విశ్వనగరి.. రియల్‌ రంగానికి ఊపిరి

రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు హైదరాబాద్‌ చిరునామాగా మారుతోంది. చిన్నచిన్న మదుపరుల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడుదారుల వరకు అందరి చూపు విశ్వనగరం వైపు పడుతోంది. రియల్‌ రంగానికి అనుకూల వాతావరణం ఉండటంతో అన్ని తరగతుల వారు నగరాన్ని స్వర్గధామంగా భావిస్తున్నారు.

Published : 11 May 2024 02:14 IST

కొద్ది నెలలుగా పెరిగిన రిజిస్ట్రేషన్లు
ప్రభుత్వ విధానాలు ప్రోత్సాహకంగా ఉండడమే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు హైదరాబాద్‌ చిరునామాగా మారుతోంది. చిన్నచిన్న మదుపరుల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడుదారుల వరకు అందరి చూపు విశ్వనగరం వైపు పడుతోంది. రియల్‌ రంగానికి అనుకూల వాతావరణం ఉండటంతో అన్ని తరగతుల వారు నగరాన్ని స్వర్గధామంగా భావిస్తున్నారు. ఆకాశహర్మ్యాలతో నగరం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. కొంతకాలంగా రియల్‌ రంగం పడిపోయిందనే ప్రచారం జరిగినా.. రిజిస్రేష్టన్ల సంఖ్య చూస్తే మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక గతంతో పోలిస్తే సగటు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు పెరగడమే ఇందుకు నిదర్శనం.

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు ఢోకా ఉండదని స్థిరాస్తి సంఘాలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే గడిచిన రెండు దశాబ్దాలుగా మార్కెట్‌ గమనం ఉంది. ఇప్పుడూ అదే కొనసాగుతోంది. డిసెంబరులో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటినుంచి మార్చి వరకు నాలుగు నెలలు, అంతకుముందు నాలుగు నెలలు హెచ్‌ఎండీఏ పరిధిలోని స్థలాలు, ఫ్లాట్లు ఇళ్ల రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను పరిశీలిస్తే ఆ సంఖ్య పెరగడం గమనార్హం.

నిరంతర వృద్ధి

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రోత్సాహకరంగా ఉందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ మార్చిలో నిర్వహించిన ప్రాపర్టీ షో సందర్భంగా వెల్లడించింది. నివాస, వాణిజ్య, రిటైల్‌ రియల్‌ఎ స్టేట్‌లో నిరంతర వృద్ధి నమోదవుతోందని తెలిపింది. నగరం, రాష్ట్ర సుస్థిర అభివృద్ధిపై స్పష్టమైన దృక్పథంతో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రకటించిన ప్రణాళికలు రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి దోహదం చేయనున్నాయని తెలిపారు.

  • మెగా మాస్టర్‌ప్లాన్‌ 2050, ప్రతిపాదిత మూసీ కారిడార్‌పై కార్యాచరణ, శంషాబాద్‌ విమానాశ్రయానికి అన్నివైపుల నుంచి మెట్రో అనుసంధానం, 70 కి.మీ మెట్రోరైలు విస్తరణ, పాతబస్తీ మెట్రోకి శంకుస్థాపన, ట్రిపుల్‌ ఆర్‌ పనుల కొనసాగింపు, సికింద్రాబాద్‌, జేబీఎస్‌ మార్గంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి రాజీవ్‌ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్‌, బోయిన్‌పల్లిలో డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులకు శంకుస్థాపన చేయడం, మౌలిక వసతులపై దృష్టిపెట్టడంతో మార్కెట్‌లో భరోసా పెరిగిందని రియల్‌  నిపుణులు చెబుతున్నారు.
  • హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను చేర్చి ఏకీకృత గ్రేటర్‌సిటీ కార్పొరేషన్‌ చేయాలనే ప్రణాళిక, సిటీకి అన్ని వైపులా ఫార్మా విలేజ్‌ల ఏర్పాటు, ఫార్మాసిటీ భూముల్లో టౌన్‌షిప్పులు వంటి ప్రతిపాదనలతో మార్కెట్‌కి ఉత్సాహం వచ్చిందని బిల్డర్లు అంటున్నారు.

గత, ప్రస్తుత నాలుగు నెలల్లో ఇలా..

  • గతేడాది ఆగస్టు నుంచి నవంబరు వరకు 2,06,849 డాక్యుమెంట్లు రిజిస్టర్‌ కాగా.. 2023 డిసెంబరు నుంచి 2024 మార్చి వరకు 2,14,217 స్థిరాస్తులు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే 7,368 రిజిస్టేషన్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.
  • గత ప్రభుత్వంలో చివరి నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.3181.68 కోట్లు రాగా.. కొత్త ప్రభుత్వం మొదటి నాలుగు నెలల్లో రూ.3407.15 కోట్లు వచ్చింది. ఆదాయం స్వల్పంగా పెరిగింది.
  • ఎన్నికల కారణంగా పెరుగుదల నిలకడగా ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

హెచ్‌ఎండీఏ పరిధిలోనే..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ హెచ్‌ఎండీఏ పరిధిలో కేంద్రీకృతమై ఉంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట జిల్లాలు వస్తాయి. వికారాబాద్‌ జిల్లా సైతం సిటీ రియాల్టీలో భాగమైంది.

  • వీటి పరిధిలో స్థలాలు, ఇళ్ల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు సగటున నెలకు 53,554 (డిసెంబరు-మార్చి 24) జరిగాయి. అంతకుముందు నాలుగు నెలల సగటు రిజిస్ట్రేషన్లు 51,712గా ఉన్నాయి.

రంగారెడ్డి, మేడ్చల్‌లోనే అధికం

  • హెచ్‌ఎండీఏ పరిధిలో 8 జిల్లాలున్నా రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోనే సింహభాగం జరుగుతున్నాయి.
  • మొత్తం లావాదేవీల్లో 60 శాతానికి పైగా వాటా ఈ రెండు జిల్లాల నుంచే ఉంటోంది.

రియల్‌ రంగం పుంజుకుంది: హెచ్‌ఎండీఏ

నిర్మాణ రంగం అభివృద్ధి చెందడానికి అనుమతుల వ్యవహారంలో పారదర్శకంగా ఉండటమే కారణమని హెచ్‌ఎండీఏ సీనియర్‌ అధికారి ‘ఈనాడు’కు తెలిపారు. నిర్ణీత వ్యవధిలో నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాం. అక్రమాలకు తావులేకుండా చేస్తున్నామని తెలిపారు. ఫలితంగా హెచ్‌ఎండీఏ పరిధిలోని జిల్లాల్లో గత ఏడాది కంటే ఈసారి నిర్మాణ అనుమతులు పెరిగాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత నెల రోజులుగా అనుమతులు తగ్గినా మళ్లీ జూన్‌ నుంచి గతేడాదికి కంటే ఎక్కువే పెరిగే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో హైదరాబాద్‌ మహానగరం రియల్‌ ఎస్టేట్‌ హబ్‌గా మారుతుందనడంలో సందేహం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎప్పుడైనా హెచ్చుతగ్గులు సహజం

మార్కెట్‌ని వేర్వేరు అంశాలు ప్రభావితం చేస్తుంటాయని హెచ్చుతగ్గులు, ఒడిదుడుకులు సహజమేనని డెవలపర్లు అంటున్నారు. ఎన్నికల సమయంలో నగదు తరలింపుపై ఆంక్షలు ఉండటతో రిజిస్ట్రేషన్లపై ప్రభావం ఉంటుందని, మంచిరోజులు లేకపోయినా రిజిస్ట్రేషన్లు వాయిదా వేస్తుంటారని చెబుతున్నారు. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 13 నెలల కాలంలో ఈ తరహాలోనే రిజిస్ట్రేషన్లలో హెచ్చుతగ్గులు కనిపించాయి.

  • ఏప్రిల్‌ 2023లో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 50,926 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగితే.. మేలో 59,943కి పెరిగి.. జూన్‌లో 54,643కి తగ్గాయి. జులైలో 53,872కి తగ్గి ఆగస్టులో 58,671కి పెరిగాయి. సెప్టెంబరు నుంచి ఎన్నికల వాతావరణం రావడంతో 54,886కి, అక్టోబరులో ఏకంగా 49,646కి రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. నవంబరులో మరింతగా 43,906కి తగ్గాయి.
  • డిసెంబరులో కొత్త సర్కారు రాగానే 55,160కి రిజిస్ట్రేషన్లు పెరిగాయి. జనవరిలో మంచిరోజులు లేక 47,971కి తగ్గి ఫిబ్రవరిలో 56,487కి పెరిగాయి. మార్చిలో 53,599 రిజిస్ట్రేషన్లు జరిగాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని