Deepavali: చిదానంద చైతన్య ప్రదాయిని

Eenadu icon
By Features Desk Updated : 16 Oct 2025 06:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

 

దీపం జ్యోతిః పరబ్రహ్మ- అన్నారు. వెలుగుతున్న దీపమే పరమాత్మ. దైవానుగ్రహం కోసం నిత్యం దీపారాధన చేస్తాం. ఇక దీపావళి నాడైతే ఇంటింటా, వీధివీధిలో దీపాలే. ఆకాశంలో చుక్కలు నేలపై కొలువైనట్లుగా మహోజ్వలంగా ప్రకాశిస్తుంది. ఆనందాన్నీ ఆరోగ్యాన్నీ ప్రసాదించే దివ్వెల పండుగిది.

లోకకంటకుడైన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు వధించిన రోజు నరకచతుర్దశి. ఈ రోజుకు మరో విశేషం కూడా ఉంది. శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఇదేనని పురాణ కథలు తెలియజేస్తున్నాయి. అందుకే ఈ రోజున రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేయడం ఆచారంగా ఉంది. ఈ విశేష దినాన శ్రీమహాలక్ష్మీదేవి ఉద్భవించిందని విశ్వసిస్తారు ఉత్తర భారతీయులు. దీపావళి నాడు లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్మి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

పంచభూతాల్లో అగ్ని విశిష్టమైంది. ప్రాణికోటి మనుగడకి తేజస్సునిస్తుంది. ఐహికంగా ఆహారాన్నిస్తుంది. దీపాలు వెలిగించడం, టపాసులతో అగ్నికణాలను వ్యాపింపచేయడం ద్వారా ప్రాణశక్తి తేజరిల్లి, చైతన్యపూరితమవుతుంది. దీపావళినాటి టపాసుల ధ్వనులతో దారిద్య్రం, దుఃఖాలు తొలగిపోతాయని స్కాంద, పద్మపురాణాలు పేర్కొన్నాయి. దీపాలు ఆనందాన్ని ఇస్తే.. బాణాసంచా వాతావరణంలోని హానికలిగించే క్రిమి కీటకాలను నశింపచేస్తుంది. 

దీపంలో నీలం, పసుపు, తెలుపు రంగులు గోచరమవుతాయి. ఇవి సత్వరజస్తమో గుణాలకు ప్రతీకలు. ఈ రంగులు జగతిని పాలించే లక్ష్మి, దుర్గ, సరస్వతి మాతలకు ప్రతిరూపాలు. ఇవే సత్యం శివం సుందరం. మానవుడికి విజ్ఞానం, వివేకం, వినయాలను ప్రసాదించే అపూర్వశక్తులు. 

దీపావళి సామరస్యాన్ని, సమైక్యతను చాటుతుంది. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, తురుష్కులనే భేదం లేకుండా అందరూ కలిసి ఆనందోత్సవం చేసుకుంటారు. దీపావళి కౌముదీ దీపోత్సవంగానూ ప్రసిద్ధం. కౌముది అంటే వెన్నెల అని, భూమికి ఆనందాన్ని కలిగించేది- అని అర్థాలున్నాయి. నిజమే కదా! నిండు అమావాస్యనాడు దీపాల వెలుగు పండు వెన్నెలను కురిపిస్తుంది. బాణాసంచా కాంతులు భూమికి ఆనందాన్నిస్తాయి. 

దివ్వెల పండుగ.. కాళీపూజ

మహారాష్ట్రలో దీపావళి నాడు ఉదయానే ఆవుదూడలకు హారతిచ్చి, నమస్కరించి  రోజును మొదలుపెడతారు. రంగురంగుల ముగ్గులు తీర్చి, వాటి మధ్యలో దీపాలుంచి ఆరాధిస్తారు. ఈ పండుగ కోసం పచ్చని మొక్కలను ముందుగానే సిద్ధం చేసుకుని.. వాటిమధ్య సంబరం చేసుకుంటారు. తీపి వంటకాలను పంచిపెడతారు. 
గుజరాత్‌లో దీపావళి నూతన సంవత్సరాది. ఈ అమావాస్య వారికి శుభదినం. వ్యాపారులు పాత గణాంకాలు ముగించి కొత్త లెక్కలు ప్రారంభిస్తారు.
బెంగాల్‌లో ఈ పండుగకు కాళీమాతను పూజించి ఊరేగిస్తారు. అస్సాంలో కలిదేవుని ఆరాధిస్తారు. ఒడిశాలో ఇది పెద్దల పండుగ. తర్పణాలు వదులుతారు. కాళీపూజ వైభవంగా నిర్వహిస్తారు. ఈ అమావాస్యని వారు ‘కుమార పూర్ణిమ’ అంటారు.

అక్కడ పిల్లి లక్ష్మీదేవి

తమిళులు ‘దీపావళి మరుంధు’ అనే లేహ్యాన్ని పండుగ నాడు తప్పనిసరిగా సేవిస్తారు. ఇది అల్లం, బెల్లం, మిరియాలతో తయారవడాన భుజించిన  పిండివంటలను తేలిగ్గా జీర్ణమయ్యే లా చేస్తుంది. ఈరోజు కొందరు బొమ్మల కొలువు ఏర్పాటుచేస్తారు. మన దీపావళి వెళ్లిన నెలరోజుల తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లో పండుగ చేసుకుంటారు. కారణం- శ్రీరాముడు వనవాసం నుంచి తిరిగొచ్చి పట్టాభిషిక్తుడైన నెల తర్వాత ఆ ప్రాంతవాసులకు వార్త అందిందని, అప్పుడు ఉత్సవం చేసుకున్నారని చెబుతారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.  సిక్కులు వేలాది కొవ్వొత్తులను వెలిగిస్తారు. రాజస్థాన్‌లో దీపావళి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో పిల్లిని అపశకునంగా భావించడం తెలిసిందే. రాజస్థాన్‌లో మాత్రం మార్జాలాన్ని లక్ష్మీదేవిగా భావించి, నైవేద్యాలు సమర్పిస్తారు. స్త్రీలు ఈరోజు తమ నగలను నదిలో శుభ్రం చేసుకుంటారు. వివిధ రాష్ట్రాల్లోనే కాదు.. బ్రిటన్, అమెరికా, పాకిస్థాన్‌ ఇలా అనేక దేశాల్లోని ప్రవాసభారతీయులు దీపావళిని ఆనందోత్సాహాలతో వేడుక చేసుకుంటారు. 

ఇది ఐదు రోజుల పండుగ

మనకు ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య.. రెండు రోజులే పండుగ. కానీ ఉత్తర భారతంలో ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, తర్వాతి రోజు బలి పాడ్యమి, ఆ మర్నాడు యమ ద్వితీయ- ఇలా ఐదు రోజులు వేడుక చేసుకుంటారు.

ధనత్రయోదశి నాడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తారు. నరకచతుర్దశి నాడు శ్రీకృష్ణుని, శ్రీరాముని పూజిస్తారు. దీపావళినాడు లక్ష్మీదేవిని పూజిస్తారు. సాయంత్రం అనేక దీపాలు వెలిగించి, బంధుమిత్రులతో కలిసి పండుగ చేసుకుంటారు. జీవితం చక్కగా సాగాలని ఆశిస్తూ దీప, ధన, ధాన్యాది దానాలూ చేస్తారు. దీపాలు, బాణాసంచాతో ఘనంగా వేడుక చేసుకుంటారు. బలి పాడ్యమినాడు శ్రీకృష్ణుని పూజించి, నాట్యాలు చేస్తారు. వామనుడు త్రివిక్రమమూర్తిగా ఎదిగి- బలిచక్రవర్తిని అథోలోకానికి అణచేసిన రోజిది. ఈనాడు బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకానికి వచ్చి.. దీపాలు, టపాసుల కోలాహలం చూసి సంబరపడతాడని విశ్వసించే కేరళవాసులు- విష్ణుమూర్తిని, బలిచక్రవర్తిని పూజిస్తారు. 
‘యమద్వితీయ’ను భగినీ హస్త భోజనం, భాయీ దూజ్‌ అని కూడా అంటారు. భగిని అంటే సోదరి. ఆడపిల్ల- తన అన్నదమ్ములను పిలిచి, వండి వడ్డించే పండుగిది. సోదరులు- తమ అక్కచెల్లెళ్లకు వివిధ కానుకలిచ్చి ఆనందింపచేస్తారు. 

పౌరాణిక కథను అనుసరించి.. యమునాదేవి సోదరుడు యమధర్మరాజును ఆహ్వానించి ప్రేమగా భోజనం వడ్డించింది. సంతోషించిన యముడు వరం కోరుకోమనగా- యమ ద్వితీయనాడు అన్నదమ్ములకు భోజనం పెట్టినవారికి యమ బాధ లేకుండా కరుణించమని అడిగింది. అలా ఈ రోజున అన్నదమ్ములను ఆహ్వానించడం ఆనవాయితీ అయ్యింది. ఈనాడు యమధర్మరాజును, యమునాదేవిని ఆరాధిస్తారు.  

ఒక్కమాటలో చెప్పాలంటే.. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే దీపావళి. అజ్ఞానాన్ని నశింపచేసి, జగతిని జాగృతం చేసే వెలుగుల పండుగిది. 
డా.పి.లలితవాణి 


Published : 16 Oct 2025 02:54 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని