విలాస నివాసం

నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గేటెడ్‌ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. వేలాది మంది గృహవసరాలను తీరుస్తున్నాయి.

Published : 30 Mar 2024 01:21 IST

గేటెడ్‌ కమ్యూనిటీల్లో నిబంధనలు కాస్త కఠినమే

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గేటెడ్‌ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. వేలాది మంది గృహవసరాలను తీరుస్తున్నాయి. సాధారణ కమ్యూనిటీలకు భిన్నంగా ఉండడమే కాదు.. 24 గంటలూ భద్రత, గేటు వద్దే తనిఖీలు, అనుమతి లేనిదే ప్రవేశాలుండకపోవడం.. నిరంతరం సీసీటీవీ కెమేరాలు, జీవన సౌకర్యాలన్నీ మన ప్రమేయం లేకుండా లభించడం ఇలా చెప్పుకొంటూపోతే అనేకం ఉన్నాయి. గేటెడ్‌ కమ్యూనిటీలు నివాసితులకు మేము ప్రత్యేకం అనే భావాన్ని అందిస్తాయి. బయటి వ్యక్తులకు అనుమతులు లేకుండా ఈ నివాసాలుంటాయి. గేటెడ్‌ కమ్యూనిటీలు క్లబ్‌హౌస్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, కమ్యూనిటీ హాళ్లు, ప్లేగ్రౌండ్‌లు, స్పోర్ట్స్‌ క్లబ్‌, అత్యాధునిక సౌకర్యాలతో జిమ్‌ల సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కరెంటు పోయిందా.. ఉందా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. తాగునీటి సమస్యతోపాటు వంట గ్యాస్‌ గురించి ఎదురు చూడాల్సిన పని ఉండదు. ఎవరి పార్కింగ్‌లో వారి వాహనాలను నిలిపే అవకాశంతోపాటు అతిథుల కార్ల పార్కింగ్‌కు కూడా ప్రత్యేక స్థలం ఉంటుంది. మరీ ముఖ్యంగా మన ఇంటి పరిసరాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. రూపురేఖలు మారినట్టు ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు నిర్మించుకునే వెసులుబాటు లేకపోవడంతో సౌందర్యం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.

ఎన్ని వెసులుబాట్లో

ఏదైనా సాధారణ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ ఒకే విధమైన సౌకర్యాలను కలిగి ఉన్నప్పటికీ, గేటెడ్‌ కమ్యూనిటీలలో సౌకర్యాల నాణ్యత, ప్రమాణాలలో ఎల్లప్పుడూ వ్యత్యాసం ఉంటుంది. మరోవైపు మరింత ప్రీమియం గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాంగణంలో హైఎండ్‌ రెస్టారెంట్లు, కేఫ్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పిల్లల ఆటస్థలం, స్పా, క్లినిక్‌లు ఉంటాయి. ఇంకా ఎక్కువ ప్రీమియం కడితే గేటెడ్‌ కమ్యూనిటీ మీకు వాలెట్‌ పార్కింగ్‌, ప్రైవేట్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ అందిస్తుంది. నగరంలోని అదే ప్రాంతంలో ఉన్న ఇళ్ల ధరలకంటే గేటెడ్‌ కమ్యూనిటీలలో ధర అధికంగా ఉంటుంది. ఉండే ప్రాంతం, కల్పించే సౌకర్యాలు, నిర్మాణ రంగ సంస్థ పేరు ప్రఖ్యాతలనుబట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. పెట్టుబడికి చిరునామాగా గేటెడ్‌ కమ్యూనిటీలు నిలుస్తాయి. పెట్టుబడి దృక్కోణంలో గేటెడ్‌ కమ్యూనిటీలు మంచి ఎంపిక. ఎందుకంటే వీటిలో ఎక్కువ జోన్‌లు ప్రీమియం ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంట్లో చేసుకునే ఏ చిన్న వేడుకైనా గేటు దాటకుండా గేటెడ్‌ కమ్యూనిటీల్లోని క్లబ్‌ హౌస్‌లలో నిర్వహించుకోవచ్చు.

ఖర్చులూ ఎక్కువే

గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివాసం ఎంతో విలాసమో అంతే వ్యయంతో కూడుకున్నది కూడా. సౌకర్యాలు తగ్గకుండా ఉండాలంటే, ఖరీదైన భద్రత ఉండాలంటే నిర్వహణ ఖర్చు భారీగా ఉంటుంది. కొన్నిచోట్ల ఇంటికి తీసుకున్న రుణం మొత్తం.. గేటెడ్‌లో నిర్వహణకే చెల్లించాల్సినంత ఉంటుంది. కనీసంలో రూ.6 వేల నుంచి రూ.20 వేల వరకూ నిర్వహణ (మెయింటెనెన్స్‌)కు ఉంటుంది. ప్రతినెల నిర్వహణ ఖర్చు గేటెడ్‌ కమ్యూనిటీ ఖాతాలో వేయకుంటే అపరాధ రుసుం కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీ సందర్శకులు ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతి పొందాల్సి ఉంటుంది. వారి వాహనాలను బయట పార్క్‌ చేయాలి. కచ్చితంగా ఇది భద్రతకు సంబంధించిన విషయమే అయినా.. ఇంటి యజమానికి, వారిని చూసేందుకు వచ్చిన వారికి కాస్త ఇబ్బందిగా పరిణమిస్తుంది. అంతేకాదు ఇంటి పనివారికి కూడా ఒకరోజులో నిర్దిష్ట సమయంలోనే అవకాశం కల్పిస్తారు. నివాసితుల ప్రతి కదలికా ట్రాక్‌ చేస్తారు. అయితే మీ ఇళ్లు కమ్యూనిటీ గోడలకు దగ్గరగా ఉన్నా, క్లబ్‌హౌస్‌ సమీపంలో ఉన్నా.. శబ్దాలు, ఆటంకాలు కలగడం ఖాయం.

ఇల్లు మారాలన్నా.. ఖాళీ చేయాలన్నా

గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇల్లు ఖాళీ చేయాలన్నా.. కొత్తగా ఇంటిలోకి చేరాలన్నా అందుకు కొంత రుసుం కట్టాల్సిందే. ఇంటిని ఖాళీ చేస్తున్నప్పుడు నిర్వహణతోపాటు ఇంటికి కరెంటు, గ్యాస్‌ ఇలా అన్నీ క్లియర్‌ చేయాలి. అంతేకాదు ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు మారుతాం, ఇంట్లో దిగుతాం అనడానికి వీలు లేదు. నిర్దేశిత సమయాల్లోనే ఇవన్నీ చేయాల్సి ఉంది.

  • గేటు వద్ద మీ కారు లోపలికి ప్రవేశించాలంటే.. గేటు పాస్‌ తప్పనిసరి. ఆధార్‌, పాస్‌పోర్టు, పాన్‌, ఉద్యోగ నియామక పత్రం ఇలా ఆధారాలు గేటెడ్‌ కమ్యూనిటీ నిర్వహణ కార్యాలయంలో సమర్పించాలి.
  • ఇంటిలో ఇంటీరియర్‌ మార్చాల్సి ఉన్నా.. మరిన్ని సొగబులు అద్దాలన్నా.. పన్ను చెల్లించాల్సిందే.  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేయాలి. అంతేకాదు ఆదివారాలు, పండగ రోజులు సెలవులు. ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని