భూమి కేటాయిస్తే సరసమైన ధరల్లో ఇళ్ల నిర్మాణం

‘ఎన్నికల ముందు, తర్వాత కూడా హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌ స్తబ్దుగానే ఉంది. వేగం పెంచేందుకు రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో 2 శాతం తగ్గింపును ఏడాది నుంచి ఏడాదిన్నర పాటు ఇవ్వాలని సర్కారును కోరుతున్నాం.

Published : 13 Apr 2024 01:33 IST

గ్రిడ్‌ రోడ్లను మార్కింగ్‌ చేస్తే చాలు.. ఓఆర్‌ఆర్‌ చుట్టూ మరింతగా అభివృద్ధికి అవకాశం
‘ఈనాడు’తో నరెడ్కో తెలంగాణ నూతన అధ్యక్షుడు విజయసాయి మేక
ఈనాడు, హైదరాబాద్‌

‘ఎన్నికల ముందు, తర్వాత కూడా హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌ స్తబ్దుగానే ఉంది. వేగం పెంచేందుకు రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో 2 శాతం తగ్గింపును ఏడాది నుంచి ఏడాదిన్నర పాటు ఇవ్వాలని సర్కారును కోరుతున్నాం. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ భవిష్యత్తు మున్ముందు మరింత బాగుంటుంది. అన్ని ప్రాంతాలకు ఇది విస్తరించేలా ప్రభుత్వం చొరవ చూపాలి. సరసమైన ఇళ్ల నిర్మాణం కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో భూమి కేటాయిస్తే పీపీపీలో ఇళ్లు నిర్మించేందుకు మా బిల్డర్లు సిద్ధంగా ఉన్నారు. విధాన నిర్ణయాల పరంగా సర్కారుతో కలిసి పనిచేస్తాం. మూసీ సుందరీకరణ పూర్తి చేయగల్గితే హైదరాబాద్‌ రూపురేఖలే పూర్తిగా మారిపోతాయి’ అని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(నరెడ్కో) తెలంగాణ అధ్యక్షుడు విజయసాయి మేక అన్నారు. ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో పలు విషయాలను పంచుకున్నారు.

ఆర్‌ఆర్‌లో గ్రిడ్‌ రోడ్లను మార్కింగ్‌ చేయాలని ఎంతోకాలంగా కోరుతున్నాం. రహదారులు వేయాలంటే చాలా నిధులు కావాలి. అందుకే మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఉన్న రహదారుల మార్కింగ్‌ చేస్తే చాలు అంటున్నాం. ఆ ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్ట్‌ వస్తే బిల్డరే అక్కడ కొత్త రోడ్డు నిర్మిస్తారు. ఈ దిశగా సర్కారు ప్రోత్సహించాలి. అక్కడ చేపట్టే భవన నిర్మాణాల అనుమతుల ఫీజుల్లో రాయితీలను పరిశీలించవచ్చు.

ప్రాంతాన్ని బట్టి ఫీజులు ఉండేలా

సిటీలో ఎక్కడ ప్రాజెక్ట్‌లు చేపట్టినా ఫీజులు ఒకేలా ఉన్నాయి. సిటీకి దూరం వెళ్లి కొత్త ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తుంటే ఫీజుల్లో కొంత రాయితీని సర్కారు ఇవ్వాలి. సిటీ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అన్నివైపులా అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆరంభంలో కొన్ని ఏళ్లపాటూ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, అనుమతుల ఫీజుల్లో రాయితీలిచ్చి ప్రోత్సహించవచ్చు.

ఏడాదిన్నర  రాయితీ ఇస్తే చాలు

మార్కెట్‌ కొంతకాలంగా స్తబ్దుగా ఉంది. తిరిగి పుంజుకునేందుకు సర్కారు నుంచి కొన్ని ప్రోత్సాహకాలను ఆశిస్తున్నాం. ఏడాది నుంచి ఏడాదిన్నర పాటు రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో 2 శాతం తగ్గించాలని కోరుతున్నాం. ఇప్పుడు 7.5 శాతం ఉంది. జీఎస్‌టీ మరో 5 శాతం ఉంది. ఇంటి విలువలో 12.5 శాతం పన్నులకే అనేసరికి చాలామంది డాక్యుమెంటేషన్‌ పూర్తి విలువకు చేయించుకోవడం లేదు. రెండు శాతం తగ్గించడం ద్వారా సర్కారు ఆదాయం తగ్గకపోగా టర్నోవర్‌ పెరుగుతుంది. వాయిదా వేస్తూ వచ్చిన వారు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారు. మహారాష్ట్రలో కొవిడ్‌ సమయంలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో తగ్గింపుతో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. ఇటీవల మరోసారి అక్కడ రాయితీని పొడిగించారు.

రిటైర్మెంట్‌ హోమ్స్‌  అవసరం పెరుగుతోంది

రాబోయే రోజుల్లో సీనియర్‌ సిటిజన్‌ హోమ్స్‌, రిటైర్మెంట్‌ హోమ్స్‌ అవసరం చాలా ఉంటుంది. ఇప్పటివరకు వీటిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. యూఎస్‌ఏలో విశ్రాంత జీవులు ఫ్లోరిడా వెళ్లి స్థిరపడుతుంటారు. అక్కడ జీవన వ్యయం తక్కువగా ఉంటుంది. పెద్దలకు తగ్గట్టుగా ఇళ్ల నిర్మాణం ఉంటుంది. నిర్వహణ సులువుగా ఉండేలా 750 చ.అ.విస్తీర్ణంలో ఉండేలా వీటిని కట్టవచ్చు. మన దగ్గర జీవో 111 పరిధిలో కొన్ని ఆంక్షల నడుమ వీటిని ప్రోత్సహించవచ్చు. పరిమిత అంతస్తుల వరకు జలాశయాలకు ముప్పు లేకుండా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తే రైతులకు, పర్యావరణానికి మేలు జరుగుతుంది. దేశానికే ఆదర్శం అవుతుంది. దీనిపై సర్కారు ఆలోచించి సమగ్రమైన విధానాన్ని తీసుకురావాలి.

మరో 50 ఏళ్ల వరకు  ఢోకా లేకుండా

ప్రాంతీయ వలయ రహదారి చేపడితే దేశంలోనే ఈ తరహా ప్రాజెక్ట్‌ మొదటిది అవుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేపట్టే ప్రాజెక్ట్‌ కాబట్టి మరో 50 ఏళ్ల వరకు హైదరాబాద్‌ విస్తరణకు ఢోకా ఉండదు. ఈ ప్రాజెక్ట్‌కు నిధులు కావాలంటే బిల్డర్లను ప్రోత్సహించాలి. ఇక్కడ అభివృద్ధి చేసే శాటిలైట్‌ టౌన్‌షిప్పుల్లో బిల్డర్లను భాగస్వామ్యం చేయాలి.

నరెడ్కో విస్తరణ ప్రణాళికలు  

నరెడ్కోను జిల్లాలకు విస్తరించాలనే ప్రణాళికలో ఉన్నాం. ప్రస్తుతం నరెడ్కో కూకట్‌పల్లి, నరెడ్కో వెస్ట్‌జోన్‌, నరెడ్కో హైదరాబాద్‌, వరంగల్‌ శాఖలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌కు విస్తరించబోతున్నాం. మా డెవలపర్లకు నిర్మాణ రంగంలో సాంకేతికపరంగా వస్తున్న మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు వాటి వినియోగాన్ని ప్రోత్సహించనున్నాం. రాబోయే రోజుల్లో వచ్చేవన్నీ హరిత గృహ నిర్మాణాలే. వీటిలో 20 శాతం వ్యయం తగ్గబోతుంది. ఇప్పుడు వాడుతున్న ఆర్‌ఎంసీతో పోలిస్తే 20 శాతం తక్కువ వ్యయానికే కాంక్రీట్‌ అందుబాటులోకి వచ్చింది. వీటిని అధ్యయనం చేసి మా సభ్యులకు అవగాహన కల్పించి ప్రాజెక్టుల్లో వినియోగించేలా చేయబోతున్నాం.

సర్కారు దన్నుతో అఫర్డబుల్‌ హౌసింగ్‌

సామాన్యులు సైతం కొనుగోలు చేయగలిగే సరసమైన ధరల్లో ఇళ్లను (అఫర్డబుల్‌ హౌసింగ్‌) ఇదివరకు హౌసింగ్‌ బోర్డు చేపట్టేది. ప్రభుత్వమే భూమిని కేటాయించి నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కూడా మొదట భరించేది. అదే భూమిని పీపీపీ విధానంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో బిల్డర్లకు కేటాయిస్తే వాటిలో సరసమైన ధరల్లో ఇళ్లను నిర్మించి ఇవ్వొచ్చు. సర్కారే భూమి కేటాయిస్తుంది కాబట్టి ధరల నియంత్రణ ఉంటుంది. భూ యజమానితో ఎలాగైతే డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌తో ప్రాజెక్ట్‌లు చేస్తున్నామో.. ఇక్కడా అలాగే చేస్తారు. ప్రయోగాత్మకంగా ఒకచోట ఇస్తే మేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓఆర్‌ఆర్‌, ప్రాంతీయ వలయ రహదారి వరకు ఆయా వర్గాలకు గృహ నిర్మాణం అవసరమైన ప్రాంతాల్లో భూమిని ఎంపిక చేసి ఇవ్వాలని సర్కారును కోరుతున్నాం.


35 లక్షల విస్తీర్ణంలో మాల్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో పలు కొత్త ప్రదేశాల్లో మాల్స్‌ త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. చాలావరకు ఇవన్నీ నిర్మాణంలో ఉన్నాయి. నల్లగండ్ల, కొంపల్లి, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో కొత్త మాల్స్‌ వస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి మాల్స్‌లో రిటైల్‌ సరఫరా 35 లక్షల చదరపు అడుగులకు చేరుకుంటుందని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫిల్డ్‌ ‘హైదరాబాద్‌ రిటైల్‌ క్యూ1 2024’ నివేదికలో పేర్కొంది. మాల్స్‌లో ఖాళీలు గత త్రైమాసికం మాదిరే ఉన్నాయని వెల్లడించింది. అత్యుత్తమ గ్రేడ్‌ మాల్స్‌లో ఖాళీలు 3-5 శాతానికి పరిమితం అయ్యాయని పేర్కొంది.

రిటైల్‌లో మెరుగ్గా..: హైదరాబాద్‌ రిటైల్‌ నిర్మాణాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదైంది. శివారు ప్రాంతాల్లోని మెయిన్‌స్ట్రీట్‌లో నిర్మాణాలు పూర్తైన వాటిలో 4.91 లక్షల చదరపు అడుగుల మేర లీజింగ్‌ జరిగింది. హైపర్‌మార్కెట్లు, వస్త్ర దుకాణాలు భవనాలను లీజుకు తీసుకున్న వాటిలో ప్రధానంగా ఉన్నాయి. హయత్‌నగర్‌, నాగోల్‌, పటాన్‌చెరు, ఉప్పల్‌, కర్మాన్‌ఘాట్‌, షేక్‌పేట్‌, జూబ్లీహిల్స్‌, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో లావాదేవీలు జరిగాయి. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే గత తైమాసికంలో లీజింగ్‌ పరంగా 45 శాతం వృద్ధి నమోదైంది.  ః అద్దెలపరంగా బంజారాహిల్స్‌, నల్లగండ్ల, కోక్‌పేట వంటి ప్రాంతాల్లో 15-25 శాతం మేర గడిచిన కొన్ని త్రైమాసికాల్లో పెరిగాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని