రెరా చట్టం.. కొనుగోలుదారుల ప్రయోజనాలకు దూరం

దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) అమల్లోకి వచ్చి దాదాపు ఏడేళ్లు అవుతోంది. స్థిరాస్తి కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం రెరాను తీసుకొచ్చింది.

Published : 27 Apr 2024 00:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) అమల్లోకి వచ్చి దాదాపు ఏడేళ్లు అవుతోంది. స్థిరాస్తి కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం రెరాను తీసుకొచ్చింది. దీంతో పారదర్శకత పెరిగిందని స్థిరాస్తి వ్యాపారుల సంఘాలు చెబుతున్నాయి. మరి కొనుగోలుదారులు ఏమంటున్నారు? దిల్లీ, నోయిడా గ్రేటర్‌, గుర్గావ్‌, ముంబయి, పుణె, అహ్మదాబాద్‌, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లోని వినియోగదారులను ట్రాక్‌2 రియాలిటీ సంస్థ సర్వే చేయగా.. క్షేత్రస్థాయిలో వాస్తవిక స్థితిని మారలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా న్యాయం పొందడంలో ఆలస్యం అవుతోందని వాపోతున్నారు.

రెరా చట్టం అమలు బాధ్యత రాష్ట్రాలది కావడంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఏడాది నుంచి అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ఇటీవలే పూర్తి స్థాయి అథారిటీ ఏర్పడింది. ఇప్పుడిప్పుడే పనిచేయడం మొదలెట్టింది. ఈ తరహాలో దేశవ్యాప్తంగా రెరా అమలులో వేర్వేరు పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా రెరాతో గృహ కొనుగోలుదారుల సంతృప్తి సూచిక 26 శాతం కంటే తక్కువగా ఉంది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి పదిమందిలో ఏడుగురికి అంత సంతృప్తికరమైన అనుభవం కలగలేదని సర్వే వెల్లడించింది. రెరా రాకముందు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల కంటే రెరా రిజిస్టర్‌ ప్రాజెక్ట్‌ల్లో ఎక్కువ సమాచారం కొనుగోలుదారులకు ఇవ్వడం లేదని అంటున్నారు.


సర్వే విశేషాలు...  శాతాల్లో

70 మార్కెట్‌లో పారదర్శకత స్థాయి మెరుగుపడలేదని భావిస్తున్నవారు
78 సకాలంలో న్యాయం జరగడం లేదు
88 ప్రాజెక్ట్‌ పూర్తయ్యేవరకు గడువు పొడిగింపుతో అయోమయంలో పడ్డామంటున్న కొనుగోలుదారులు
90 రెరా ఆదేశాలు అమలుకాలేదని ఆవేదన చెందినవారు
92 బిల్డర్‌, కొనుగోలుదారు ఒప్పందం ఏకరీతిగా ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు
86 కార్పెట్‌ ఏరియాపైనే విక్రయాలు చేపట్టాలని రెరా ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నిస్తున్నారు
80 అక్రమాలపై రెరా తనంతట తానే సుమోటాగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
68 బిల్డర్లపై రెరా మెతక వైఖరి అలంబిస్తోందని భావిస్తున్నారు.


నోయిడాలో పూర్తి అసంతృప్తి... : స్థిరాస్తి కొనుగోళ్లు ఎక్కువగా జరిగే మార్కెట్‌ను పరిశీలిస్తే.. నోయిడా-గ్రేటర్‌ నోయిడాలోని కొనుగోలుదారులు రెరాపై ఎక్కువ అసంతృప్తి వెలిబుచ్చారు. 92 శాతం మంది సంతృప్తిగా లేమని చెప్పారు. అత్యల్పంగా అహ్మదాబాద్‌లో 32 శాతం మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఒప్పందం ఏకరీతిలో లేకపోవడం..

బిల్డర్‌ కొనుగోలుదారు ఒప్పందం (బీబీఏ) ఏకరీతిలో లేదనే అసంతృప్తి కొనుగోలుదారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందం కూడా ముందే చూసే వీలుండటం లేదని.. మొదటి చెల్లింపు చేసిన తర్వాత బీబీఏని అప్పగిస్తున్నారని అంటున్నారు. ఈ ఒప్పందం ఏకపక్షంగా ఉంటోందని... ఇది చూసి రద్దు చేసుకుంటే కొనుగోలుదారు చెల్లించిన మొత్తంలో కొంత మినహాయించుకుంటున్నారని వాపోతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని