మాతృభక్తి.. మహావిష్ణు సేవ!

Eenadu icon
By Features Desk Updated : 24 Jul 2025 06:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

జులై 29 గరుడపంచమి

మాతృభక్తికి, మహావిష్ణువు సేవకు పరమ నిదర్శనం గరుత్మంతుడు.  స్వర్గంలో పోరాడి అమృతాన్ని తెచ్చి తల్లిని దాస్యంనుంచి విడుదలచేశాడు. తను మాత్రం బిందువైనా సేవించ లేదు. గరుడుడి సాహస త్యాగాలకు విష్ణువే ఆశ్చర్యపోయి.. వాహనంగా చేసుకున్నాడు. త్యాగగుణం ఉంటే భగవంతుడు తన ఆత్మీయభక్తుడిగా భావిస్తాడనటానికి ఇది తార్కాణం. విష్ణుమూర్తి జరిపిన శిష్టరక్షణ, దుష్ట శిక్షణలో గరుత్మంతుడి సహకారం అనన్యసామాన్యం. గరుడుడు వేద స్వరూపుడుని ధర్మ గ్రంథాలు కీర్తించాయి. గీతలో కృష్ణుడు విష్ణువాహన మైన గరుత్మంతుడు తానేనని స్పష్టం చేశాడు. 

గరుత్మంతుడి ప్రస్తావన రామాయణంలోనూ కనిపిస్తుంది. ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రానికి రామలక్ష్మణులు మూర్ఛపోయారు. అప్పుడు దేవలోకం నుంచి గరుత్మంతుడు మహాప్రభంజనంలా ప్రత్యక్ష మవుతాడు. ఆ ప్రభావంతో రామలక్ష్మణుల నాగ పాశాలన్నీ విడిపోతాయి. పక్షిరాజు స్వహస్తాలతో స్పృశించి ఆ అపూర్వసోదరుల గాయాల్ని మాన్పాడు.

గజరాజరక్షకుడికి గరుడవాహనమై..

శ్రీవేంకటేశ్వరుడి వేడుకల్లో ఆ ఖగరాజుకు ఎంతో ప్రాధాన్యం. తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ తలమానికం. గరుడధ్వజాన్ని ఎగురవేయటం, గరుడ వాహనంపై స్వామిని ఊరేగించటం, పరిసమాప్తి రోజున గరుడధ్వజ అవరోహణ ఆనవాయితీ. ఇలా ఆ కోనేటిరాయడిది, ఖగరాజుది అవినాభావ సంబంధం. భక్తకవి యామునాచార్యులు ‘గరుడుడు విష్ణుమూర్తికి దాసుడుగా, సఖుడుగా, వాహనంగా, ఆసనంగా, ధ్వజంగా, ఛత్రంగా, విసనకర్రగా సేవలందిస్తున్నాడు’ అని కొనియాడాడు. గరుడుని రెక్కలు జ్ఞానవైరాగ్యాలకి ప్రతీకలని తత్వవేత్తలు నిర్వచిస్తారు.
గరుడుడి ఘనతకు దర్పణం గరుడపురాణం. విష్ణువు స్వయంగా ఈ పురాణాన్ని గరుత్మంతుడికి వినిపించాడట. మనం చేసే పాపాలకు పరలోకంలో అనుభవించే శిక్షలకు సంబంధించిందే గరుడపురాణం.

ప్రతి పున్నమికీ వైభవంగా..

తిరుమల బ్రహోత్సవాల్లో గరుడవాహన సేవ అత్యంత ప్రత్యేకం. ఆ పవిత్రమైన రోజు స్వామి గరుడునిపై వైకుంఠమూర్తిగా దర్శనమిస్తాడు. ఆ వాహన సేవ జరిగే రోజున తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి బహూకరించిన తులసిమాలలు శ్రీవారికి అలంకరిస్తారు. ఆనందనిలయంలో శ్రీవేంకటేశ్వర మూలవిరాట్టుకు సదా అలంకరించే మకరకంఠి (ఒక కంఠాభరణం), లక్ష్మీహారం, సహస్రనామ మాలల్ని గరుడవాహన సేవ రోజున ఉత్సవమూర్తికి సమర్పిస్తారు. చెన్నైలోని హిందూ ధర్మార్థసమితి నూతనంగా తయారుచేసిన తొమ్మిది గొడుగులను భక్తులు పాదచారులై తిరుమలకు తెచ్చి సమర్పించటం సంప్రదాయం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే కాకుండా ప్రతి పౌర్ణమికీ తిరుమలలో ‘పున్నమి గరుడసేవ’ వైభవంగా నిర్వహించటం ఆనవాయితీ.

భగవంతుణ్ణి భక్తులదరికి చేర్చే పుణ్య కార్యకర్త గరుడుడు. త్యాగరాజస్వామి ఆ పక్షిరాజును స్మరిస్తూ ‘ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో’ అంటూ ఆవేదనచెందితే.. భక్తరామదాసు ‘గరుడగమన రారా!’ అని ప్రార్థించాడు. అన్నమయ్య బ్రహ్మోత్సవాల్లోని గరుడవాహనసేవ వైభవాన్ని వేనోళ్ల కీర్తించాడు. తమిళనాడు నాచ్చియార్‌ కోవెలలో ఉత్సవ మూర్తిగా, కర్ణాటక కోలదేవి గ్రామంలోని గరుత్మంతుడి ఆలయంలో మూలమూర్తిగా పూజలందుకుంటున్నాడు. గరుత్మంతుని పూజిస్తే సర్పబాధల నుంచి విముక్తి కలుగుతుందంటారు. శ్రావణశుద్ధ పంచమి గరుత్మంతుడి జన్మదినమని, అమృతభాండం తెచ్చింది ఈరోజేనని తెలియజేసే పౌరాణిక కథలున్నాయి.
బి.సైదులు
 


Published : 24 Jul 2025 01:16 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు