని స్థానిక బిల్డర్లు చెబుతున్నారు.

గత అనుభవాలనుబట్టి..

  • సాధారణ ఎన్నికల అనంతరం 2014లో గృహ నిర్మాణ మార్కెట్‌ అప్పట్లో గరిష్ఠ స్థాయికి తాకింది. 7 అగ్ర నగరాల్లో కలిపి 3.45 లక్షల ఇళ్లు విక్రయించారు. మరో 5.45 లక్షల యూనిట్ల నిర్మాణాలు ప్రారంభించారు. అప్పట్లో ఇదే అత్యధికం. సగటు చదరపు అడుగు ధర కూడా 6 శాతం పెరిగింది.
  • పెద్ద నోట్ల రద్దు, రెరా, జీఎస్‌టీ వంటి సంస్కరణ కారణంగా 2016 ఆఖరు నుంచి మార్కెట్‌ మందగించినా.. 2019 ఎన్నికల అనంతరం పుంజుకుంది. చదరపు అడుగు ధరల్లో ఒక శాతం వృద్ధి కన్పించింది. 2020లో కొవిడ్‌తో పూర్తిగా దెబ్బతిన్నా 2022 నుంచి దూకుడు ప్రదర్శించింది. విక్రయాలు, ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవాలు గరిష్ఠ స్థాయిలను తాకాయి.

మున్ముందు ఎలా ఉంటుందంటే..

  • భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలోనే నాలుగో ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాం. ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్‌ రాబోయే సంవత్సరాల్లో బలమైన జీడీపీ వృద్ధి కల్గి ఉంటుందని అంచనా వేస్తోంది. ఇది పరోక్షంగా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది.
  • ద్రవ్యోల్బణం ప్రస్తుతం నియంత్రలో ఉంది. గృహ కొనుగోలుదారుల్లో ఆర్థిక ఆశావాదం, విశ్వాసాన్ని పెంచుతోంది.
  • పెరుగుతున్న గృహ కొనుగోలుదారుల డిమాండ్‌ ఆధారంగా డెవలపర్లు గత ఏడాదికాలంలో గణనీయమైన భూ ఒప్పందాలు చేసుకున్నారు. బ్యాలెన్స్‌ షీట్‌లు చాలావరకు పటిష్ఠంగా ఉన్నాయి.
  • చాలామంది పెద్ద డెవలపర్లు తమ ఉనికిని విస్తరించడానికి కొత్త విభాగాల్లో ప్రవేశిస్తున్నారు. హైదరాబాద్‌లోకి ఇతర నగరాల బిల్డర్లు రావడం.. మన డెవలపర్లు ఇతర నగరాల్లో ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారు. మున్ముందు ఇది మరింత పెరుగుతుంది.  

2024లోనూ పునరావృతం అవుతుంది

ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం 2024లో గృహ నిర్మాణ మార్కెట్‌కు అనుకూలంగా ఉంది. గృహాల విక్రయాలు, కొత్త ప్రాజెక్ట్‌లపరంగా ఈ ఏడాది ఎన్నికల అనంతరం కొత్త శిఖరాన్ని సృష్టించగలవు. ఎన్నికల షెడ్యూల్‌ తర్వాత కూడా దేశవ్యాప్తంగా హౌసింగ్‌ డిమాండ్‌ ఆశాజనకంగానే ఉంది.

అనూజ్‌ పూరి, ఛైర్మన్‌, అనరాక్‌ గ్రూప్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని