Google Trends - Ganesh Chaturthi: శరణమయ్యా శంకరతనయా..

Eenadu icon
By Features Desk Updated : 27 Aug 2025 20:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఆగస్టు-27 వినాయకచవితి

ఆదిపూజలు అందుకునే దేవుడు.. ఊరూవాడా కొలువై ఉండ్రాళ్లు స్వీకరించే బొజ్జగణపయ్య.. వ్యక్తిలో ధైర్యాన్ని, సమూహంలో స్ఫూర్తిని నింపే ఏకదంతుడు.. తన భక్తుల మొర ఆలకించి ఆశీర్వదించేందుకు ఈసారీ మండపాల్లోకి విచ్చేస్తున్నాడు!

గణపతి మంగళకరుడు. లోకాల్ని పీడించే దుష్ట రాక్షస శక్తుల్ని రూపుమాపేందుకు పార్వతీ పరమేశ్వరులు సంకల్పించి ఆయన్ను సృష్టించారు. దేహాన్ని తల్లి, శిరోభాగాన్ని తండ్రి ప్రసాదించగా అవతరించిన స్వామి గజాననుడు. ఆయన ప్రథమ ప్రమథ గణాధ్యక్షుడు. సద్గుణ గణాలకి అధిపతి గణపతి. విశ్వమంతటినీ ఆదేశించగల నాయకుడు. లోకంలో సామరస్య భావానికి అంకురార్పణ చేసినవాడు. ఆయన చైతన్య ప్రదాత, వేదవేద్యుడు, ప్రణవస్వరూపుడు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడు. వక్రతుండుడు సమస్త విద్యలకు, కళలకు ఆదిమూలమైన ఆచార్యుడు, అధినేత. భారత రచనలో వ్యాసభగవానుడు చెప్పే సంఘటనల్ని అర్థం చేసుకుంటూ ఘంటం ఆపకుండా గ్రంథాన్ని రాసిపెట్టిన ఘనత గణనాథుడిదే!

ఎన్నోనామాలు..

విఘ్నేశ్వరుడికి ఎన్నో పేర్లు. వినాయకుడు అంటే వేరొక నాయకుడు లేని సర్వస్వతంత్రుడు. గణపతి- శివ, ప్రమథ  గణాలకు సర్వప్రధాని. గజముఖుడు - జ్ఞానమోక్షాలిచ్చేవాడు. ఏకదంతుడు- అద్వైత  సిద్ధాంతానికి ప్రతీక. ఆత్మే పరమాత్మ అని సూచించే నామం. లంబోదరుడు- బ్రహ్మాండమంత బొజ్జగలవాడు. హేరంబుడు- భక్తుల క్షేమాన్ని అభివృద్ధిని కోరేవాడు. అంతే కాదు ఆ రెండింటినీ ప్రసాదించేవాడు.  మోదకహస్తుడు- జ్ఞాన పరిపూర్ణుడు, జ్ఞానదాత. మూషికవాహనుడు- అజ్ఞాన చపలత్వాన్ని అణచేవాడు. ఇలా అనేక నామాలతో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. వినాయకుని ఉపాసన సర్వశక్తిప్రదం. పెద్ద తల జ్ఞానానికి ప్రతీక. తొండం సూక్ష్మగ్రాహ్యతకు చిహ్నం. పెద్ద చెవులు వైదిక శ్రవణాసక్తికి సాధనాలు. ఆయన మొలతాడు అంటే నాగబంధం కుండలినీ శక్తికి ఆలంబనం. ఏకదంతం విద్యాసాధనకూ, కవితా శిల్పానికి ప్రతిరూపం. అందుకే విశిష్ట జ్ఞానప్రదాత అయిన ఉమాసుతుడికి తొలిపూజ చేయటం సర్వ 
శ్రేయస్కరం, శుభప్రదమని భక్తులు నమ్ముతారు.

ణపతి యజ్ఞోపవీతం - పాము, వాహనం - ఎలుక. పాము-ఎలుక సహజంగా శత్రువులు. కానీ గణపతి దగ్గర అవి వైరం లేకుండా గడుపుతున్నాయి. పతంజలి మహర్షి యోగసూత్రంలో సహజవైరం ఉన్న ప్రాణులు ఏ దేవుని సన్నిధిలో వైరం లేకుండా ఉంటాయో ఆ దేవుణ్ని పూజించటం వల్ల యోగసిద్ధి కలుగుతుందని స్పష్టం చేశారు. అందుకే కార్యసిద్ధి, యోగసిద్ధి, జ్ఞానసిద్ధి పొందాలంటే వినాయకుడిని శరణువేడాలి. 

భారతీయులు జరిపే అన్ని పండుగల్లోనూ ప్రశస్తమైంది వినాయకచవితి. ఇది జీవ చైతన్యానికి, ఇచ్ఛా క్రియాశక్తుల సంయమనానికీ సంకేతమని తాత్వికులు వ్యాఖ్యానిస్తారు. భాద్రపద శుద్ధ చవితి వినాయకుడు ఆవిర్భవించిన పవిత్రదినం. అదే ‘వినాయక చవితి’. ఆ రోజు పూజాపీఠం సిద్ధం చేసి, ప్రతిమను ప్రతిష్ఠించి, గణేశుని స్తుతించి 21 రకాల పత్రితో పూజించటం ఆనవాయితీ. విఘ్నపతికి ఇష్టమైన పదార్థాలు నివేదించడం, వ్రతకథ చదవడం సంప్రదాయం. గణపతి పూజ సులభం, ఫలం అధికమని భక్తుల విశ్వాసం.   


గణపతి పూజతో విశేష ఫలాలు

వినాయకుడ్ని ఆరాధించి విశేష ఫలితాల్ని పొందిన ఉదంతాలు మన పురాణాల్లో కోకొల్లలు. కృష్ణుని సలహా మేరకు కుచేలుడు వినాయకవ్రతం చేసి దారిద్య్రం నుంచి విముక్తుడయ్యాడని ‘శ్రీకృష్ణ  శమంతకమణి’ వృత్తాంతం చెబుతోంది. అలాగే లంబోదరుడి పూజ మనల్ని అపనిందల బారిన  పడకుండా కాపాడుతుందని ఆ కథ వివరిస్తుంది. వారధి కట్టేముందు శ్రీరాముడు విఘ్ననాథుని అర్చించి, రావణునిపై సునాయాసంగా విజయాన్ని సాధించాడని వినాయక వ్రతకథలో ఉంది. క్షీరసాగర మథనంలో దేవతలు అమృతం కోసం, వామనుడు బలిని జయించటం కోసం కూడా తొలుత ఆయననే పూజించారట. వనవాసం  పూర్తయ్యాక పాండవులు వినాయకవ్రతం చేసి యుద్ధానికి వెళ్లినట్లు మహాభారతంలో కనిపిస్తుంది. శివభక్తుడైన రావణుడు శివుని ఆత్మలింగం పొందేముందు వినాయకవ్రతం ఆచరించలేదట. అందుకే విఘ్నం వాటిల్లి దశకంఠుడి కోరిక నెరవేరలేదట. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు, భూభారం తలదాల్చే ముందు ఆదిశేషుడు, రాక్షస సంహారానికి వెళ్లబోయే ముందు శ్రీమహావిష్ణువు విఘ్నేశ్వరుడిని పూజించారని పురాణాలు చెబుతున్నాయి. మహేశ్వరుడు, ఇంద్రుడు, జగదాంబ గణపతికి తొలిపూజలు చేశారన్నది ధార్మిక గ్రంథాల మాట. 

బి.సైదులు


Published : 21 Aug 2025 00:30 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు