విష్ణుమూర్తికి ప్రీతికరం

Eenadu icon
By Features Desk Published : 03 Jul 2025 00:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

జులై 6 తొలి ఏకాదశి

తిథుల్లో ఏకాదశి విశిష్టమైంది. అందునా ఆషాఢశుద్ధ ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైంది. ఈ తొలిఏకాదశి నుంచి కార్తికశుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. ఈ రోజు చేసే అర్చనలకు శ్రీమహావిష్ణువు ప్రీతిచెంది భక్తులను అనుగ్రహిస్తాడని పురాణవచనం. ఈ రోజున ప్రారంభించే పనులు విజయవంతం అవుతాయంటారు. పురాణ కథనాన్ని అనుసరించి- విష్ణువు మురాసురుడితో యుద్ధంచేస్తూ అలసిపోయి, సింహవతి అనే గుహలో సేదతీరుతున్నాడు. అది గమనించిన ఆ రాక్షసుడు మాయోపాయంతో దాడికి సిద్ధమయ్యాడు. అప్పుడు విష్ణువు శరీరం నుంచి యోగమాయ శక్తిరూపంలో వెలువడి మురాసురుణ్ణి సంహరించింది. ఆ శక్తిస్వరూపానికి శ్రీహరి వరం అనుగ్రహించాడు. ఆ స్వామికి ప్రియమైన తిథిగా ఏకాదశి పేరిట పూజలందుకుంటోంది. విష్ణుమూర్తి యోగనిద్రలో ప్రవేశించే ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశి. స్వామి నిద్రించేరోజు కాబట్టి శయన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి ఉపవాస, జాగారాలు పాటిస్తారు. ఉపవాసం వలన ఇంద్రియ నిగ్రహం అలవడటమే కాదు, జీర్ణ వ్యవస్థ ఉత్తేజితమవుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఏకాదశి ఉపవాసానంతరం ద్వాదశి నాడు ఉదయానే స్వామిని పూజించి.. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత భోజనం చేస్తారు. తొలి ఏకాదశి రోజున పేలాల్లో బెల్లం, యాలకులు వేసి దంచి పిండిగా తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని స్వామికి నివేదించి, ప్రసాదంగా సేవిస్తారు. ఇది ఆరోగ్ర ప్రదాయని ఈ కాలంలో వచ్చే అనారోగ్యాలను శరీరం తట్టుకోగల శక్తిని కలిగిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. ఆషాడశుద్ధ ఏకాదశి నుంచి దేవతలకు రాత్రి మొదలవుతుంది.ఏకాదశి నియమాలను పాటించేవారు జ్ఞానవంతులవుతారని, గతజన్మల పాపాలు తొలగుతాయని పెద్దలు చెబుతారు.

నూతి శివానందం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు