సర్వశుభ సోపానం.. సమున్నత లక్ష్యసాధనం

Eenadu icon
By Features Desk Updated : 03 Jul 2025 05:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

జులై 7 ప్రపంచ క్షమా దినోత్సవం

జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించటానికీ, సర్వశుభాలు సమకూరటానికీ ఒకే ఒక్క సుగుణం క్షమ. ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా తట్టుకునే సహనం, ఎలాంటి క్రూరులనైనా క్షమించే ఔన్నత్యంతో శ్రీరామచంద్రుడు, ధర్మరాజు, శమీకముని తదితరులు మనందరికీ ఆదర్శంగా నిలిచారు. 

క్షమకు మరో రూపం భూమాత. తవ్వినా, తన్నినా, మురికి చేసినా భూమాత సహించి క్షమిస్తుంది. కణకణమండే నిప్పులు మరెక్కడ పడినా అగ్గి రగిలి బూడిదవుతుంది. కానీ నేల మీద మాత్రం కాసింతసేపు మండి చల్లారాల్సిందే తప్ప నేల చలించదు. అందుకే ధరణిలా క్షమను అలవరచుకుంటే ఎంతటి కోపజ్వాలలైనా, కుటిల కుయుక్తులైనా దహించలేవు.
ఎన్నెన్నో సద్గుణాల రూపం ఒక్క క్షమ. సహనం చూపి క్షమించడం అలవరచుకుంటే ఎంతటి దుర్మార్గుల్లోనైనా పశ్చాత్తాపం కలుగుతుంది, దుర్గుణాలూ, దురాగతాలూ అంతరిస్తాయని ఎందరో ఆధ్యాత్మికవేత్తలు ఎన్నో సందర్భాల్లో ప్రవచించారు. ‘క్షమ కవచంబు, క్రోధమది శత్రువు..’ అంటూ ఏనుగు లక్ష్మణ కవి రచించిన చక్కటి పద్యం ఉంది. క్షమించే గుణం ఉన్న వ్యక్తికి వేరే రక్షణ కవచం అవసరం లేదు. కోపోద్రేకాలతో ఎగసిపడేవానికి వేరే శత్రువులు ఉండనవసరంలేదు. దాయాదులు ఉంటే వేరే నిప్పు అవసరం లేదు. మంచి మిత్రులు ఉన్న వ్యక్తికి ఔషధాలేమీ అక్కరలేదు. దుష్టులు చెంతన ఉంటే ఇక భయంకరమైన విషసర్పాలు మాత్రం ఎందుకు? బాగా చదువుకున్నవారికి మరే సంపదలూ అక్కర్లేదు. లజ్జ ఉన్నవారికి ఎటువంటి ఆభరణాలూ ఉండాల్సిన అవసరం లేదు. ఉదాత్తమైన కవితాశక్తి ఉన్నవానికి రాజ్యం అక్కర్లేదు’ అన్నది ఆ పద్య భావం. అంటే క్షమ రక్షిస్తుంది. కోపం నాశనం చేస్తుంది. దాయాదులు కీడు చేస్తారు. స్నేహితులు హితవు కోరి, మంచి దారి చూపిస్తారు. దుష్టులు హాని చేస్తారు. విద్య తరగని నిధిగా ఆదుకుంటుంది. లజ్జ.. అంటే యుక్తమైన ప్రవర్తనే అలంకారమవుతుంది. ఉదాత్తుడైన కవి పాలకులను మించిన కీర్తిని పొందుతాడు- అన్నది కవి భావన. 

పెద్దలు సరిదిద్దాలి

క్షమ గలిగిన సిరి గలుగును క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్‌ 
క్షమ గలుగఁ దోన కలుగును క్షమ గలిగిన మెచ్చు శౌరి సదయుఁడు దండ్రీ!

ఇది పోతన భాగవతంలోని పద్యం. పరశురాముడు కార్తవీర్యార్జునుణ్ణి సంహరించి కామధేనువును ఆశ్రమానికి తీసుకొచ్చి తన పరాక్రమాన్ని వివరించాడు. అప్పుడు జమదగ్ని పుత్రుడికి  క్షమ ఉంటే సంపద కలుగుతుంది, విద్య అబ్బుతుంది, సుఖాలన్నీ కలుగుతాయి. క్షమ ఉంటే దయామయుడైన శ్రీహరి సంతోషిస్తాడు- అంటూ ఉపదేశించాడు. దైవం సంతోషించాడంటే ఆ భక్తుడికి ఇక కావలసిందేముంటుంది. ఈ ఒక్క మాటతో పరశురాముడిలో పశ్చాత్తాపం కలిగింది. చేసిన పాప ప్రక్షాళనకు తీర్థయాత్రలకు బయలు దేరాడు. క్షమ గురించి తెలియాలే కానీ శాంత గుణం, పశ్చాత్తాప తత్త్వం అలవాటు అవుతాయనటానికి ఇదొక ఉదాహరణ.

ఇలాంటి సుభాషితాలు, నీతి వచనాలు ప్రతి తరంలోనూ ఎవరో ఒకరు ముందుతరంలోని పెద్దలు పిల్లలకు చెపుతూ ఉండాలి. అటు వంటి ప్రయత్నం నిరంతరం సాగుతూ ఉంటుందనటానికి ఈ సుభాషితమే ఓ ఉదాహరణ. సుభాషిత త్రిశతి లోని ఒక శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో చెప్పిన పద్యమే ఇది. ఇది నేటి తరానికి ఆదర్శంగా కనిపిస్తుంది.

మోహించిన వాయుదేవుడు

క్షమ విలువను తెలిపే కథ ఒకటి రామాయణంలో ఉంది. తాటకి వధ కోసం రామలక్ష్మణులను అడవులకు తీసుకెళ్తున్న విశ్వామిత్రుడు తన వంశం గురించి చెబుతూ- కుశనాభుడనే రాజర్షికి నూరుగురు అతిలోక సౌందర్యవతులైన కుమార్తెలున్నారు. ఒకరోజు వాళ్లు వనవిహారానికి వెళ్లగా వాయుదేవుడు మోహించి.. అందరినీ తాను పెండ్లాడతానని, అందుకు సమ్మతిస్తే నిత్యయవ్వనం ఉండేలా వరమిస్తానని అన్నాడు. యువతులు తండ్రికి తెలియకుండా తాము ఏ పనీ చెయ్యమని, తమకు దూరంగా ఉండమన్నారు. సర్వవ్యాపి, సర్వస్పర్శి అయిన వాయుదేవుడు ఆ తిరస్కారాన్ని భరించలేక అక్కచెల్లెళ్లను అందవికారంగా మార్చేశాడు. వాళ్లు క్షమ ప్రదర్శించి నోరు మెదపలేదు.

కుమార్తెలు చూపిన సహనానికి ఆనందించిన కుశనాభుడు ‘అమ్మాయిలూ! 

క్షమా దానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః 
క్షమా యశః క్షమా ధర్మః క్షమయా నిష్ఠితం జగత్‌

క్షమే దానం, క్షమే యజ్ఞం, అదే సత్యం, ధర్మం, కీర్తి. క్షమ ఆధారంగానే ఈ జగత్తు నిలిచి ఉంటోంది- అనేది ఈ శ్లోకానికి అర్థం.

క్షమ విశేష గుణం. పురుషులకైనా స్త్రీలకైనా అది గొప్ప ఆభరణం. దీన్ని అలవర్చుకోవడం ఒక్కోసారి దేవతలకు కూడా సాధ్యం కాదు. మీరంతా కలిసికట్టుగా వాయుదేవుణ్ణి క్షమించటం అనే మహత్కార్యంతో వంశం పేరు నిలబెట్టారు’ అంటూ ప్రశంసించాడు.

చిత్రమేమంటే వారి క్షమ వాయుదేవుడిలో పశ్చాత్తాపం కలిగించింది. వాళ్లు పెళ్లి చేసుకున్నాక.. కురూపులుగా ఉన్నవారిని తిరిగి సర్వాంగసుందరీమణులు అయ్యేట్టు ఆశీర్వదించి వెళ్లాడు. క్షమ పరివర్తన కలిగిస్తుంది. క్షమాగుణానికి అంత శక్తి ఉంది కనుకనే కోపతాపాలను తగ్గించుకుని శాంతంగా, సహనంగా ఉండాలని, ప్రయత్నపూర్వకంగా నైనా క్షమను అలవరచుకోవాలని చెబుతారు పెద్దలు. 

డా.యల్లాప్రగడ మల్లికార్జున రావు, గుంటూరు


Published : 03 Jul 2025 00:05 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని