పెద్ద ఫ్లాట్‌ కొనడం మేలేనా?

మీ కుటుంబానికి రెండు పడక గదుల ఫ్లాట్‌ సరిపోతుందా? కానీ అందరూ మూడు పడక గదుల నివాసం కొనేందుకు మొగ్గు చూపుతున్నారా? 

Updated : 30 Mar 2024 07:31 IST

ఈనాడు, హైదరాబాద్‌

మీ కుటుంబానికి రెండు పడక గదుల ఫ్లాట్‌ సరిపోతుందా? కానీ అందరూ మూడు పడక గదుల నివాసం కొనేందుకు మొగ్గు చూపుతున్నారా? ఈ రెండింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారా? ఆదాయాలు, అవసరాలు, ఇంటి నిర్వహణ, భవిష్యత్తు పెట్టుబడి వంటి భిన్న కోణాల్లో ఆలోచించినప్పుడు వ్యక్తులను బట్టి, కుటుంబాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని నిర్మాణదారులు అంటున్నారు. బడ్జెట్‌ సహకరిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు పడక గదుల ఫ్లాట్‌ కొనడం మేలు అనేది తమ సూచన అంటున్నారు.

నగరంలో ఇప్పుడు మూడు పడకగదుల ఫ్లాట్ల నిర్మాణం సగానికంటే అధికంగా జరుగుతోంది. చాలా ప్రాజెక్ట్‌లు రెండు పడకగదుల ఆవాసాలను కట్టడమే మానేశాయి. రెండు, మూడు ఫ్లాట్లు కడుతున్న గేటెడ్‌ కమ్యూనిటీలు ఎక్కడైనా ఉంటే ముందు మూడు పడకగదుల ఫ్లాట్లు బుక్‌ అవుతున్నాయని బిల్డర్లు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం మార్కెట్‌ తీరును సూచిస్తోంది. ఇల్లు విశాలంగా ఉండాలని కోరుకునే వారంతా పెద్ద ఫ్లాట్లనే కొనుగోలు చేస్తున్నారు.

కొవిడ్‌ అనంతరం భారీగా మార్పు  

ఇదివరకు మూడు పడక గదుల ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే వాటిని అద్దెకివ్వడం చాలా క్లిష్టంగా ఉండేది. చాలాకాలం పాటు ఖాళీగా ఉండేవి. కొవిడ్‌ అనంతరం కొనుగోలుకైనా, అద్దెకైనా వీటికే ప్రాధాన్యం ఇస్తుండటంతో వీటి నిర్మాణాలు, విక్రయాలు పెరిగాయి. స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లలోనూ 3 బీహెచ్‌కేనే కడుతున్నారు.

డిజిటల్‌ శకంలో

ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం, డిజిటల్‌ యుగంలో ఇంటి నుంచి వ్యాపారం చేయడం గమనిస్తున్నాం. ఆన్‌లైన్‌ చదువులకు ప్రాధాన్యం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో విశాలమైన ఇంటికి డిమాండ్‌ అధికంగా ఉంది. ఈ కారణాలతో అద్దెకుండేవారు సైతం పెద్ద ఇళ్ల కోసమే చూస్తున్నారు. కాబట్టి కొనగలిగే స్థోమత ఉంటే మూడు పడక గదుల ఇంటి వైపు మొగ్గు చూపవచ్చు అని నిర్మాణదారులు చెబుతున్నారు.

నిర్వహణ చూడాలి

ఆధునిక జీవనశైలికి తగ్గట్టుగా ఇంటిని అలంకరించుకోవడం పెరిగింది. విశాలమైన ఇల్లు కొంటే ఇంటీరియర్స్‌ ఖర్చు సైతం పెరుగుతుంది. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
పెద్ద ఇళ్ల నిర్వహణ కొంచెం కష్టమే. చిన్న ఇల్లు అయితే ఇంట్లో వారే చేసుకోవచ్చు. కొంతమంది పనివారితో చేయించుకోవడానికి ఆసక్తి చూపరు. కానీ విశాలమైన గృహాల్లో తప్పనిసరిగా పనివారిపై ఆధారపడక తప్పదు. మెయింటనెన్స్‌ రుసుములు సైతం అధికంగానే ఉంటాయి.

చాలామందిలో సందిగ్ధత

అద్దె మేలా.. కొనడమా.. చాలామందిలో ఈ సందిగ్ధత మెదడును తొలుస్తుంటుంది. అద్దె ఇళ్లలో సౌలభ్యం ఉంటుంది. పిల్లల చదువులు, ఉద్యోగ ప్రదేశాలను బట్టి వాటికి దగ్గరలో తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. నెలకు అద్దె చెల్లిస్తే చాలు. నగరంలో రెండు నెలల అద్దెనే అడ్వాన్స్‌ కాబట్టి పెద్ద సమస్య ఉండదు. జేబు నుంచి పెద్ద ఖర్చు లేకుండానే పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మారి ఆధునిక జీవనశైలికి తగ్గట్టుగా జీవించవచ్చు. కానీ కొనుగోలు చేయడమే వివేకవంతమైన ఎంపిక అనేది బిల్డర్లు చెబుతున్నారు. అద్దె మొత్తాన్ని ఈఎంఐ చెల్లించవచ్చు. రుణం తీరిన తర్వాత ఇల్లు సొంతం అవ్వడమే కాదు స్థిరాస్తి విలువ పెరుగుతుంది. అన్నింటకీ మించి ఆర్థిక క్రమశిక్షణ, స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. భవిష్యత్తులో మరింత విశ్వాసంతో ముందడుగు వేసేందుకు ఇల్లు భరోసానిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇంటిపై టాపప్‌ రుణం తీసుకుని ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు. మలిదశలో ఆదాయం లేకపోతే రివర్స్‌ మార్ట్‌గేజ్‌తో స్థిరమైన ఆదాయం పొందవచ్చు. అవసరం లేనప్పుడు పెద్ద ఇంటిని అద్దెకు ఇచ్చి చిన్న ఇంటిలోకి మారిపోవచ్చు. అదనపు ఆదాయంతో ఖర్చులు వెళ్లదీసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని