Garuda Vahana Seva: గజరాజ రక్షకుడికి గరుడవాహన సేవ

Eenadu icon
By Features Desk Published : 25 Sep 2025 03:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సెప్టెంబరు 28 తిరుమల శ్రీవారి గరుడోత్సవం 

తిరుమల వాసుని బ్రహ్మోత్సవాల్లో రమణీయ ఘట్టం గరుడవాహన సేవ. పది రోజుల ఈ వేడుకల్లో అయిదో నాడు గరుత్మంతుడి వాహనంపై స్వామి ఊరేగుతాడు. ఈ మహ్మోత్సవాల్లో తొలిరోజు, చివరిరోజు కూడా గరుడ స్వామికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి పూజించటం సంప్రదాయం. శ్రీవారి ముఖ్యసేవకుడైన గరుడుడు సప్తగిరులపైనా తన ఉనికిని చాటుకుంటున్నాడు. శ్రీమహావిష్ణువు అవతారమే శ్రీవేంకటేశ్వరుడని గుర్తుచేస్తున్నాడు.

తిరుమల బ్రహోత్సవాల్లో భాగంగా ఏడుకొండల వెంకటేశ్వరుడికి అయిదో రోజు నిర్వహించే గరుడవాహన సేవ అపురూపమే కాదు అత్యంత ప్రత్యేకం కూడా. ఆపదమొక్కులవాడికి ఆ రోజు జరిగే అలంకారాల్లో, ప్రసాదనివేదనల్లో, ప్రబంధ పారాయణాల్లో ఎన్నో విశేషాలుంటాయి. ఆ పవిత్రమైన రోజు శ్రీనిలయుడు గరుడునిపై వైకుంఠమూర్తిగా దర్శనమిస్తాడు. ఆ విశేష వాహన సేవ జరిగే రోజున తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి బహూకరించిన తులసిమాలలు శ్రీవారికి అలంకరిస్తారు. ఆనందనిలయంలో శ్రీవేంకటేశ్వర మూలవిరాట్టుకు సదా అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలల్ని గరుడవాహన సేవ రోజున ఉత్సవమూర్తికి సమర్పిస్తారు. చెన్నైలోని హిందూ ధర్మార్థసమితి   నూతనంగా తయారుచేసిన తొమ్మిది గొడుగులను భక్తులు పాదచారులై తిరుమలకు తెచ్చి సమర్పించటం సంప్రదాయం.

భగవంతుణ్ణి భక్తుల దరికి చేర్చే పుణ్యకార్యకర్త గరుత్మంతుడు. అందుకే సద్గురు త్యాగరాజస్వామి ఆ పక్షిరాజును స్మరించుకుంటూ ‘నగుమోము గన లేని..’ అనే కీర్తనలో ‘ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో.. గగనానికి.. ఈ ఇలకూ బహుదూరం బనినాడో..’ అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. అలాగే భక్తరామదాసు ‘గరుడగమన రారా! నను నీ కరుణ నేలుకోరా’ అని ఆర్తిగా ప్రార్థించాడు.  శ్రీనివాసుడి సంకీర్తనాచార్యుడు అన్నమయ్య ‘ఇటు గరుడుని నీ వెక్కినను, పటపట దిక్కులు బగ్గన బగిలె..’ అంటూ బ్రహ్మోత్సవాల్లోని గరుడవాహనసేవ వైభవాన్ని వేనోళ్ల వినుతించాడు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని